శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Jan 13, 2020 , 03:03:00

ప్రత్యేక వ్యూహం!

ప్రత్యేక వ్యూహం!


జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా గులాబీ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నది. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్తిత్వానికి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో రెబర్స్‌ తెరపైకి రాకుండా పార్టీ శ్రేణులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 14వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో పోటీదారుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ శ్రేణులు చర్యలు చేపట్టారు. మరోవైపు జనగామ పురపీఠంపై గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కదులుతున్నారు.

వార్డులకు ఇన్‌చార్జీల నియామకం

జనగామలోని వార్డులన్నీ క్లీన్‌ స్వీప్‌ చేసి మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ వ్యూహ రచన చేస్తున్నది. ఇప్పటికే పురపీఠం తమదేనన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ ముఖ్య వర్గాలు ఉన్నాయి. అయితే, వార్డులన్నింటినీ గెలిచేందుకు ప్రచారం చేసే విషయంలో నేతలు కొత్త ఆలోచనలకు నాంది పలుకుతున్నారు.  వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతి ఓటరును కలిసి ఓటు అడిగేలా నాయకులు వార్డుల వారీగా ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించనున్నారు. నాలుగైదు వార్డులు కలిపి ఓ ముఖ్య కూడలి వద్ద సభను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఏయే సమయాల్లో ఎక్కడెక్కడ నిర్వహించాలో నిర్ణయించుకుంటారు. కచ్చితంగా గెలుస్తామనే వార్డులో ప్రచారంలో లోటు ఉండకుండా ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీ-ఫారాలు సమర్పించిన తర్వాత పార్టీ జెండాతో వీధుల్లో ప్రచారం చేయనున్నారు. అప్పటి వరకు టికెట్‌ కచ్చితంగా వస్తుందని సంకేతాలు అందిన వారు పార్టీ జెండాలు లేకుండా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వార్డులోని తమ బంధువులు, మిత్రులు, యూత్‌ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు, వార్డు ముఖ్యులను కలుస్తూ ముందుకెళ్తున్నారు. ఇక 14వ తేదీ తర్వాత అధికారికంగా ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నారు. సామాజిక మాధ్యమాలైన వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగ్రాం వంటి వాటిని వినియోగించుకోనున్నారు. టీఆర్‌ఎస్‌ చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలను తక్కువ నిడివి గల వీడియోలను ప్రజలకు చేరవేయనున్నారు. ఈ వీడియోల్లో ఆయా వార్డుల అభ్యర్థుల వివరాలు ఉంటాయి. ప్రతి వార్డులో టీఆర్‌ఎస్‌ పరిశీలకుడు ఉంటాడు. ప్రచారంలో లోపం గుర్తిస్తే, చేయాల్సిన మార్పులు, చేర్పులు, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు పరిశీలకులు పార్టీకి చేరవేస్తారు. ప్రతి వార్డుకు పార్టీ ఇన్‌చార్జీలు ఉంటారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపి ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తుది నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకెళ్లనున్నారు.

క్రమశిక్షణకు మారుపేరుగా..

టీఆర్‌ఎస్‌ ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రమశిక్షణపై మాట్లాడుతుంటారు. క్రమశిక్షణ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ఆయన నొక్కి చెప్తారు. అదే సూత్రాన్ని జనగామ మున్సిపల్‌ ఎన్నికల్లో అమలు చేయనున్నారు. క్రమశిక్షణతో పని చేస్తే పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆశావహ అభ్యర్థులకు భరోసా ఇవ్వనున్నారు. ‘పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ, రిజర్వేషన్‌ కారణంగానో, ఇతర కారణాల వల్ల టికెట్‌ ఇవ్వలేకపోతారు. అలా అని ఆ కార్యకర్తపై పార్టీలో చిన్నచూపు ఉండదు’ అనే విషయాన్ని కార్యకర్తలకు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తారు. అవకాశం, అర్హతను బట్టి పదవులు ఇస్తారు. ఈ విషయాలన్నీ ప్రతి కార్యకర్తకు తెలుసు. అందుకే క్రమశిక్షణగా మెలుగుతారు. ఆ క్రమశిక్షణ వల్లే మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకాభిప్రాయం దిశగా ఎమ్మెల్యే వ్యూహరచన చేస్తున్నారు. అందువల్లే టీఆర్‌ఎస్‌లో రెబల్స్‌ బెడద ఉండకపోవచ్చని పార్టీ సీనియర్‌ నేతలు చర్చించుకుంటున్నారు. వివిధ వార్డుల నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా 1వ వార్డు నుంచి దాఖలయాయి. అయితే, ఒక్కరికే బీ-ఫారం దక్కనుంది. బీ-ఫారం దక్కించుకున్న వారు మినహా.. మిగతా వారంతా నామినేషన్లు ఉపసంహరించుకోనున్నారు. అయితే, పార్టీ ముఖ్యులు మాట్లాడి నామినేషన్‌ వేసిన వారి మధ్య సయోధ్య కుదురుస్తున్నారు. దాదాపు ఇప్పటికే చాలా వార్డుల్లో నామినేషన్లు ఉపసంహరించుకుని పార్టీ అభివృద్ధికి, అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒకట్రెండు రోజుల్లో మెజార్టీ వార్డుల్లో ఒకరు మినహా మిగతా వారంతా నామినేషన్లు విత్‌డ్రాకు సిద్ధమయ్యారు. రెండు వార్డుల విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కొలిక్కి వచ్చి ఆ వార్డుల్లోనూ రెబల్స్‌ లేకుండా చూడనున్నారు. టికెట్‌ కోసం భారీగా పోటీ ఉన్న టీఆర్‌ఎస్‌లో రెబల్స్‌ బెడద ఉంటుందని ప్రత్యుర్థులు చేసిన ప్రచారానికి పార్టీ చెక్‌ పెట్టింది. ఒక్కో వార్డు నుంచి ఒక్క అభ్యర్థి మాత్రమే బరిలో ఉండేలా చూసుకోవడం పార్టీ ప్రస్తుత కర్తవ్యం. బరిలో నిలిచే వారి తుది జాబితా విడుదలయ్యాక వార్డులన్నీ క్లీన్‌స్వీప్‌ చేయడంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించనుంది. దీని కోసం ఇప్పటికే పలు ఆలోచనలను సిద్ధంగా ఉంచుకుంది గులాబీ పార్టీ. గెలవడం, గెలిపించుకోవడం పార్టీకి కొత్త కాకపోయినా ఎవరినీ తక్కువగా అంచనా వేయకుండా గులాబీ దళం ముందుకెళ్తున్నట్లు కనిపిస్తున్నది.

సంప్రదింపులతో సమస్యకు చెక్‌..

జనగామలోని 30 వార్డుల్లో 268 మంది 413 సెట్ల నామినేషన్లు సమర్పించారు. అత్యధికంగా 1వ వార్డు నుంచి దాఖలయ్యాయి. వీరు సమర్పించిన సెట్లలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. అత్యధికంగా టీఆర్‌ఎస్‌ నుంచి 167 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, ఎంపికైన 30 మంది మినహా మిగతా వారితో పార్టీ ముఖ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో చాలా మంది బరిలో నుంచి తప్పుకోవడానికి సూచనప్రాయంగా ఒప్పుకున్నట్లు తెలిసింది.


logo