గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Jan 14, 2020 , 03:50:33

పకడ్బందీగా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ జరగాలి

పకడ్బందీగా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ జరగాలి


జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 13: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తుది జాబితాను సిద్ధం చేసి బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. బ్యాలెట్‌ పేపర్ల డిజైనింగ్‌, సీరియల్‌ నంబర్‌, వార్డుల వారీగా అభ్యర్థుల గుర్తులు తెలుగు వర్ణమాల ప్రకారం ఉండేలా సంబంధిత నోడల్‌ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌, రెవెన్యూ డివిజన్‌ అధికారులు రెండుసార్లు నిశితంగా పరిశీలించి పంపిణీ చేయాలన్నారు. ఓటరు నమోదు 100 శాతం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అత్యల్పంగా నమోదయ్యాయని, ఈసారి ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అయిన పీవోలు, ఓపీవోలు, ఆర్వోలు, ఏఆర్వోలు, సర్వీస్‌ ఓటర్లు, ఇతరులు తమ ఓటు హక్కును ఎన్నికల సంఘం వెబ్‌ పోర్టల్‌ ద్వారా గానీ ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ద్వారా గానీ (ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమం)లో ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో ఆర్వోకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లకు ఓటుహక్కు వినియోగంలో ఎలాంటి సందేహాలు లేకుండా పోలింగ్‌ స్టేషన్‌ వారీగా ఎలక్ట్రోరల్‌ జాబితాను ప్రచురించాలని ఆదేశించారు. ఓటరుకు తప్పనిసరిగా సిరా మార్కు పెట్టే అధికారిని నియామకం చేయాలని కలెక్టర్‌ను ఆదేవించారు. ఒక ఓటరు స్థానంలో మరొకరు ఓటు వేస్తే కేసులు ఉంటాయని నాగిరెడ్డి హెచ్చరించారు. ఓటరును గుర్తించేందుకు వార్డుల వారీగా అడిషనల్‌ పోలింగ్‌ స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి రెండో విడత శిక్షణ, కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పరిశీలకుల సమక్షంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, స్టేషనరీ, ప్లయింగ్‌ స్వాడ్‌ నిరంతరంగా పని చేయాలని, సహాయ వ్యయ పరిశీలకులు, ఫ్లయింగ్‌ స్వాడ్‌ ద్వారా వివరాలను షాడో రిజిస్టర్‌లో పొందుపర్చాలని, వీడియోగ్రాఫీ కూడా చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల సైజు, సంఖ్యను బట్టి కౌంటింగ్‌ రోజు టేబుళ్లు ఏర్పాటు చేసి సాయంత్రం 4 గంటల్లోపు ఫలితాలు వెల్లడయ్యేలా చూడాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్‌కు వెబ్‌క్యాస్టింగ్‌ నిర్వహణ, కౌంటింగ్‌ రోజు ప్రతి రౌండ్‌ వెబ్‌క్యాస్టింగ్‌ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లకు లొకేషన్‌ మ్యాప్‌ను అప్‌లోడ్‌ చేయాలని, ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో మధుమోహన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ పాల్గొన్నారు.logo