శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Jan 22, 2020 , 04:18:35

నేడే పోలింగ్‌

 నేడే పోలింగ్‌
  • -మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం
  • -జనగామలోని 30 వార్డులకు 60 పోలింగ్‌ బూత్‌లు
  • -ఓటుహక్కు వినియోగించుకోనున్న 40,099 మంది ఓటర్లు
  • -అధికారులకు ఎన్నికల సామగ్రి పంపిణీ
  • -సూచనలు చేసిన కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
  • -పోలింగ్‌ బూత్‌లకు చేరిన ఎన్నికల సిబ్బంది
  • -పోలీసుల భారీ బందోబస్తు
  • -సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు

నేటి మున్సి‘పోల్స్‌'కు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎన్నికల సామగ్రిని జనగామ ఏకశిల బీఈడీ కాలేజీలో మంగళవారం పంపిణీ చేశారు. ఈవీఎంలు, పోలింగ్‌ సామగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది జనగామ పట్టణంలోని వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు సాయంత్రం చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మున్సిపల్‌ పరిధిలోని 30 వార్డులకు 163 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. మొత్తం 60 పోలింగ్‌ కేంద్రాల్లో 40,099 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 394 మంది అధికారులను ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి సాంకేతికతను జోడించారు. పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 100 మీటర్ల వరకు 144 సెక్షన్‌ విధించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు.                                                - జనగామ, నమస్తే తెలంగాణ

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 21 : జనగామ మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితను నిర్ణయించే పోలింగ్‌ మరికొద్ది గంటల్లో జరగనుంది. ఈవీఎంలు, పోలింగ్‌ సామగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది వార్డుల్లో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. మున్సిపల్‌ పరిధిలోని 30 వార్డులకు 163 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. మొత్తం 40,099 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 19,691 మంది, మహిళలు 20,408 ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దాదాపు అన్ని వార్డుల్లో బహుముఖ పోటీ జరుగుతుండగా, ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో బీజేపీ, మరికొన్ని వార్డుల్లో స్వతంత్రులు ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు. కాగా 75 మంది ప్రిసైడింగ్‌ అధికారులు(పీవోలు), 75 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు(ఏపీవోలు), 232 మంది ఇతర పోలింగ్‌ ఆఫీసర్లు(వోపీవోలు), 8 మంది మైక్రో అబ్జర్వుర్లు, నలుగురు జోనల్‌ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు.

ఒక్కో వార్డులో 2 బాక్సుల చొప్పున 30 వార్డులకు 60 బ్యాలెట్‌ పెట్టెలు, బ్యాలెట్‌ పేపర్లు, అవసరమైన స్టేషనరీ, ఎన్నికల సామగ్రిని మంగళవారం హైదరాబాద్‌ రోడ్డులోని ఏకశిల బీఈడీ కాలేజీలో అధికారులు, సిబ్బందికి అందజేయగా, పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని ఓటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్‌, వీడియో గ్రాఫర్‌, ఐఐటీ ఇంటర్‌నెట్‌ నిపుణుడి పర్యవేక్షణలో వెబ్‌కెమెరా ఏర్పాటుచేసి ఇంటర్‌నెట్‌కు అనుసంధానం చేశారు. ఓటు వేసే ప్రతి ఒక్కరి వివరాలను ఎప్పటి కప్పుడు ఇంటర్‌నెట్‌లో పెడుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపే ఏర్పాట్లు చేశారు. 60 పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తున్న పోలింగ్‌ సామగ్రి, బ్యాలెట్‌ పత్రాల వివరాలు, సీరియల్‌ నంబర్లు, అధికారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి సిబ్బందికి పంపిణీ చేశారు. జనగామ మున్సిపల్‌ ఎన్నికల్లో 30 వార్డుల నుంచి మొత్తం 163 మంది అభ్యర్థులు బరిలో పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్‌-30, కాంగ్రెస్‌-29, బీజేపీ-30, సీపీఐ-3, సీపీఎం-3, టీడీపీ-13, స్వతంత్రులు-55 మంది ఎన్నికల పోరులో నిలిచారు. వీటిలో 1వ వార్డులో అత్యధికంగా 10 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 10, 15, 29 వార్డుల్లో 9 మంది, అత్యల్పంగా 4, 11, 18, 19, 22 వార్డుల్లో ముగ్గురు చొప్పున రంగంలో నిలిచారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

జనగామ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎనిమిది సమస్యాత్మక ప్రాంతాలు సహా అన్ని వార్డుల్లో డీసీపీ, ఏసీపీ, నలుగురు సీఐలు, 22 మంది ఎస్సైలు, 10 మంది ఏఎస్సైలు, 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 17 మంది మహిళా కానిస్టేబుళ్లు, 107 మంది కానిస్టేబుళ్లు, 75 మంది హోంగార్డులు సహా 20 మంది ఆర్మ్‌డ్‌ పోలీసులు, రెండు స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు, బీబీ టీం, ఆరు మొబైల్‌ టీంలు, 275 సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్‌ అమలుచేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా అంబేద్కర్‌నగర్‌ ప్రైమరీ స్కూర్‌, ఎంపీపీఎస్‌ వీవర్స్‌కాలనీ, గుండ్లగడ్డ కొత్తబస్తీ ఉర్దూ మీడియం స్కూల్‌, మున్సిపల్‌ కార్యాలయం కేంద్రం, ఉర్దూ మీడియం పీఎస్‌ నంబర్‌ 11, 12, ధర్మకంచ బాలుర పాఠశాల, రైల్వేస్టేషన్‌ రోడ్డు 53, 54 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మొత్తం 10 ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించి అదనపు బలగాలు, మఫ్టీ పోలీసులను నియమించారు. పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచిన బ్యాలెట్‌ పత్రాలను బందోబస్తు నడుమ పంపిణీ కేంద్రాలకు తరలించగా, అక్కడి నుంచి బ్యాలెట్‌ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని స్కూల్‌ బస్సుల్లో పోలీస్‌ ఎస్కార్ట్‌తో కేంద్రాలకు పంపించారు.logo