మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Jan 13, 2020 , 02:58:31

ప్రజలు సేవకులను గుర్తిస్తారు

ప్రజలు సేవకులను గుర్తిస్తారు


మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ, జనవరి 12: ప్రజలు పాలించే సేవకులను గుర్తిస్తారని 17వ వార్డుకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి యాళ్ల పుష్పలతా రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విత్‌డ్రాల కార్యక్రమంలో భాగంగా తనపై ప్రత్యర్థిగా పోటీ చేసిన సోమ చైతన్య విరమించుకోవడంతో యాళ్ల పుష్పలతారెడ్డి ఏకగ్రీవంగా 17వ వార్డు కౌన్సిలర్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ... 5 సంవత్సరాలుగా 13వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో చిల్డ్రన్స్‌ పార్క్‌, వైఎస్సార్‌, జగ్జీవన్‌రావు కాలనీల్లో బోర్లు వేయించి, వాటికి మోటర్లు ఫిటింగ్‌ చేయించానన్నారు. అదే విధంగా రామన్నపేట కాలనీ మీదుగా జగ్జీవన్‌రావు కాలనీని కలుపుతూ రూ. 1.30 కోట్లతో రోడ్డు మంజూరైందని త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామన్నారు.  ప్రస్తుతం ఆ వార్డు 17వ వార్డుగా అవతరించడంతో  తనను ఏకగ్రీవం చేశారని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను పోటీ చేయనని చెప్పినా నువ్వే పోటీ చేయాలని వెంటపడి ఐదు సంవత్సరాలుగా కేటీఆర్‌, జగ్జీవన్‌రావు, రామన్నపేట, వైఎస్సార్‌ కాలనీల ప్రజలు తన సేవను గుర్తించి మరోసారి అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కాలనీ వాసులకు చేరవేయడమే కాకుండా మౌలిక సమస్యలపై తక్షణమే స్పందించి వారికి వెన్నుదన్నుగా ఉంటానన్నారు. ప్రజల తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుని వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. విత్‌డ్రా అనంతరం వ్యవసాయ మార్కెట్‌ నుంచి హౌజింగ్‌బోర్డు కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి సంబురాలతో పటాకులు కాల్చారు. ఈ కార్యక్రమంలో యాళ్ల మురళీధర్‌రెడ్డి, కొండపెల్లి కరుణాకర్‌, కట్ల వెంకన్న, రంగారెడ్డి, లింగన్న, యాదగిరి, శ్రీనివాస్‌, కోండ్ర ఎల్లయ్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>