శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Jan 24, 2020 , 04:51:38

భక్తులకు భాగ్యం.!

భక్తులకు భాగ్యం.!


పాలకుర్తి జనవరి 23: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామివారిని  దర్శించుకునేందుకు వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేసే గుత్తేదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. గతంలో గుత్తేదారులు  నిర్ణయించిన ధరలకే భక్తుల నుంచి అభిషేకానికి, వాహనానికి టిక్కెట్, పూజసామగ్రికి వేర్వేరుగా దోచుకుని భక్తుల జేబులకు చిల్లులు వేసేవారు. పలు సందర్భాల్లో భక్తులు ఆలయసిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయేది. చేసేదేమీ లేక గుత్తేదారులు నిర్ణయించిన ధరకే ఆయా టిక్కెట్లు తీసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి అభిషేకానికి, వాహనానికి, పూజసామగ్రికి కలిపి ఒకే ధరను నిర్ణయించారు.

గుత్తేదారులదే ఇష్టారాజ్యం

స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి గతంలో రూ.200 టికెట్ పూజ సామగ్రి కోసం రూ.250 నుంచి 400 వరకు తీసుకునేవారు. అలాగే వాహన పూజకు రూ.500 నుంచి 800 వరకు చెల్లించేవారు. దీనికి తోడు కొబ్బరి కాయలకు మరో ధర చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇలా గుత్తేదారులదే ఇష్టారాజ్యంగా ఉండేది. టెండర్ బహిరంగ పాటలో అధిక పాట పాడి తమకు ఏమి గిట్టుబాటు కావడం లేదని పెట్టిన పెట్టుబడి చేసిన కష్టానికి తగు ఫలితం లేకుండా పోతుందని కొంతమంది గుత్తేదారులు ఆవేదనను వ్యక్తం చేసేవారు. దానికి దేవస్థానం సిబ్బంది సైతం చూసి చూడనట్లుగా వ్యవహరించేది. ప్రస్తుతం పాలకుర్తి దేవస్థానం తీసుకున్న టిక్కెట్ ధరలు మిగిలిన ఆలయాల్లో కంటే తక్కువగానే నిర్ణయించారు. దేవస్థాన టికెట్  అభిషేకం, వాహన పూజ సామగ్రి సరఫరా చేయనున్నారు.  పెంచిన టిక్కెట్ ధరలు 1 ఫిబ్రవరి నుంచి ఆలయాధికారులు అమలు చేయనున్నారు. 

దేవస్థాన టికెట్ పూజా సామగ్రి

దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు పలు మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకోసం గతంలో దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి రూ.200 పెట్టి టికెట్ ఆపై పూజ సామగ్రికి మరో ధర పెట్టి కొనేవారు. రూ.500కు ప్రత్యేక దర్శనంతోపాటు అభిషేకం పూజ నిర్వహించనున్నారు. అలాగే రూ.200 టికెట్ పూజ సామగ్రి ఇస్తూ బైక్ పూజ చేయనున్నారు. మూడు చక్రాల వాహన పూజ రూ.300, నాలుగు చక్రాలు, భారీవాహనాలకు రూ.400 టికెట్ పూజ సామగ్రి ఇస్తూ వాహన పూజ చేయనున్నారు. ప్రత్యేకంగా దర్శనం టిక్కెట్ అవసరం లేకుండా భక్తులు ఏ పూజలు నిర్వహించుకుంటారో  దానికి సంబంధించిన పూజ సామగ్రి ఇవ్వడంతోపాటు స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటు తీసుకొచ్చారు.

భక్తుల సౌకర్యం కోసమే..

పాలకుర్తి సోమన్న దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసమే ధరలపై ఈ నిర్ణయం, పలు మార్పులకు చర్యలు తీసుకుంటున్నాం. దేవస్థానం టిక్కెట్ కొన్న వారికి సంబంధిత పూజ సామగ్రిని సరఫరా చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సారద్యంలో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహాకారంతో  రానున్న రోజుల్లో పాలకుర్తి పుణ్యక్షేత్రం ఓ టూరిజం  కేంద్రంగా మారబోతుంది. పాలకుర్తి ఆలయంలో త్వరలో భక్తుల కోసం నిత్యాన్నదానంపై చర్యలు తీసుకుంటున్నాం.
- వీరస్వామి ఈవో  పాలకుర్తి దేవస్థానం 


logo