బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Jan 23, 2020 , 02:11:13

ప్రశాంతం

 ప్రశాంతం
  • - 63.37శాతం పోలింగ్ నమోదు
  • - 72 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
  • - ఉదయం మందకొడిగా..
  • - మధ్యాహ్నం నుంచి పుంజుకున్న ఓటింగ్
  • - ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గండ్ర
  • - వెబ్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణ
  • - బందోబస్తును పరిశీలించిన ఇన్ ఎస్పీ

జయశంకర్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. 72 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 63.37శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా సాగిన ఓటింగ్, మధ్యాహ్నం పుంజుకుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. వృద్ధులు, దివ్యాంగులతో ఓటు వేయించేందుకు అధికారులు  ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు.

మున్సిపల్ ఎన్నికలు భూపాలపల్లిలో బుధవారం ప్రశాంతంగా ముగిశా యి. మున్సిపల్ ఎన్నికల్లో 63.37 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నం నుంచి ఓ టింగ్ పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు మున్సిపల్ పరిధిలోని 72 పోలింగ్ కేంద్రాల్లో 12.18 శాతం ఓటింగ్ జరిగింది. 11 గంటల వరకు 30.14 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 46.11 శాతం, 3 గంటల వరకు 57.24 శాతం, 5 గంటల వరకు 63.37 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం మీద గతంలో జరిగిన ఎన్నికలతో పోలీస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా 29 వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 72 పోలింగ్ కేంద్రాల్లో పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుభాశ్ కాలనీలోని 18వ వార్డులో పోలింగ్ బాక్స్ రిపేర్ రావడంతో సుమారు గంట పాటు పోలింగ్ అంతరాయం ఏర్పడింది. అనంతరం మరో బాక్సును తీసుకొచ్చి పోలింగ్ కొనసాగించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అతని తనయుడు గౌతమ్ పాటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పరిస్థితిని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్ ఎస్పీ సంగ్రామ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలింగ్ అధికారులకు, సిబ్బందికి, పోలీసులకు సలహాలు, సూచనలిచ్చారు.
 

దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు

పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. మున్సిపాలిటీ పరిధిలో 72 పోలింగ్ కేంద్రాల్లో వీల్ అందుబాటులో ఉంచారు. వీల్ కోసం ర్యాంపులు ఏర్పాటు చేశారు. నడవడానికి వీల్లేని వృద్ధులు, దివ్యాంగులతో ఓటు వేయించేందుకు అధికారులు ప్రత్యేక వలంటీర్లను నియమించగా, వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

విజయవంతంగా పోలింగ్

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారులు తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ నిర్వహించారు. ఇందుకు పోలింగ్ ఏజెంట్లు ప్రత్యేకంగా సహకరించారు. 72 పోలింగ్ కేంద్రాలకు ఎనిమిది రూట్లుగా, నాలుగు జోన్లుగా విభజించి 56,426 బ్యాలెట్ పేపర్లను అందజేశారు. పోలింగ్ స్టేషన్ ఒకటి చొప్పున 72 బ్యాలెట్ బాక్సులను పోలింగ్ అధికారులకు అందజేసి ఎన్నికలు నిర్వహించారు. నలుగురు జోనల్ అధికారులు, ఎనిమిది మంది రూట్ ఆఫీసర్లు విధులు నిర్వహించారు. 76 మంది ప్రెసిడింగ్ అధికారులు, 76 మంది అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారులు, ఒక ప్రెసిడింగ్ అధికారి పరిధిలో ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించడంతో పాటు 14 మంది అధికారులను రిజర్వ్ చేశారు. 33 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహించారు. వీరితో పాటు ఆరు ఫ్లయింగ్ స్కాడ్ టీంలు, ఆరు ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) టీంలు, 18 ఎస్ (స్టాటికల్ సర్వేలెన్స్) టీంలు పోలింగ్ కేంద్రాల రూట్లలో తిరుగుతూ నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల పరిస్థితులను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు వెబ్ ద్వారా పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి మున్సిపల్ కార్యాయలంలో సెంట్రల్ వెబ్ సిస్టంతో ఓటింగ్ సరళిని పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్

భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు పోలీసుల కళ్లు గప్పి సెల్ పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లారు. వారు ఓటు వేస్తూ స్వయంగా సెల్ ఫొటోలు తీసి వైరల్ చేశారు. బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే ఒకటో వార్డులో ఓటర్లు సెల్ పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి ఓటు వేసే ఫొటోలు తీశారు. 1వ వార్డు అభ్యర్థికి చెందిన సింహం గుర్తుపై ఓటు వేస్తూ ఫొటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. ఇది ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఆయా పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఫొటో తీసిన వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 30వ వార్డులోని 73వ పోలింగ్ స్టేషన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

ఇన్ ఎస్పీ పరిశీలన

మున్సిపల్ ఎన్నికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. పోలింగ్ కేంద్రాలను ఇన్ ఎస్పీ సంగ్రామ్ పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ కాటారం డీఎస్పీ బోనాల కిషన్ బందోబస్తును పర్యవేక్షించారు. 5గురు సీఐలు, 20 మం ది ఎస్సైలు, 32 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 135 మంది కానిస్టేబుళ్లు, 13 మంది మహిళా కానిస్టేబుళ్లు, 29 మంది హోంగార్డులు, 6గురు మహిళా హోంగార్డులు, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 30 మంది అటవీశాఖ, ఇతర సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.


logo