బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Jan 24, 2020 , 04:51:38

గంటన్నరలోనే..

 గంటన్నరలోనే..


జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 23 : మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏకశిల బీఈడీ కళాశాలలో జనగామ మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి టేబుల్ జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించడంతోపాటు వెబ్ విధానంతో ఎన్నికల సంఘం అధికారులు లైవ్ వీక్షించనున్నారు. లెక్కింపు కేంద్రం లోపల, బయట మూడంచల భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ వినయ్ అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ, కమిషనర్ నోముల రవీందర్ యాదవ్, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్ అర్బన్ సీఐ మల్లేశ్ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 25న(శనివారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

జనగామ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పట్టణ శివారులోని ఏకశిల బీఈడీ కళాశాలలోని నాలుగు గదుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండు గదుల్లో తొమ్మిది చొప్పున 18 వార్డులు, మరో రెండు గదుల్లో ఆరు చొప్పున 12 వార్డులు మొత్తం 30 వార్డులకు సంబంధించిన ఓట్లు లెక్కించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఒకటో రూంలో 1వ వార్డు నుంచి 6వ వార్డు వరకు, 2వ రూంలో 7వ వార్డు నుంచి 15వ వార్డు వరకు, 3వ రూంలో 16వ వార్డు నుంచి 24వ వార్డు, 4వ రూంలో 25వ వార్డు నుంచి 30వ వార్డు వరకు ఓట్లను లెక్కిస్తారు. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారితోపాటు అభ్యర్థులు ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు టేబుళ్లపై కౌంటింగ్ ప్రక్రియను దగ్గర నుంచి చూసేందుకు వీలుగా పోలింగ్ ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా ఇనుప కంచతో ఫెన్సింగ్, గది మధ్యలో టేబుళ్లు, కౌంటింగ్ సిబ్బందికి కుర్చీలు ఏర్పాటుచేశారు. కౌంటింగ్ సిబ్బంది టేబుళ్ల వద్దకు ఎవరూ వెళ్లేందుకు వీలులేకుండా చుట్టూ భద్రత పరమైన కంచెను ఏర్పాటు చేశారు. 30 వార్డుల్లో ఎన్నికల కౌటింగ్ సిబ్బందిని నియమించి వారికి ఇప్పటికే దశలవారీగా శిక్షణ ఇచ్చి మాక్ కౌంటింగ్ శిక్షణ పూర్తిచేశారు.

వార్డుకు ఒక కౌంటింగ్ సూపర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక అటెండర్, 30 కౌంటింగ్ సూపర్ 60 కౌంటింగ్ అసిస్టెంట్లు, 18 మంది రిజర్వులో ఉంటారు. ఒక్కోవార్డుకు అభ్యర్ధి సహా ముగ్గురిని లెక్కింపు కేంద్రంలోకి అనుమతి పాసులు జారీ చేయనుండగా అందులో అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్ అవకాశం ఉంటుంది. 30 టేబుళ్లపై 30 మంది ఏజెంట్లు, రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి ప్రతినిధి, బోర్డు రిపోర్టు వద్ద ఒకరిని ప్రక్రియ పరిశీలనకు సూపర్ అనుమతిస్తారు. అభ్యర్థితో పాటు అయన తరుపున హాజరయ్యే కౌంటింగ్ ఏజెంట్లు శనివారం ఉదయం 7 గంటలకే కేంద్రం వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు ఒకేసారి 30 వార్డుల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఒక వార్డు ఓట్లు ఒక రౌండ్ లెక్కించనుండగా, 30 వార్డుల ఫలితాలు ఒకే రౌండ్ వెల్లడికానున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటన్నరలోనే అంటే ఉదయం 9.00 గంటల నుంచి ఆయా వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థుల బలాబలాల ట్రెండ్ మొదలై ఉదయం 11.30 గంటల వరకు మొత్తం అన్ని వార్డుల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ కాగితాలు తీసుకుపోవడాన్ని నిషేధించారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీచేశారు.


కౌంటింగ్ ప్రక్రియ ఇలా..


- జనగామ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులకు ఒకేసారి కౌంటింగ్ మొదలు.
- ఒక్కో వార్డుకు ఒక టేబుల్, రిటర్నింగ్ అధికారికి మరో టేబుల్ ఏర్పాటు.
- కౌంటింగ్ ముందు ప్రిసైడింగ్ అధికారి సంతకంతో ఉన్న 17 సీ ఫారం వివరాలు ఏజెంట్లకు తెలియజేస్తారు.
- ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం. మొదటి అర్ధగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు (పోలింగ్ ఫలితంలో తేడా వస్తే ఇవే కీలకం అవుతాయి).
- అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.
- 17 సీ ఫారంలో పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి(పోలింగ్ పూర్తయ్యాక నమోదు చేసినవి).
- పోలైన ఓట్లు, బాక్సులో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో.. లేదో సరిచూసుకుంటారు.
- వాటిని ఏజెంట్లు నోట్ చేసుకున్న అనంతరం బాక్స్ సీల్ తొలగిస్తారు.
- ఒక్కో వార్డులో రెండు పోలింగ్ బూత్ సంబంధించిన బ్యాలెట్ పత్రాలను జంబ్లింగ్ చేస్తారు.
- అనంతరం మొత్తం ఓట్లను 25 చొప్పున లెక్కించి కట్టలు కడతారు.
- తర్వాత మరోసారి పోలైన ఓట్లతో బ్యాలెట్ పత్రాల సంఖ్యను సరిచూసుకుంటారు.
- అనంతరం కట్టలు కట్టిన బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తూ అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేస్తారు.
- 1వ రూంలో 1 నుంచి 6వ వార్డు వరకు, 2వ రూంలో 7వ వార్డు నుంచి 15వ వార్డు వరకు, 3వ రూంలో 16వ వార్డు నుంచి 24వ వార్డు, 4వ రూంలో 25వ వార్డు నుంచి 30వ వార్డు వరకు ఓట్లను లెక్కిస్తారు.
- ఒకరౌండ్ 1500 ఓట్లు లెక్కిస్తారు.. అంతకుమించి ఓట్లు ఉంటే రెండోరౌండ్ లెక్కిస్తారు.
- జనగామ మున్సిపల్ 1500కు మించి ఏ వార్డులో ఓట్లు లేనందున ఒకేరౌండ్ కౌంటింగ్ పూర్తవుతుంది.
- ఉదయం 7 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు కేంద్రానికి రావాలి.
- 8 గంటలకు కౌంటింగ్ మొదలైన తర్వాత తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు.
- 8.30 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు.
- 9.30 గంటల నుంచి వార్డుల వారీగా అభ్యర్థుల బలాబలాలు వెల్లడికానుండగా, మొత్తం ప్రక్రియ ఉదయం 11.30 గంటల వరకు పూర్తి కానున్నది.
- ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ అసిస్టెంట్ సూపర్ మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
- లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయ పార్టీలు, ఏజెంట్ల సమక్షంలో సాగుతుంది.
- ప్రతి రౌండ్ ఫలితం వారికి తెలిపి నిర్ధారణ చేశాకనే వెల్లడిస్తారు.


logo
>>>>>>