బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Jan 15, 2020 , 02:21:54

బల్దియా ప్రచారంలో కొత్త పుంతలు

బల్దియా ప్రచారంలో కొత్త పుంతలు


జనగామ, నమస్తే తెలంగాణ : ‘పుర’పోరులో ఉన్న అభ్యర్థులు యువ ఓటర్లను ఆకర్షించేందుకు  ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌ను ఉపయోగించుకుంటున్న నేటితరం ప్రచార వేదికగా సామాజిక ప్రసార మాధ్యమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తరుచూ ఆన్‌లైన్‌లో ఉండే యువతను ఆకట్టుకునేందుకు ఎన్నికల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈలాంటి ప్రచారం జాతీయ రాజకీయాల్లో ఉండగా, ప్రస్తుతం మున్సిపల్‌ స్థాయి ఎన్నికల్లో సోషల్‌ మీడియాతో ఓట్లకు గాలం వేసేందుకు జోరుగా ప్రచారం సాగుతోంది. సెల్‌ఫోన్లలో యువత అత్యధికంగా ఉపయోగించే ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, టెలిగ్రాం యాప్‌ల ద్వారా ప్రచారం మొదలు పెట్టారు.  అభ్యర్థులు తమ బయోడేటాతోసహా పార్టీ కార్యక్రమాల్లో తాము పాల్గొన్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేసుకుంటూ లైక్స్‌, షేరింగ్‌, కామెంట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం అభ్యర్థిప్రచారానికి ఖర్చు, కఠినమైన ప్రవర్తనా నియమావళి ఉండడంతో అభ్యర్థులు ఖర్చులేని, ఎన్నికల సంఘం పరిధిలోకి రాని సోషల్‌ మీడియాను ఎంచుకుంటున్నారు. అయితే సోషల్‌ మీడియాపై అవగాహనలేని సీనియర్‌ అభ్యర్థులు సైతం తమ కుటుంబంలోని యువకుల సహకారంతో అకౌంట్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు చెప్పాలనుకున్న సమాచారాన్ని అభ్యర్థుల తరఫున వారి కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.


logo