శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Jan 21, 2020 , 02:54:35

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం
  • -మున్సి‘పోల్స్‌'కు సన్నద్ధమైన యంత్రాంగం
  • -22న పోలింగ్‌కు అధికారుల ఏర్పాట్లు
  • -30 వార్డుల్లో 60 పోలింగ్‌ కేంద్రాలు
  • - బరిలో 163 మంది అభ్యర్థులు
  • - ఓటింగ్‌లో పాల్గొననున్న 40,099 మంది..
  • - ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
  • - ప్రత్యేక నిఘా బృందాలతో తనిఖీలు
  • -పోలింగ్‌ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు
  • - నేడు సిబ్బందికి సామగ్రి పంపిణీ

మున్సిపల్‌ ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమైంది. 22న పోలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తిచేసింది. మొత్తం 30 వార్డుల్లో 60 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. ఇప్పటికే అవసరమైన సిబ్బందిని నియమించి శిక్షణను సైతం ఇచ్చింది. మొత్తం 163 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. 40,099 మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టణంలో ఎనిమిది సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఎనిమిది మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇద్దరిని రిజర్వ్‌లో ఉంచారు. మంగళవారం ఏకశిల బీఈడీ కాలేజీలో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేసి, కేంద్రాలకు తరలించనున్నారు.

జనగామ, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నది. ఈ నెల 22న బుధవారం జనగామ పురపాలక సంఘం పరిధిలోని 30 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో 163 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, మొత్తం 40,099 మంది ఓటర్లుకుగాను పురుషులు 19,691 మంది, 20,408 మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే బ్యాలెట్‌ పత్రాలను ముద్రించి వాటిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచారు. ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బృంధాలతో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాస్థాయి హోదాలో ఉన్న వారిని నోడల్‌ అధికారులుగా, జోనల్‌, రూట్‌ ఆఫీసర్లుగా నియమించి, ప్రభుత్వ పాఠశాలల సీనియర్‌ ఉపాధ్యాయులను పోలింగ్‌, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లుగా నియమించి మాస్టర్‌ ట్రైనర్లతో అవగాహన సదస్సులను పూర్తి చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు  75 మంది ప్రిసైడింగ్‌ అధికారులు (పీవోలు), 75 మంది ఏపీవోలు, 232 మంది ఇతర పోలింగ్‌ ఆఫీసర్లు (వోపీవోలు), 10మంది మైక్రో అబ్జర్వర్లు, నలుగురు జోనల్‌ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. ఒక్కో వార్డులో రెండు బాక్సుల చొప్పున 30 వార్డులకు 60 బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, అవసరమైన స్టేషనరీ, ఎన్నికల సామగ్రి సిద్ధం చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు, సామగ్రి ని మంగళవారం అధికారులకు పంపిణీ చేయనున్నారు.  ఇందుకోసం పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులోని ఏకశిల బీఈడీ కాలేజీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  పోలింగ్‌ అనంతరం పోలింగ్‌ బాక్స్‌లను ఇక్కడికే తరలించనుండడంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటుచేశారు. కాగా ఎనిమిది సమస్యాత్మక ప్రాంతాలు సహా అన్ని వార్డుల్లో డీసీపీ, ఏసీపీ, నలుగురు సీఐలు, 22 మంది ఎస్‌ఐలు, 10 మంది ఏఎస్‌ఐలు, 20 హెడ్‌కానిస్టేబుళ్లు, 17మంది మహిళా కానిస్టేబుళ్లు, 107 మంది కానిస్టేబుళ్లు, 75మంది హోంగార్డులు సహా 20 మంది ఆర్మీడ్‌ పోలీసులు, రెండు స్పెషల్‌ స్ట్రైంకింగ్‌ ఫోర్స్‌ బృందాలు, బీబీ టీం, ఆరు మొబైల్‌ టీంలు, 275 సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని వంద మీటర్ల దూరంలో 144సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

బరిలో 163 మంది అభ్యర్థులు

జనగామ మున్సిపల్‌ ఎన్నికల్లో 30 వార్డుల నుంచి మొత్తం 163 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్‌-30, కాంగ్రెస్‌-29, బీజేపీ-30, సీపీఐ-3, సీపీఎం-3, టీడీపీ-13, స్వతంత్రులు-55 మంది బరిలో నిలిచారు. వీటిలో 1వార్డులో అత్యధికంగా 10మంది అభ్యర్థులు చొప్పున పోటీ పడుతుండగా, 10, 15, 29 వార్డుల్లో తొమ్మిదిమంది, అత్యల్పంగా 4, 11, 18, 19, 22 వార్డుల్లో ముగ్గురు చొప్పున రంగంలో నిలిచారు. వాటిలో 1వ వార్డులో 10 మంది, 2వ వార్డులో నలుగురు, 3వ వార్డులో ఐదుగురు, 6వ వార్డులో ఏడుగురు, 7వ వార్డులో ఆరుగురు, 8వ వార్డులో ఆరుగురు, 9వ వార్డులో ఐదుగురు, 10వ వార్డులో తొమ్మిది మంది, 11వ వార్డులో ముగ్గురు, 12వ వార్డులో నలుగురు, 13వ వార్డులో నలుగురు, 14వ వార్డులో ఆరుగురు 15వ వార్డులో తొమ్మిది మంది, 16వ వార్డులో నలుగురు, 17వ వార్డులో ఆరుగురు, 18వ వార్డులో ముగ్గురు, 19వ వార్డులో ముగ్గురు, 20వ వార్డులో నలుగురు, 21వ వార్డులో ఐదుగురు, 22వ వార్డులో ముగ్గురు, 23వ వార్డులో ఏడుగురు, 24వ వార్డులో ఐదుగరు, 25వ వార్డులో ఆరుగురు, 26వ వార్డులో ఐదుగురు, 27వార్డులో నలుగురు, 28వ వార్డులో ఆరుగురు, 29వ వార్డులో తొమ్మిది మంది, 30వ వార్డులో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.logo