శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Jan 14, 2020 , 03:53:02

శరవేగంగా...

శరవేగంగా...


జనగామ, నమస్తే తెలంగాణ: మున్సిపోల్స్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పక్కాగా, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల అనంతరం కొద్దిపాటి మార్పులు, చేర్పులతో జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాలతో మున్సిపల్‌ కమిషనర్‌ నోముల రవీందర్‌ తుది(ఫైనల్‌) జాబితాను సోమవారం ప్రకటించారు. జిల్లాస్థాయి హోదాలో ఉన్న వారిని నోడల్‌ అధికారులుగా, జోనల్‌, రూట్‌ ఆఫీసర్లుగా నియమించి, ప్రభుత్వ పాఠశాలల సీనియర్‌ ఉపాధ్యాయులను పోలింగ్‌, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లుగా నియమించి మాస్టర్‌ ట్రెయినర్లతో శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మరో పక్క మంగళవారం వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా, సోమవారం వరకు ఒక్క అభ్యర్థి కూడా ఉపసంహరించుకోలేదు. గడువులోగా దాఖలైన 413 నామినేషన్లు అలాగే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మరోపక్క బీజేపీ తొమ్మిది మంది, టీడీపీ 14 మందికి అందజేసిన బీ-ఫారాలను అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో తెరపడనుండగా, అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తమ అభ్యర్థులకు బీ-ఫారాలను నేటి ఉదయం అందజేయనున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు 60 మంది పీవోలు, 60 మంది ఏపీవోలతోపాటు ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ముగ్గురు సహాయకులు సహా 10 శాతం అదనపు సిబ్బందితో కలిపి మొత్తం 180 మంది అధికారులు, సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించనున్నారు. అదేవిధంగా ఒక్కో వార్డులో 2 బాక్సుల చొప్పున 30 వార్డులకు 60 బ్యాలెట్‌ పెట్టెలు, బ్యాలెట్‌ పేపర్లు, అవసరమైన స్టేషనరీ, ఎన్నికల సామగ్రి సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు, సామగ్రి పంపిణీని అధికారులకు పంపిణీ చేసి, తిరిగి వాటిని స్వీకరించేందుకు హైదరాబాద్‌ రోడ్డులోని ఏకశిల బీఈడీ కాలేజీని ఎంపిక చేశారు.

పోలింగ్‌ బూత్‌ ఇలా ఉండాలి

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ బూత్‌ల్లో ఉండే ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. పోలింగ్‌ స్టేషన్‌లో సౌకర్యాలు, పరిసరాలు, గదులు, ఫర్నిచర్‌ వంటి అంశాలపై ఎన్నికల సంఘం ఫొటోలతో సహా సమాచారాన్ని సేకరిస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నాయా? లేదా? అనే కోణంలో కూడా పోలింగ్‌ బూత్‌లను పరిశీలిస్తున్నారు.

పోలింగ్‌ బూత్‌ల్లో ఉండాల్సిన సౌకర్యాలు..

- పోలింగ్‌ బూత్‌లు దాదాపు పాఠశాలల్లోనే ఉండాలి.
- పోలింగ్‌ బూత్‌ ఓటర్లకు అందుబాటులో (2 కిలో మీటర్లలోపు) ఉండాలి.
- దివ్యాంగులు వచ్చేందుకు ర్యాంప్‌ సౌకర్యం ఉండాలి.
- పోలింగ్‌ సిబ్బంది కూర్చునేందుకు, ఈవీఎంలు పెట్టేందుకు ఫర్నిచర్‌ సౌకర్యం ఉండాలి.
- విద్యుత్‌ సౌకర్యంతోపాటు పాఠశాలకు ప్రహరీ, గాలి, వెలుతురు వచ్చే సౌకర్యం ఉండాలి.

పోస్టల్‌ బ్యాలెట్‌ పొందండిలా..

ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ కీలకపాత్ర పోషిస్తుంది. పోస్టర్‌ ద్వారా వచ్చిన ఒక్క ఓటు కూడా అభ్యర్థి గెలుపోటములను శాసిస్తుంది. అయితే, పోస్టల్‌ బ్యాలెట్‌ను ఎవరు వినియోగించుకుంటారంటే.. ఎన్నికల విధులు నిర్వహించే వారు, ఆర్మీ, నేవీలో పని చేసే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఆ ఉద్యోగి సంబంధిత ఎన్నికల అధికారికి, లేకుంటే రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 10 రోజులు ముందుగా ఓటరు పేరు, చిరునామా, ఓటరు జాబితాలో వరుస సంఖ్య వంటి వివరాలను పొందుపరుస్తూ ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. వీటిని అధికారులు పరిశీలించి ఆ ఉద్యోగికి పోస్టల్‌ సర్వీసుల ద్వారా బ్యాలెట్‌ పేపర్‌ను అందజేస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌లోని తనకు నచ్చిన అభ్యర్థి పేరు లేదా అతనికి కేటాయించిన గుర్తుపై పెన్నుతో టిక్‌ మార్కు చేయాలి. తర్వాత ఆ ఉద్యోగి పోస్టు ద్వారా ఎన్నికల అధికారికి పంపించాలి. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే  బ్యాలెట్‌ బ్యాక్స్‌ ఓట్లు లెక్కిస్తారు.

బీ-ఫారాల అందజేతకు కసరత్తు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం ఒక్కరోజే మిగిలి ఉండడంతో బీ-ఫారాలు అందించేందుకు టీఆర్‌ఎస్‌ సమాయత్తమైంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేశారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసంలో అభ్యర్థులకు బీ-ఫారాలు అందించనున్నారు. వీటిని అందుకున్న వెంటనే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అభ్యర్థులు అందించనున్నారు. అలాగే, టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్లు వేసిన మిగతా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకే ఉపసంహరణకు సమయం ఉండడంతో ఆలోగా ఈ తతంగాన్ని పూర్తి చేయనున్నారు. అలాగే, కాంగ్రెస్‌ కూడా తన అభ్యర్థులకు బీ-ఫారాలు అందించనుంది. బీజేపీ, టీడీపీలు తమ అభ్యర్థులకు సోమవారమే బీ-ఫారాలు అందించడంతో వారు రిటర్నింగ్‌ అధికారులకు అందించారు. కాగా,  30 వార్డులకు 268 మంది 413 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, అందులో టీఆర్‌ఎస్‌ నుంచి 167 ఉన్నాయి. కొన్ని వార్డులకు భర్త ఒక వార్డు నుంచి భార్య మరో వార్డు నుంచి నామినేషన్‌ వేశారు. వీరిలో ఎవరు బరిలో ఉంటారనేది నేడు తేలనుంది. వార్డుకు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నా మొత్తం 150 మంది బరిలో నిలిచే అవకాశం ఉంది.


logo