సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Jan 15, 2020 , 02:23:34

బరిలో 163 మంది

బరిలో 163 మంది


జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 14 : జనగామ పుర పోరులో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టానికి తెరపడింది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బల్దియా బరిలో 5 వార్డుల్లో త్రిముఖ పోటీ, 6 వార్డుల్లో చతుర్ముఖ పోటీ జరుగుతుండగా, మిగిలిన 21 వార్డుల్లో బహుముఖ పోటీ నెలకొన్నది. పోటీలో ఉన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులు తేలిపోవడంతో ప్రచార పర్వానికి తెరలేపారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో 30 వార్డులకు అత్యధికంగా టీఆర్‌ఎస్‌ నుంచి 167, కాంగ్రెస్‌ నుంచి 111 నామినేషన్లు వచ్చాయి. బీజేపీ నుంచి 52 దాఖలయ్యాయి. ఇదిలాఉండగా టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన వారి సంఖ్య భారీగా ఉండటం బీ-ఫారాలు 30 మందికే లభించడంతో మిగిలిన అభ్యర్థులందరికీ స్వయంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫోన్‌ చేయడంతో బరిలోంచి తప్పుకున్నారు. ఒకరిద్దరు మాత్రం కొద్ది నిమిషాల తేడాతో మున్సిపల్‌ కార్యాలయానికి ఆలస్యంగా చేరుకోవడంతో ఎన్నికల అధికారులు అనుమతించలేదు. కాంగ్రెస్‌లో రెండువర్గాల మధ్య టికెట్ల గొడవ తారాస్థాయికి చేరగా, ఇప్పటికే వార్డు పర్యటన పేరిట ఎమ్మెల్యే పట్టణంలోని అన్ని కాలనీలలో ఇంటింటికీ తిరిగి మొదటి విడత ప్రచారాన్ని ముగించారు. అభ్యర్థుల ఖరారు, బీ-ఫారాల జారీ వంటి అంశాల్లో కాంగ్రెస్‌లో రెండు గ్రూపుల్లో విబేధాలు రచ్చకెక్కడంతో 30 వార్డులకు 29 వార్డుల్లోనే అభ్యర్థులను నిలపాల్సిన పరిస్థితి నెలకొంది.

టీఆర్‌ఎస్‌తో పోటీ పడే సరైన అభ్యర్థులు లేకపోవడంతో ఒకే ఇంటి నుంచి ఇద్దరు చొప్పున తల్లీ, కూతురు, భార్య, భర్తను బరిలోకి దింపారు. ఇక బీజేపీలో సైతం నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో అన్ని వార్డుల్లో అభ్యర్ధులను నిలపలేక చతికిలపడింది. అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం ధీటైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపడంతో మున్సిపోల్స్‌ రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలకు అభ్యర్థులు ఖరారైన మరుసటి రోజునే సంక్రాంతి పర్వదినం రావడంతో తమకు కేటాయించిన గుర్తులతో ఇల్లిల్లూ చుట్టే పనిలో పడ్డారు. వామపక్షాలు తమకు పట్టున్న వార్డుల్లో అభ్యర్థులను రంగంలోకి దింపగా, టీడీపీ, బీజేపీ ఒకటి, రెండు మినహా అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. పేర్ల అక్షర క్రమాన్ని బట్టి అధికారులు గుర్తు కేటాయించడంతో కొందరు తమ వచ్చిన గుర్తులను ఓటర్ల దృష్టిలో పడేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రచారం మొదలుపెట్టారు. ఒకటికి రెండుసార్లు ఓటర్లను ఇంటికి వెళ్లి కలవడం వల్ల సానుభూతి వస్తుందని ఆశిస్తున్న అభ్యర్థులు గెలిచేందుకు అన్ని శక్తులను వినియోగిస్తున్నారు.

105 మంది అభ్యర్థుల ఉపసంహరణ

జనగామ మున్సిపల్‌ ఎన్నికల్లో మంగళవారం నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత 163 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 268 మంది అభ్యర్థులు 413 నామినేషన్ల దాఖలు చేయగా, వాటిలో ఒకటి కంటే ఎక్కువ సెట్లు వేసిన వాటిని మినహాయించి చివరి రోజు 105 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బల్దియా పోరులో ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్రులతో కలిసి 163 మంది బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌-30, కాంగ్రెస్‌-29, బీజేపీ-30, సీపీఐ-3, సీపీఎం-3, టీడీపీ-13, స్వతంత్రులు-55 మంది ఎన్నికల పోరులో నిలిచారు.

1వ వార్డు నుంచి అత్యధికంగా 10 మంది పోటీ

మున్సిపల్‌ పోరులో 1వ వార్డులో అత్యధికంగా 10 మంది అభ్యర్థుల చొప్పున పోటీ పడుతుండగా 10, 15, 29 వార్డుల్లో 9 మంది, అత్యల్పంగా 4, 11, 18, 19, 22 వార్డుల్లో ముగ్గురు చొప్పున రంగంలో నిలిచారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొన్నది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీలకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ కేటాయించిన 50 గుర్తుల్లో ఒక్కో అభ్యర్థికి మూడు గుర్తులను ఆప్షన్స్‌లో కోరుకునే అవకాశంతో సహా పేరు ఆధారంగా వచ్చే మొదటి అక్షరాన్ని నిబంధనగా తీసుకొని దాని ప్రకారం గుర్తులను కేటాయించారు.

రెండో వార్డు బరిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

టీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థుల్లో రెండో వార్డు నుంచి ఎంటెక్‌ చదివి సీజేఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వాంకుడోత్‌ అనిత ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల్లో కంటే విద్యాధికురాలిగా నిలిచారు. ఇదిలాఉండగా మంగళవారం ఉదయం టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బీ-ఫారాలను పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందజేసి వెళ్లారు. అప్పటి నుంచి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఆయా పార్టీల నుంచి అభ్యర్థిత్వం ఆశించిన నాయకులు, వారి అనుచరులు, బంధు మిత్రులంతా పార్టీల ప్రతినిధులు దాఖలు చేసే బీ-ఫారాల్లో తమ పేర్లు ఉన్నాయో? లేదో? అనే తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూశారు. ఉదయం 11 గంటలకు అభ్యర్థుల పేర్లు తేలిపోవడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు తమ వార్డులో బరిలో ఉన్న రెబల్స్‌, స్వతంత్రులతో తమకు అనుకూలంగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు తంటాలు పడ్డారు. కొందరు అభ్యర్థులు ఉపసంహరణకు బేరసారాలకు దిగితే మరికొందరు.. చివరి క్షణం వరకూ ఎటూ తేల్చుకోలేకపోయారు. ఇంకొందరు సమయం దాటిన తర్వాత కార్యాలయానికి చేరుకోవడంతో అధికారులు వారిని అనుమతించకుండా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని మూసివేయించారు. ఎన్నికల నిర్వహణ సహా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకుడు బాదావత్‌ సంతోశ్‌, ఆర్డీవో మధుమోహన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నోముల రవీందర్‌యాదవ్‌తో కలిసి సమీక్షించారు. డీసీపీ శ్రీనివాసరెడ్డి, అర్బన్‌ సీఐ మల్లేశ్‌ పోలీస్‌ బందోబస్తును పర్యవేక్షించారు.


logo