గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Jan 17, 2020 , 02:17:50

బోనమో ఆలేటి ఎల్లవ్వ

బోనమో ఆలేటి ఎల్లవ్వ
  • -ఎల్లమ్మగడ్డ తండా పోటెత్తిన భక్తజనం
  • -కాలినడకన తరలివచ్చిన ప్రజలు
  • -పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
  • -హాజరైన మంత్రి ఎర్రబెల్లి దంపతులు
  • -బోనం సమర్పించి.. ప్రత్యేక పూజలు
  • -ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
  • -ఆలయ అభివృద్ధికి కృషా చేస్తా : దయాకర్‌రావు

పాలకుర్తి రూరల్‌, జనవరి 16: గజ్జెల లాగులు.. నెత్తిన బోనాలు.. గొల్లకురుమల జానపదాలు.. ఢమరుక మోతలు.. శివసత్తుల పునకాలతో గురువారం మండలంలోని  బమ్మెర శివారు ఎల్లమ్మగడ్డతండా మార్మోగింది. భక్తజనంతో కిక్కిరిసి పోయింది. గురువారం కనుమ సందర్భంగా ఎల్లమ్మ గడ్డలోని ఆలేటి ఎల్లవ్వ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎల్లమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఎల్లవ్వకు పట్నాలు వేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బమ్మెర, రాఘవపురం, గూడూరు, పాలకుర్తి, అయ్యంగారిపల్లి, ఈరవెన్ను, కోతులబాధ గ్రామాలకు చెందిన మహిళలు బోనాలతో కాలి నడకన తరలివచ్చి ఆల యం చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉష దంపతులు ఎల్లవ్వ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. బోనమెత్తి భక్తులను ఉత్సాహపరిచారు.

తాటిచెట్టుకు ప్రత్యేక పూజలు

ఆలెటి  ఎల్లవ్వ ఆలయానికి ముందు ఉన్న మహిమ గల తాటిచెట్టుకు మంత్రి ఎర్రబెల్లి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తాటిచెట్టు వద్దకు వచ్చి పసుపు, కుంకుమతో మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా సంతానం లేని మహిళలు నోములు, వ్రతాలు ఆచరించి ప్రత్యేక పూజలందించి వరం పట్టారు. జాతర సందర్భంగా పాలకుర్తి సీఐ బానోతు రమేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల ఎస్సైలు గండ్రాతీ సతీశ్‌, రామారావు, కంకల సతీశ్‌తోపాటు 50 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. డాక్టర్‌ తాల్క ప్రియాంక ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.

సుఖశాంతులతో ఉండాలి: ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలోని సర్వమతాల ప్రజలు టీఆర్‌ఎస్‌ పాలనలో ఆనందంగా జీవిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో చెరువులు 365 రోజులూ మత్తళ్లు పోస్తాయని హామీ ఇచ్చారు. ఆలేటి ఎల్లవ్వ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు,  పాలకుర్తి సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, వైఎస్‌ ఎంపీపీ దార శారద, సర్పంచ్‌ జలగం నాగభూషణం, రాపాక సత్యనారాయణ, మాచర్ల ఎల్లయ్య, మాడరాజు యాకయ్య, పెందోట వెంకటాచారి, జర్పుల బాలునాయక్‌, బత్తిని గోపాల్‌, బత్తిని సోమయ్య, మదన్‌, జోగు గోపి, బెల్లి యుగేందర్‌, రంగినేని సత్యనారాయణరావు, వంగాల పర్శరాములు, గాదరి శోభ, శివరాత్రి సుధాకర్‌ పాల్గొన్నారు.

జాతరకు తరలి వెళ్లిన భక్తులు

పాలకుర్తి: ఆలేటి ఎల్లవ్వ జాతరకు మండలంలోని అనేక మంది భక్తులు తరలివెళ్లారు. మహిళలు బోనాలతో కాలినడకన తరలివెళ్లారు. శివసత్తుల పూనకాలు, డప్పుచప్పళ్ల   మధ్య పెద్దసంఖ్యలో బోనాలను ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో వెళ్లారు. అమ్మవారికి కల్లుశాకం, సారె పెట్టి, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎల్లవ్వ జాతరకు రైతులు తమ ఎడ్ల బండ్లలో వచ్చారు. ఎల్లవ్వతల్లికి పాలకుర్తి ఎస్సై గండ్రాతీ సతీశ్‌ ప్రత్యేక పూజలు చేశారు.logo
>>>>>>