సోమవారం 30 మార్చి 2020
Jangaon - Jan 15, 2020 , 02:22:34

ఓట్ల పండుగ!

ఓట్ల పండుగ!


జనగామ, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలతో జనగామ మార్కెట్‌కు లక్ష్మి కళ వచ్చింది. ఎన్నికల పండుగతో అన్ని రకాల వ్యాపారులకు చేతినిండా పని దొరుకుతోంది. సరైన గిరాకీ లేక డీలా పడిన వ్యాపారులకు ఒకటి తర్వాత మరోటిగా వస్తున్న ఎన్నికలు ఆర్థిక వెసులుబాటును ఇవ్వబోతున్నాయి. మద్యం షాపులు, బార్లు, హోటళ్లు, మెస్‌లు, పెయింటర్లు, ఫ్లెక్సీ ల తయారీదారులు, టెంట్‌హౌజ్‌, డీజే, మైక్‌సెట్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, వస్త్ర దుకాణాలు ఒక్కటేమిటీ వాటికి అనుబంధంగా ఉన్న అనేక వ్యాపారాలకు భారీగా గిరాకీ పెరిగింది.. ఎన్నికల వేళ పలు దుకాణాలు కళకళలాడుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ మొదలైన తరుణంలోనే సంక్రాంతి పండుగ రావడంతో వార్డుల్లోని ప్రతి ఇల్లు ఓట్ల పండుగతో సందడిగా మా రింది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు సైతం ఇదే మంచి తరుణంగా గడపగడపకు వెళ్లి ‘హ్యాపీ సంక్రాంతి గ్రీటింగ్స్‌' చెప్పి ఓ ట్లు అభ్యర్థిస్తున్నారు.

బార్లు కిటకిట..

ఎన్నికల్లో మద్యం ప్రభావం బాగా ఉంటుంది. మందు లేకుంటే ఓట్ల పండుగ మజా లేదనేది వాస్తవం. అయితే ఈ సారి మద్యం షాపుల కోటాపై అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ముందస్తుగానే ఖర్చులను అంచనా వేసుకోవడంతోపాటు మద్యం నిల్వలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తనిఖీలు ముమ్మరం అవుతాయనే ఉద్దేశంతో అభ్యర్ధులు ముందస్తుగా మందు స్టాక్‌ కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు ఎన్నికలకు ముందు రోజు మందు సీసాలు సరఫరా చేసేందుకు పట్టణంలోని మద్యం దుకాణాదారుల నుంచి ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరికొందరు మద్యం వ్యాపారులు అభ్యర్థులు నుంచి అడ్వాన్స్‌గా డబ్బు తీసుకొని స్లిప్పులు, టోకెన్లు జారీ చేసి ఆ తర్వాత డబ్బు లెక్కలు చూసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

జెండాలు.. టోపీలకు గిరాకీ

ఎన్నికల్లో తోరణాలు, కండువాలు, జెండాలు, టోపీలకు గిరాకీ ఉంటుంది. ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన శైలిలో పార్టీల గుర్తులకు అనుగుణంగా కండువాలు, టోపీలను ధరిస్తారు. తోరణాలు, జెండాలు కట్టి ప్రచారం నిర్వహిస్తారు. ఎన్నికల వేళ ఎండలు మండుతుండడంతో టోపీలకు భారీ డిమాండ్‌ ఉంటుంది. అయితే ఈ సారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా ఉండటంతో అభ్యర్థులు అచీతూచి ఖర్చు చేస్తున్నారు. టోపీలు, కండువాలు, తోరణాలు, జెండాలతో వస్త్ర వ్యాపారులు, కుట్టు మిషన్లకు గిరాకీ పెరిగింది.

కరపత్రాలు, ఫ్లెక్సీలు

ఎన్నికల్లో ఎంత ఎక్కువగా ప్రచారం జరిగితే ఆశించిన మేరకు ఓట్లకు దగ్గరవుతామనే దృష్టితో కరపత్రాలు, ఫ్లెక్సీలకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఒక్కో అభ్యర్థి వేల సంఖ్యలో కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రిస్తున్నారు. ఫ్లెక్సీలు, కరప్రతాలు, వాల్‌పోస్టర్ల, ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్‌ పత్రాల  కోసం ఆఫ్‌సెట్‌ ప్రిటింగ్‌ ప్రెస్‌లు, ఫ్లెక్సీలు, డీటీపీ కేంద్రాలకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు.

హోటళ్లు, టెంట్‌ హౌజ్‌లు..

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారికి, అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా టిఫిన్లు, భోజన ఏర్పాట్లు చేసుకుంటారు. నాణ్యత కలిగిన రుచికరమైన వంటకాలతో సమయానికి ఇంతమందికి సరిపడా భోజనం, టిఫిన్‌ అందించారనే ఒప్పందంలో భాగంగా జిల్లా కేంద్రంలోని హోటళ్లు, మెస్‌ల గిరాకీ పెరిగింది. ఇక్కడ కూడా ముందస్తు టోకెన్ల విధానంతో కార్యకర్తలు, నాయకులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలకు టెంట్లు, పార్టీ కార్యాలయాల ముందు, ప్రధానపార్టీల నాయకుల ఇళ్ల వద్ద షామియానాలు వేస్తుండడంతోపాటు మైక్‌లు, లౌడ్‌స్పీకర్లు, డీజేసౌండ్స్‌ వంటి వ్యాపారులకు ఆదాయం పెరిగింది.logo