సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Jan 21, 2020 , 02:49:53

పసుపుమయం... పట్నంవారం

పసుపుమయం... పట్నంవారం
  • -భక్తిశ్రద్ధలతో మల్లన్నను దర్శించుకున్న భక్తులు
  • - ఉత్కంఠభరితంగా అగ్నిగుండాలు

 చేర్యాల, నమస్తే తెలంగాణ: పట్నం వారం సందర్భంగా కొమురవెల్లి మల్లన్నక్షేత్రంలో భక్తులు చల్లుకున్న పసుపుతో స్వామివారి క్షేత్రం పసుపుమయంగా మారిపోయింది. హైదరాబాద్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయవర్గాల సహకారంతో సోమవారం పెద్దపట్నం,అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్నం వారానికి వచ్చిన భక్తులు శనివారం దూళిదర్శనం, ఆదివారం బోనాలు, పట్నాలు, సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ అనవాయితి. ఈక్రమంలో పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలలో భక్తులు పాల్గొన్నారు. ఒగ్గు పూజారులు  పంచవర్ణాలు (తెలుపు, పసుపు, నీలి, ఎరుపు, ఆకుపచ్చ) రంగుగల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలు (మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి)ల కట్టెలను వరుసుగా పేర్చి అగ్నిగుండంగా తయారు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్‌తో పాటు పలువురు అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆలయం నుంచి పెద్దపట్నం, అగ్నిగుండం వరకు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఆలయ అర్చకులు దాటిన వెంటనే భక్తులు పట్నం,అగ్నిగుండాలను దాటి స్వామి వారి ఆలయం  మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం మేరకు శివసత్తులకు, ఘనాచార్యులకు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ టి.వెంకటేశ్‌, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోష్‌, కమిటీ సభ్యులు కండువా, జాకెట్‌ ముక్కలతో పాటు స్వామి వారి బండారిని పంపిణీ చేశారు. అంతకుముందు భక్తులు పసుపును ఒల్లంతా పూసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడంతో వాటిలో పాల్గొనేందుకు భక్తులు గంటల పాటు వేచి ఉన్నారు. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌, సీఐ రఘు నేతృత్వంలో పలు ప్రాంతాలకు చెందిన సీఐ, ఎస్‌ఐలతో పాటు 321 మంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవో రావుల సుదర్శన్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, కమిటీ సభ్యులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.

పట్నంవారం మల్లన్న ఆదాయం రూ. 42,31,267

కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి పట్నం వారం సందర్భంగా రూ.42, 31,267 ఆదాయం వచ్చినట్లు ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోష్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ శని, ఆదివారాలలో ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వార రూ.23,46,998 స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆయనతో ఈవో టంకశాల వెంకటేశ్‌, ఏఈవో రావుల సుదర్శన్‌, కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, ఉటుకూరి అమర్‌,  నాగిరెడ్డి, యావజుల అయిలయ్య, ఏగుర్ల మల్లయ్య తదితరులున్నారు.logo