గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Jan 21, 2020 , 02:53:17

ముగిసిన ప్రచారం

ముగిసిన ప్రచారం
  • -మూగబోయిన మైకులు
  • -చివరి రోజు హోరెత్తిన ప్రచారం
  • -గడపగడపకూ వెళ్లిన అభ్యర్థులు
  • -తమను ఆశీర్వదించాలని వేడుకోలు
  • -పలువార్డుల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి
  • -అభివృద్ధిని చూసి ఓటేయాలని పిలుపు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొద్ది రోజులుగా మైకుల శబ్ధాలతో మార్మోగిన వీధులన్నీ సోమవారం సాయంత్రం నుంచి మూగబోయాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలవాలనే పట్టుదలతో ఎవరి వ్యూహం ప్రకారం వారు ముందుకెళ్తున్నారు. బుధవారం పోలింగ్‌ జరుగనుంది. ఈ సమయం అధికారులకు పరీక్షా కాలమే. ఓటర్లు వారి వారి సమయాన్ని బట్టి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

కోర్టుల కేసుల కారణంగా ఎన్నికల నోటిఫికేషన్‌పై ఉత్కంఠ నెలకొల్పొ.. చివరకు ఈనెల 7న నోటిఫికేషన్‌ విడుదలైంది. 8 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. నామినేషన్లను పరిశీలించిన అధికారులు 14న తుది జాబితా ప్రకటించారు. ఉపసంహరణ చివరి రోజు 105 మంది తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. అప్పటి వరకు బరిలో చాలా మంది ఉన్నారనుకున్న తరుణంలో భారీగానే ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి ప్రచారం హోరెత్తింది. వీధులన్నీ పార్టీ నేతలతో కళకళలాడాయి. మైకుల మోత, పాటలతో ఓటర్లను హుషారెత్తించారు. ఎవరి ఆలోచన ప్రకారం వారు తమ తమ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. మంత్రులు మహమూద్‌అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ రాజయ్య, శాసనమండలి చీఫ్‌ విప్‌ బొడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు జనగామలో ప్రచారం నిర్వహించారు. వార్డుకు ఒక ఇన్‌చార్జిని టీఆర్‌ఎస్‌ నియమించింది. వారి దిశ నిర్ధేశం ప్రకారం.. ప్రచారంలో దూసుకుపోయారు. టీఆర్‌ఎస్‌ జనగామ నియోజకవర్గ సమన్వయకులు గుజ్జ సంపత్‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకంగా వ్యహరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, సమావేశాల ఏర్పాటు, ముఖ్యనేతల ప్రణాళిక రూపకల్పన, అన్ని విషయాల్లో సంపత్‌రెడ్డి ముందుండి  నడిపించారు. ప్రచార రోజుల్లో నేతలకు సరైన ఆహారం అందించారు. కష్టపడాల్సిన సమయం ఇప్పుడే కాబట్టి ఓపిక తెచ్చుకుని, శక్తిని కూడగట్టుకుని వాడవాడల కలియతిరిగారు. గడప గడపకు పోయి ఓట్లు అభ్యర్థించారు. ఈనెల  22న ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం సిద్ధమైంది. 25న లెక్కింపు ఏకశిల కళాశాలలో నిర్వహించనున్నారు.

చివరి రోజు రోడ్డు షోలు..

ప్రచారంలో చివరి రోజైన సోమవారం రోడ్డు షోలతో హోరెత్తించారు. శాసనమండలి చీఫ్‌విప్‌ బొడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు 10, 14, 15, 16, 19 తదితర వార్డుల్లో భారీగా రోడ్డుషోలో పాల్గొన్నారు. దాదాపు 15వార్డుల్లో ప్రచారం చివరి రోజున పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వీధులన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడాయి. పలు కూడళ్లలో వారు ప్రసంగించారు. సమయం దగ్గర పడుతుండడంతో వేగంగా ముందుకు కదిలారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు రోడ్డు షోలో పాల్గొన్నారు.

సిద్ధమైన ఎన్నికల అధికారులు..

నిన్నటి వరకు నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు అధికారుల వంతు. అధికారులు ఎన్నికల సామాగ్రిని సరిచేసుకుంటున్నారు. ఏ పోలింగ్‌ కేంద్రానికి  ఏ అధికారో ఇప్పటికే నిర్ణయించారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. వార్డుకు రెండు చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. పోలింగ్‌లో పాల్గొనే సిబ్బందికి, లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. దాని ప్రకారం సిబ్బంది నడుచుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాలను పలుమార్లు అధికారులు సందర్శించారు. పోలీసులు కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా రక్షణ కల్పించాలనే దానిపై స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. బుధవారం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ఎన్నికలు పూర్తయ్యే వరకు అధికారుల్లో ఆందోళన సహజంగానే ఉంటుంది.logo