మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Jan 17, 2020 , 02:13:26

అన్నింటా గెలుపు మాదే..

అన్నింటా గెలుపు మాదే..
  • -కేసీఆర్‌, కేటీఆర్‌కు విజయాన్ని బహుమతిగా ఇస్తాం
  • -తొమ్మిది మున్సిపాలిటీలను గెలిచి ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజల ఆకాంక్షను చాటి చెపుతాం
  • -నేను, మంత్రి సత్యవతి సమన్వయం చేస్తున్నాం
  • -ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ప్రయోజనం ఉండదు
  • -అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ వెంటే
  • -తొర్రూరు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి దయాకర్‌రావు

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జనవరి 16: ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ద్వారా చేకూరిన ప్రయోజనానికి కృతజ్ఞతగా నాలుగు జిల్లాల్లోని తొమ్మిది మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జయకేతనాన్ని ఎగురవేసి వారికి ఈ విజయాన్ని బహుమతిగా అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొర్రూరులోని పలు వార్డుల్లో ఆయ న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ మరో మంత్రి సత్యవతిరాథోడ్‌, తాను సమన్వయంతో తొమ్మిది మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించే విధంగా వ్యూహ రచనతో ముం దుకు వెళ్తున్నామన్నారు.

ప్రజలకు పాలన చేరువ కావడానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాను సీఎం కేసీఆర్‌ ఆరు జిల్లాలుగా మార్చారని ప్రజల ఆరోగ్యం కోసం కార్పొరేట్‌ తరహా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ దవాఖానాలను అప్‌గ్రేడ్‌ చేశారని, అపర భగీరథుడిలా ప్రపంచంలోని ఎక్కడాలేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి నీటి కష్టాలు లేని తెలంగాణను తీర్చిదిద్దాడని అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని అడ్డగోలు ప్రచారం చేసిన వారు కళ్లు తెరుచుకునేలా వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తున్న ఏకైక ప్రాంతంగా తెలంగాణ రాష్ర్టాన్ని చరిత్రలో నిలిపారని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ అన్నదాత ఆనందంగా బతికేలా చెరువులన్నీ నింపుతూ పుష్కలమైన సాగునీరు అందిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతి ఒక్కరి పాలిట వరప్రదాయినిగా మార్చారని గుర్తు చేశారు.

కళ్లముందే అభివృద్ధి

డబుల్‌బెడ్‌రూం గృహాలు, నిరుపేద వ్యాధిగ్రస్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి, అర్హులైన వారందరికీ పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. వరంగల్‌ మహానగర మాస్టర్‌ ప్లాన్‌ త్వరలోనే వెల్లడించనున్నారని వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌, బడా ఐటీ కంపెనీల స్థాపన వంటి కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు సైతం మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. దేవాదుల ద్వారా కరువు ప్రాంతమైన జనగామ జిల్లా సస్యశామలంగా మారిందన్నారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ సురక్షితమైన శుద్ధి చేసిన మంచినీరు సరఫరా చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ సహకారంతో తొమ్మిది మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు నిధుల కేటాయింపు జరిగిందని చెప్పారు.

త్వరలోనే పట్టణ ప్రగతి

గ్రామాలను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నామో, సుందరీకరిస్తున్నామో అదే తరహాలో మున్సిపల్‌ పాలక వర్గాలు కొలువుదీరగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పాలక వర్గంలో బాధ్యతలను పెంచడం జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం 75 గజాల లోపు స్థలంలో ఇంటిని నిర్మించుకునే వారికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని ఆపై స్థలంలో నిర్మాణాలు చేసే వారికి 21 రోజుల్లో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా నిబంధనలకు లోబడి ఆన్‌లైన్‌లో అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగేలా అనేక సంస్కరణలను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డికి అభినందనలు

పరకాల మున్సిపాలిటీలో 11 వార్డులను ఏకగ్రీవం చేసుకున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ జిల్లాకు చేసిన సేవకు బహుమతిగా తొమ్మిది మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేస్తుందని అన్నారు. సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకులు జన్ను జకారియా, మెట్టు శ్రీనివాస్‌, వివిధ వార్డుల ఇన్‌చార్జీలు, అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.
logo
>>>>>>