సోమవారం 30 మార్చి 2020
Jangaon - Jan 24, 2020 , 04:51:38

‘ఆదర్శ’ంగా ఆంగ్ల బోధన

‘ఆదర్శ’ంగా ఆంగ్ల బోధన


బచ్చన్నపేట : ఆధునిక సమాజం.. రాకెట్ కంటే వేగంగా పరుగెడుతోంది. ఇక టెక్నాలజీ ప్రపంచాన్ని ఒకే గ్రామంగా మార్చేసింది. ఈ ఆధునిక ప్రపంచంలో మాట్లాడాలంటే.. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రావాల్సిందే.. మనిషి ఎదగడానికి ఇంగ్లీష్ కూడా ఒక సాధనమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతవర్గాలు మాత్రమే తమ పిల్లలకు కార్పొరేట్ ఎడ్యూకేషన్ అందిస్తున్నారు. పేదవాళ్లకు సైతం కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల విద్యను అందించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి మండలంలో ఆదర్శ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి పేదవిద్యార్థులకు మెరుగైన ఆంగ్ల విద్యను అందిస్తోంది. జనగామ జిల్లాలో 12 మండలాలు ఉండగా 8 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ప్రభుత్వం నెలకొల్పింది. ఈ పాఠశాలల్లో సుమారు 8వేల మంది విద్యార్థులు ఆంగ్లంలో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేట్ ధీటుగా ఆంగ్లబోధనలు చేపడుతూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి విద్యార్థులు బచ్చన్నపేటలోని ఆదర్శ పాఠశాలలో చేరుతున్నారు.

 2013లో మండలకేంద్రంలో పాఠశాలను ప్రారంభించగా 300 మంది ఆరు నుంచి పదో తరగతి వరకు చేరగా, 80 మంది ఇంటర్ విద్యార్థులు కళాశాలలో చేరారు. ప్రస్తుతం పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు 600 మంది ఉన్నారు. ఇంటర్ మీడియట్ 152 మంది చదువుకుంటున్నారు. రెండేళ్లుగా పది పరీక్షల ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గత ఏడాది పదిలో 96 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వందశాతం ఉత్తీర్ణత సాధించారు. అంతేకాకుండా ముగ్గురు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. మండల స్థాయిలో టాపర్ నిలిచే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దగలుగుతున్నారు. అదేవిధంగా చదువుతో పాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల్లో విద్యార్థులు రాణించేలా చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పొచ్చు.

ఇంగ్లిష్ రాదేమోననుకున్నా..

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బచ్చన్నపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియంలో చదివాను. ఆరో తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తే నాకు ఇంగ్లీష్ రాదేమోనని భయపడ్డా. కాని టీచర్లు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పడంతో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న పట్టుదల పెరిగింది. ఇప్పుడు నేను నా స్నేహితులతో గారాలంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా.. నాకు ఇంగ్లీష్ నేర్పించిన సార్లకు జీవితాంతం రుణపడి ఉంటా.
- బోడకుంటి దీక్షిత (ఆరోతరగతి)

పేరుకు తగ్గట్టుగా ఆదర్శంగా పాఠశాల

పేరుకు తగ్గట్టుగా పాఠశాలలో ఆదర్శంగా పాఠాలు చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు మించి సౌకర్యాలు ఆదర్శ పాఠశాలలో ఉన్నా యి. ఇంట్లో తిన్నదాని కంటే రుచిగా భోజనం అందిస్తున్నారు. ఉపాధ్యాయుల తీరు, పాఠశాలలో చదువుతో పాటు  క్రమశిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటాపాటలు చెప్పించడంలోనూ మా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఆదర్శమే. కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్నట్లుంది.
- జంగిలి మధువాజ్ ( పదో తరగతి)

అర్థమయ్యేవరకు బోధన

పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ అర్థమయ్యే రీతిలో బోధన జరుపుతున్నం. వారికి అర్థమయ్యే వరకు బోధన చేస్తున్నాం. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రతిభా పరీక్షలు నిర్వహించి, వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు చెబుతున్నం. క్రమశిక్షణ, చదువుపై శ్రద్ధ చూపించేలా వారికి అవగాహన కల్పిస్తాం. ప్రతి విద్యార్థి చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తమ ఆకాంక్ష.
- జయప్రకాశ్ (ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు)


ఆదర్శంగా నిలిపేందుకు కృషి

విద్యార్థుల తల్లితండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రతి పేద విద్యార్థికి ఆంగ్లబోధన అందించాలన్న ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల, కళాశాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తున్నాం. ఇంటర్ చదివే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. ప్రతి రోజు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నాం.
- కృష్ణవేణి (ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, కళాశాల)logo