గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Jan 22, 2020 , 04:11:11

టీఆర్‌ఎస్‌ వైపే.. జనగామ ప్రజలు

టీఆర్‌ఎస్‌ వైపే.. జనగామ ప్రజలు
  • -సీఎం కేసీఆర్‌ను చూసి ఓటేయండి
  • -కాంగ్రెస్‌, బీజేపీని చిత్తుగా ఓడించాలి
  • -అవి పట్టణాన్ని నాశనం చేశాయి
  • -జనగామ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయం
  • -రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు
  • -మున్సి‘పోల్స్‌'పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో కలిసి సమీక్ష

జనగామ, నమస్తే తెలంగాణ : ‘మునుపెన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జనగామ పట్టణ అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చాం. రానున్న రోజుల్లో పరిశ్రమల స్థాపనతో జనగామ జిల్లాకేంద్రాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతాం. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను గౌరవిస్తారు.. ఆదరిస్తారు.. ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జనగామ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పట్టణ ఎన్నికల ఇన్‌చార్జి డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డితో కలిసి మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుల వారీగా పార్టీ అభ్యర్థుల గెలుపుపై సమీక్షించారు. జనగామ ప్రజలకు గోదావరి నీరు, మిషన్‌ భగీరథ నీళ్లు ఇచ్చి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని చెప్పారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే జనగామను మొదటి స్థానంలో నిలిపామన్నారు. జనగామను కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేస్తే... కేంద్రంలో ఆరేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. జనగామ పట్టణంలోని 25 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు గులాబీ జెండా ఎగురవేయబోతున్నారని, కొద్ది తేడాతో ఉన్న మరో  5 వార్డుల్లో పోలింగ్‌ సమయానికి పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం గట్టిగా పని చేయాలని కార్యకర్తలను ఆదేశించామని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. నేడు జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌ అభ్యర్థుల మొహాలు చూసి కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొహం చూసి ఓటేసి రుణం తీర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీకి ఓట్లేస్తే ‘దున్నపోతుకు గడ్డివేసి బర్రె పాలు పిండినట్లు’ జనగామ పట్టణ ప్రగతి కుంటుపడుతుందని, 30 వార్డులను క్లీన్‌స్వీప్‌ చేసి జనగామ మున్సిపల్‌ను కేసీఆర్‌కు బహుమానంగా ఇవ్వాలని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.logo
>>>>>>