గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Jan 23, 2020 , 02:06:05

పురపోరు ప్రశాంతం

పురపోరు ప్రశాంతం
  • - 79.38 శాతం పోలింగ్ నమోదు
  • - ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు
  • - 12వ వార్డులో అత్యధికం.. 3వ వార్డులో అత్యల్పంగా ఓటింగ్
  • - ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు, డీసీపీ
  • - ఓటు వేస్తూ సెల్ఫీ దిగిన యువకుడు
  • - అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • - 25న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జనగామ పురపాలక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. పోలింగ్ కేంద్రం సిబ్బంది బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి స్ట్రాంగ్ రూంకు తరలించారు. పోలింగ్ శాతం గంట గంటకూ పెరుగుతూ 79.38 శాతం నమోదైంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. కొన్ని వార్డుల్లో విపక్షాలు ఓటమి భయంతో కావాల్చుకుని రాద్దాంతం చేయడం మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. కలెక్టర్, డీసీపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధులకు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి తమ ప్రాంతాలకు తిరుగుముఖం పట్టారు.

కదిలివచ్చిన యువత

ఉదయం 7 గంటల నుంచే ఓటు వేయడానికి యువత ముందుకు కదిలారు. 30 వార్డుల్లో ఒక వార్డుకు రెండు చొప్పున మొత్తం 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. మొత్తంగా79.38శాతం పోలింగ్ నమోదైంది. జనగామలోమొత్తం 40,099 ఓటర్లు ఉండగా ఇందులో 19,691 మంది పురుషులు, 20,408 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా 15,631 మంది పురుషులు, 16,201 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 31,832 ఓట్లు పోలయ్యాయి. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో స్త్రీ, పురుషుల శాతం దాదాపు సమానంగా ఉంది. 79.381 శాతం పురుషులు, 79.39 శాతం మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. అత్యధికంగా 12వ వార్డులో 87.82 శాతం, అత్యల్పంగా 3వ వార్డులో 72.42శాతం నమోదైంది.

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

ఎన్నికల వ్యయ పరిశీలకుల బృందం, ఎన్నికల పరిశీలకులు, ఫ్లయింగ్ స్కాడ్స్, మైక్రో అబ్జర్వర్లు అన్ని వార్డులను సందర్శించారు. ఓటింగ్ సరళిని వీడియో తీయడంతో పాటు పోలింగ్ బూత్ సీసీ కెమెరాలను కలెక్టరేట్ అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది అన్ని వార్డుల నుంచి రెండు గంటలకోసారి పోలింగ్ నమోదు వివరాలు తెలుసుకుంటూ పైఅధికారులకు విషయాన్ని చేరవేశారు.

ఓటు వేసి సెల్ఫీ దిగిన యువకుడు

పట్టణంలోని గణేశ్ వీధిలోని పోలింగ్ కేంద్రంలో సుమంత్ అనే వ్యక్తి ఓటు వేసి ఆ స్లిప్పుతో సెల్ఫీ దిగాడు. దీన్ని గమినించి అక్కడి సిబ్బంది వెంటనే పోలీసులకు అతడిని అప్పగించారు. 30వ వార్డులో టీడీపీ అభ్యర్థి కుమార్ బ్యాలెట్ పేపర్ గుర్తులు చిన్నవిగా ఉన్నాయంటూ రాద్దాంతం చేశాడు. కాగా ఏదైనా ఉంటే జిల్లా ఎన్నికల అధికారులను కలవాలని పోలీసులు వారికి సూచించారు. 19వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒక్కటై టీఆర్ అభిమానులపై అక్కసు వెళ్లగక్కారు. ఎక్కువ సంఖ్యలో టీఆర్ కార్యకర్తలు ఉండటాన్ని జీర్ణించుకోలేక వాదనకు దిగడంతో ఇరు వర్గాల నడుమ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. ఇదిలాఉండగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో పనిచేసే ప్రవీణ్ అనే వ్యక్తి  కాంగ్రెస్ తరుపున ప్రచారం చేశాడని 19వ వార్డు టీఆర్ అభ్యర్థి బండ పద్మ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ప్రచారం చేసిన ఫొటోలను అధికారులకు చూపించారు. 3వ వార్డులోని పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ నేత సత్యనారాయణ వెళ్లి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశాడని టీఆర్ అభ్యర్థి సుధాసుగుణాకర్ జిల్లా సహాయ ఎన్నికల అధికారి రవీందర్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 5వ డివిజన్ సిబ్బంది వద్ద ఓటరు జాబితా అసంపూర్తిగా ఉండటంతో కొందరు ఓటర్లు అయోమయానికి గురయ్యారు.

ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. నడవలేని వారి కోసం చక్రాల కుర్చీలను అందుబాటులో ఉంచారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైద్యులను అందుబాటులో ఉంచి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటర్లకు తాగేందుకు పోలింగ్ కేంద్రాల్లో మంచినీటిని ఏర్పాటుచేశారు.

పోలింగ్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే ఆరా..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. టీఆర్ నేతల ద్వారా ఏయే వార్డులో ఏవిధంగా పోలింగ్ జరుగుతున్నదో తెలుసుకున్నారు. వార్డు ఇన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పలు వార్డుల్లో పర్యటించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. 19, 3, 5, 30 వార్డుల్లో జరిగిన సంఘటనలపై ఆయన వివరాలు సేకరించారు.

భారీగా పోలీసుల బందోబస్తు

పోలింగ్ దృష్ట్యా పోలీసులు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రతి బూత్ వద్ద ఒక ఎస్సైని, ఇతర సిబ్బందిని నియమించారు. డీసీపీ శ్రీనివాస్ ఏసీపీ వినోద్ ప్రతి కేంద్రాన్ని సందర్శించారు. ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. జనగామతో పాటు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల నుంచి, వరంగల్, ఎల్కతుర్తి, వంగర, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించారు. ప్రతి కేంద్రం వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. బూత్ వద్ద గుంపులుగా ఉండకుండా చూశారు.

స్ట్రాంగ్ రూంలో అభ్యర్థుల భవితవ్యం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికలు ముగిసిన అనంతరం సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఏకశిల బీఈడీ కాలేజీలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. అక్కడ ఎన్నికల అధికారులు వాటిని వార్డుల వారీగా భద్రపరిచారు. పోలీసులు భారీ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టనుండటంతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ఓటుహక్కు వినియోగించుకున్న కలెక్టర్, అధికారులు

మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ దంపతులు తన క్యాంపు కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే కేంద్రంలో ఆర్డీవో మధుమోహన్ ఓటు వేశారు. డీసీపీ శ్రీనివాస్ సెయింట్ పాల్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ అంబేద్కర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
logo
>>>>>>