మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Jan 14, 2020 , 03:51:49

సంక్రాంతి సంబురాలు షురూ..

సంక్రాంతి సంబురాలు షురూ..


జనగామటౌన్‌, జనవరి13: భూమి పుత్రుల పండుగ సంక్రాంతి రానేవచ్చింది.వాకిళ్లకు వర్ణ కాంతులను తీసుకొచ్చే.. ఇంటిల్లి పాదికి సకల సౌభాగ్యాలను మోసు కొచ్చే మకర సంక్రాంతి వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. లోగిళ్లలో సింగిడిని మైమరిపించే రంగవల్లులు.. హరిలో రంగ హరి.. అంటూ సినిమా పాటలను మించే హరిదాసు కీర్తనలు.. అంబపలుకు జగదంబపలుకు అంటూ భవిష్య వాణి వినిపించే బుడుబుక్కల వాళ్ల ఢమరుకం.. అయ్యగారికి దండం పెట్టు అంటూ సాగే గంగిరెద్దుల విన్యాసాలు.. కొత్త బట్టలు.. కొత్త అల్లుళ్ల రాక.. బావా మరదళ్ల చక్కిలిగింతలు.. పిండివంటల ఘుమఘుమలు.. పతంగుల సందడి.. చిన్నారుల ఉత్సాహం.. ఇంకా ఎన్నో.. మరెన్నో సరదాలమేళ పల్లెపండుగకు జనగామ జిల్లా ముస్తాబైంది. మూడు రోజుల ముచ్చెటైన పండుగలో నేడు భోగభాగ్యాల భోగిని వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. మంగళవారం బోగి, బుధవారం మకరసంక్రాంతి, గురువారం కనుమ పండుగలను నిర్వహించేందుకు ఊవ్విళ్లూరుతున్నది. జిల్లాలోని ఆలయాలలో సైతం భక్తుల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మూడు రోజుల ముచ్చటైన పండుగ

సంక్రాంతి మూడు రోజుల ముచ్చటైన వేడుక . మొదటి రోజు భోగి. రెండో రోజు సంక్రాంతి. మూడో రోజు కనుము. సూర్యుడి గమనానికి అనుగుణంగా జరుపుకునే పండుగే సంక్రాంతి. హిందువుల ప్రతి పండుగలోనూ, చేసే పూజలోనూ ఏదో ఒక ఆంతర్యం దాగి ఉంటుంది. దక్షిణాయణం చివరి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. దీంతో సూర్యరశ్మి సరిగ్గా ఉండక, క్రిమికీటకాలు ప్రబలుతాయి. ఈక్రమంలోనే గ్రామీణ ప్రాంత మహిళలు పేడతో ఇళ్లముందు సుందరంగా అలికి, సున్నపు పిండితో, వివిధరకాల రంగురంగుల ముగ్గులు వేస్తారు. వీటి ప్రభావంతో వ్యాధికారక క్రిమికీటకాలు నశిస్తాయి. ముగ్గుల మీద పేడ ముద్దలుంచి, వాటికి పసుపు కుంకుమలు పెట్టి వివిధపూలతో అలంకరిస్తారు.ఇవే గొబ్బెమ్మలు.హరిదాసుల హరినామస్మరణ, గంగిరెద్దుల విన్యాసాలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్రనామ పారాయణాలు వినిపిస్తాయి. భోగిరోజు గోదాదేవి కల్యాణాన్ని కమనీయంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి పిండి వంటలు చేసి, కడుపు నిండా భుజిస్తారు. కనుమ రోజు మినుములతో గారెలు వండి, పెద్దలకు నైవేద్యంగా పెట్టడంతోపాటు పశువులను పూజిస్తారు.

బోగ భాగ్యాల భోగి

దక్షిణాయణం దేవతలు నిద్రించే కాలంగా చెప్పుకుంటారు. దీంతో సంక్రాంతికి ఒకరోజు ముందు పీడనివారణ కోసం వీధుల్లో భోగి మంటలు వేసి, ఇంట్లోని పాత వస్తువులను ఆహుతి చేస్తారు. మరుసటి రోజు నుంచి కొత్త వస్తువులు ఉపయోగించడం ఆనవాయితీ. భోగి రోజున తెల్లవారుజామున పిల్లలకు తలస్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, అక్షింతలు కలిపి వారి తలలపై పోయడం ద్వారా దృష్టి దోషం తొలగిపోతుందని పెద్దలు నమ్ముతారు. పెద్దల చేత భోగి పండ్లను పోయించడం వల్ల చిన్నారుల ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి. భోగి రోజే గోదాదేవి రంగనాథ స్వామిని వివాహ మాడిందని చెబుతారు. అప్పటి నుంచే ఆమె భోగ భాగ్యాలు పొందిందని ప్రతీతి. భోగి రోజున మహిళలు వాకిళ్లను రంగు రంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, రెగు పళ్లు పోస్తారు.ఇలా చేయడంవల్ల లక్ష్మీదేవి తమఇళ్లలోకి వస్తుందని నమ్మకం.

మకర సంక్రాంతి

సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు.ఈరోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది.సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు తిరుగుతాడు. దీనినే ఉత్తరాయణంగా చెబుతారు. ఇది మహా పుణ్యకాలం. ఏ శుభ కార్యానికైనా మంచిదని ప్రజలు నమ్ముతారు. అందుకే సంక్రాంతి మహత్తర మైన పండుగ అని పురాణాలు ప్రవచిస్తున్నాయి. సంక్రాంతిన పితృదేవతలకు తర్పణం విడుస్తారు. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం గుమ్మడికాయ దానం చేస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో పాయసం చేసి సంక్రాంతిలక్ష్మికి నైవేద్యంగా పెడుతారు. మహిళలు ముగ్గులు వేయడం, పిండి వంటలు చేయడంలో నిమగ్నులవుతే, చిన్నారులు పతంగు లు ఎగురవేస్తారు.

రైతుల పండుగ కనుమ

భోగి, సంక్రాంతి తర్వాత రోజున జరుపుకునే పండుగ కనుమ. కనుమ అంటే  పశువు అని అర్థం. కొందరు తెలియక కనుమ అంటారు. కనుము పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారు. పశువులను అలంకరించి గోప్రదక్షిణం చేస్తారు. ఆ రకంగా వాటి రుణం తీర్చుకున్నట్లు భావిస్తారు. గ్రామ దేవతలకు నైవేద్యా లు పెడుతారు. ఎడ్లబండ్లతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.

మార్కెట్లో సందడి

ఈ మూడురోజులపాటు ప్రతి ఇంటిలోగిలి ముత్యాల ముగ్గులతో కళకళలాడనుండగా, మార్కెట్లో రంగుల విక్రయాలు ఊపందుకున్నాయి. గొబ్బెమ్మల తయారీకి వాడే ఆవుపేడ, రేగుపండ్లు, బంతిపూలు, గరకపోసలు, మామిడి ఆకులను గ్రామీణులు పట్టణాల్లోకి తెచ్చి అమ్ముతున్నారు. దీంతో జిల్లాకేంద్రం సహా అన్నిగ్రా మాల్లో వినియోగదారులతో కిటకిటలాడాయి.logo
>>>>>>