శనివారం 28 మార్చి 2020
Jangaon - Jan 18, 2020 , 03:14:21

ఎన్నికల ఖర్చుపై నిఘా

ఎన్నికల ఖర్చుపై నిఘా
  • -నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి
  • -జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
  • -మున్సిపల్‌ బరిలో నిలిచిన అభ్యర్థులకు అవగాహన సమావేశం
  • -పాల్గొన్న ఎన్నికల వ్యయ పరిశీలకుడుశ్రీనివాస్‌

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 17 : మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి వార్డు సభ్యుల ఖర్చులపై ఎన్నికల సంఘం నిఘా ఉంటుందని, నిబంధనలకు లోబడి మాత్రమే పోటీలో ఉన్న అభ్యర్థులు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మున్సిపోల్స్‌ ఎన్నికల వ్యయ నిర్వహణపై పోటీలో ఉన్న అభ్యర్థులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ఎన్నికల వెంకటేశ్వర్లు, జిల్లా అసిస్టెంట్‌ ఎన్నికల అథారిటీ, కమిషనర్‌ నోముల రవీందర్‌ యాదవ్‌, ఏసీపీ వినోద్‌కుమార్‌, అర్బన్‌ సీఐ మల్లేశ్‌, ఇన్‌చార్జి డీపీఆర్‌వో ప్రేమలత హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పలు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు వినియోగించే పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు వంటి అన్ని ప్రచార సామగ్రికి సంబంధించిన ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించే అభ్యర్థులపై వ్యయ పరిశీలకుడు ఇచ్చే నివేదిక ఆధారంగా గెలుపొందిన తర్వాత కూడా వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంక్‌ ఖాతాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కొంత వెసులుబాటు కల్పించిందని అయితే పాత అకౌంట్‌లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎన్నికల ఖర్చుకు సంబంధించిన లావాదేవీలు తప్ప ఇతర లావాదేవీలు నిర్వహించొద్దన్నారు. వార్డుల్లో ఎన్నికల ప్రచారానికి మున్సిపల్‌ నుంచి అనుమతి, మైక్‌ పర్మిషన్‌ కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంలో అనుమతి ఇస్తారని, ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఖర్చును చూపించాలని, ఎన్నికల తర్వాత గెలిచినవారు, ఓటమిపాలైన వారు కూడా లెక్కలు చూపాలని, లేదంటే ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాన్ని పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే ఈనెల 20న సాయంత్రం 5గంటల్లోగా ముగించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు, పార్టీలకు తెలియకుండానే షాడో మఫ్టీ బృందాలు ఈ వివరాలన్నీ నమోదు చేసుకుంటాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు లిఖితపూర్వక ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


పోలీస్‌స్టేషన్‌కు చేరిన బ్యాలెట్‌ పత్రాలు

జనగామ టౌన్‌ : ఈనెల 22న నిర్వహించే మున్సిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాలను ఎన్నికల అధికారులు శుక్రవారం జనగామ ఠాణాకు చేర్చారు. ఈమేరకు సీఐ మల్లేశ్‌యాదవ్‌ అధ్యక్షతన బ్యాలెట్‌ పత్రాలను ఠాణాలో అదనపు పోలీస్‌ సిబ్బందితో భద్రపరిచినట్లు సీఐ వెల్లడించారు. ఎన్నికల పత్రాలను పోలింగ్‌ స్టేషన్లకు డిస్ట్రిబ్యూషన్‌ చేసే వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు.

చెక్‌పోస్టులో నగదు పట్టివేత

జనగామ రూరల్‌ : మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పలు చెక్‌ పోస్టుల్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. శుక్రవారం మండలంలోని శామీర్‌పేట గ్రామంలోని చెక్‌ పోస్టు వద్ద ఎన్నికల తనిఖీ బృందం, పోలీసు అధికారులు వాహనాలు తనిఖీ చేపట్టారు. కాగా గుండాల మండలం మరిపడిగ గ్రామానికి చెందిన అనంతుల చంద్రశేఖర్‌, లక్ష్మయ్యకు చెందిన కారులో రూ.3లక్షలు పట్టుకున్నారు. పట్టుబడిన నగదుకు వారు ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్‌ చేశారు. తనిఖీలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.logo