శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Jan 20, 2020 , 03:36:20

వైభవంగా మల్లన్న ‘పట్నంవారం’

వైభవంగా మల్లన్న ‘పట్నంవారం’
  • - స్వామి దర్శనంతో భక్తుల పరవశం
  • - జనసంద్రమైన కొమురవెల్లి క్షేత్రం
  • -పట్నం వారానికి తరలివచ్చిన భక్తులు
  • - స్వామి దర్శనానికి 5 గంటల సమయం

 చేర్యాల, నమస్తే తెలంగాణ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన  మల్లికార్జున స్వామి క్షేత్రానికి పట్నంవారం సందర్భంగా లక్ష మంది భక్తులు తరలివచ్చారు. పట్నం వారం భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. మల్లన్న ఉత్సవాలు పట్నం వారంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. భారీగా భక్తులు తరలిరావడంతో స్వామివారి క్షేత్రం జనసంద్రంగా మారింది.  బ్రహ్మోత్సవాల్లో మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా పిలువడం ఆనవాయితీ. ఈ క్రమంలో పట్నం (హైదరాబాద్‌)కు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్నను దర్శించుకుని, పెద్దపట్నం వేసి అగ్నిగుండం దాటుతారు. పట్నం వారానికి సుమారు లక్షకుపైగా భక్తులు వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. వరంగల్‌, జనగామ, చేర్యాల నుంచి  కొమురవెల్లి, సిద్దిపేట నుంచి కొమురవెల్లి, హైదరాబాద్‌ రహదారి నుంచి కొమురవెల్లికి వచ్చే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయింది. 

* పవిత్ర స్నానం..  స్వామి దర్శనం..

శనివారం సాయం త్రం నుంచే భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి చేరుకున్నారు. ఆదివారం వేకువజామునే కోనేటిలో పవిత్ర స్నానం అచరించి నేరుగా క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మండపం, గంగరేగుచెట్టు ప్రాంగణంతోపాటు గదుల వద్ద చిలుకపట్నం,  నజరు పట్నం, మహా మండపంలోముఖ మండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు స్వామివారి కల్యాణం నిర్వహించడంతోపాటు అమ్మవార్లకు ఒడి బియ్యం, అభిషేకం, అర్చనలు నిర్వహించారు.

* పట్నాలు.. బోనాల మొక్కులు

భక్తులు మొక్కులను చెల్లించుకునే భాగంలో స్వామివారికి పట్నాలు, మల్లన్న గుట్టపై ఎల్లమ్మకు బోనాలు చెల్లించారు. పట్నంవారం సందర్భంగా  సుమారు రూ.20 లక్షలకు పైగా ఆదా యం వస్తుందని ఆలయ సిబ్బంది తెలిపారు.

* సామాన్య భక్తుల ఇక్కట్లు

మల్లన్న క్షేత్రంలోని 120 కాటేజీలను దాతల సాయంతో నిర్మించారు. కాగా, దాతలు కూడా భారీగా ఆలయానికి రావడంతో సామాన్య భక్తులు గదులు దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  లష్కర్‌వారానికి సైతం గదులన్నీ ముంద స్తుగా బుకింగ్‌ కావడతో సామాన్య భక్తులు తీవ్రఇబ్బందులు పడ్డారు. కాగా, భక్తులు ప్రైవేట్‌ గదులకు రూ.2000లకు పైగా డబ్బులు చెల్లించి పట్నంవారం మొక్కులు చెల్లించుకున్నారు.

* మల్లన్న దర్శనానికి 5 గంటలు

 మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ధర్మదర్శనంలో 5, ప్రత్యేక దర్శనంలో భక్తులు 5, శీఘ్రదర్శనంలో 4 గంటల సమయం పట్టింది. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్‌, పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోష్‌, సభ్యులు ఉటుకూరి అమర్‌, ముత్యం నర్సింహులు, బొంగు నాగిరెడ్డి, మంతెన బాల్‌రెడ్డి, యావజుల ఐలయ్య ఉన్నారు. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ అధ్వర్వంలో సీఐ రఘు నేతృత్వరంలో సీఐ, ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు.
logo