శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Jan 15, 2020 , 02:20:56

‘భోగి’ భాగ్యం

‘భోగి’ భాగ్యం


జనగామ టౌన్‌, జనవరి 14 : తెలుగు ముంగిళ్లలో సప్తవర్ణాల రంగవల్లులు వాటి మధ్యలో గొబ్బెమ్మలు.. హరిదాసుల కీర్తనలు.. బసవన్నల నాట్యాలు.. ఆకాశంలో ఎగురుతున్న పతంగులు.. పిండివంటల ఘుమఘుమలు.. పల్లెల్లో ఉట్టి పడుతున్న పాడిపంటల భోగభాగ్యాలతో జిల్లా అంతటా సంక్రాంతి శోభ సంతరించుకుంది. సూర్యుడు మకర సంక్రమణం చేసి, నవ్యకాంతితో లోకానికి సకల సౌభాగ్యాలు ప్రసాదించే మహిమాన్వితమైన రోజే సంక్రాంతి. ప్రతి ఇంటిలో సిరులు నింపి కాంతులు పంచే ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.

పవిత్ర ఉత్తరాయన ప్రవేశ శుభ ఘడియలు

సూర్యుడు మకర సంక్రమణం చేసి లోకానికి సకల సౌభాగ్యాలు ప్రసాదించే మహిమాన్వితమైన రోజే సంక్రాంతి. స్వచ్ఛమైన సూర్యుని కాంతే సంక్రాంతి. పవిత్ర ఉత్తరాయనంలో సూర్య భగవానుడు ప్రవేశించితన నూతన దివ్యకాంతిని సమస్త కోటికి ప్రసారం చేయనున్నాడు. లోక బాంధవుడైన సూర్యభగవానుడు పవిత్ర ఉత్తరాయనంలోకి ప్రవేశిస్తున్న మహత్తర కాలమే మకర సంక్రమణం. జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండుగను అత్యంత ఆనందోత్సాహాలనడుమ జరుపుకోనున్నారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి, ఉత్తరాభిముఖుడై భూమిపైన ఉత్తరార్థగోళంలో ప్రవేశించాడు. దీంతో ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమయింది. ప్రతి ఇంటిలో సిరులు నింపి సరికొత్త కాంతులు పంచే ఈపర్వదినాన్ని కుటుంబసభ్యులు తమతమ బంధు మిత్రు లతో అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

వైభవంగా భోగి వేడుకలు..

చెడు దహనం.. మంచికి శ్రీకారం.. ఇండ్ల ముంగిళ్లల్లో, ప్రధాన కూడళ్లలో పాత వస్తువులను కాల్చుతూ వేసిన భోగి మంటలు సూర్యుడు మకర సంక్రమణం చెందడానికి స్వాగతం పలికాయి. వాకిళ్లలో గొబ్బెమ్మలతో కూడిన రంగవల్లులు, సూర్యరథం ముగ్గుతో సంక్రాంతికి సాదరంగా స్వాగతించారు. భోగి మంటలు, చిన్నారులకు భోగి పళ్లు పోయడం, పేరంటాల వాయినాలు, బొమ్మల కొలువులు, గాలిపటాల సందడితో భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మంగళవారం భోగి పండుగ రోజున జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్‌ భూక్య ధరంసింగ్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, నెహ్రూపార్క్‌ వాస్తుగణపతి ఆలయం, రైల్వేస్టేషన్‌, కుర్మవాడ, జయశంకర్‌నగర్‌, వీవర్స్‌కాలనీ, జ్యోతినగర్‌, బాలాజీనగర్‌తో పాటు జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో ఆయా వార్డుల ప్రజలు భోగి మంటలతో చెడు దహనంతో మంచికి శ్రీకారం పలికారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా జరిగింది. పలు ఇండ్లల్లో చిన్నారులకు సాయంత్రం భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. బొమ్మల కొలువులు, పేరంటాలు నిర్వహించి మహిళలు వాయినాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.

సంప్రదాయం ఉట్టిపడేలా సంబురాలు..

సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసలు, హరిదాసు కీర్తనలు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, బంధువులు, స్నేహితులతో కళకళలాడుతున్న లోగిల్లు. పిల్లలకు భోగి పండ్లు పోయడం వంటి వేడుకలతో ప్రజలు ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పర్వదినాన్ని సోమవారం జిల్లా కేంద్రలో వాడవాడల ఆనందంగా నిర్వ హించారు. ఈ వేడుకల్లో వయోభేదం లేకుండా అందరూ పాల్గొని ఆనందోత్సవాల్లో మునిగితేలారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు..

జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపూరం వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా జరిగింది. చెన్నకేశవస్వామి ఆయంలో, శివాలయంలో, గణపతి ఆలయంతో పాటు సుబ్రహ్మణ్యస్వామి, సంతోషిమాత ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు పుర ప్రముఖులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
logo