మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Jan 12, 2020 , 04:45:52

మిన్నంటిన బంధువుల రోదనలు

మిన్నంటిన బంధువుల రోదనలు

వరంగల్‌ చౌరస్తా, : ప్రేమోన్మాది షాహిద్‌ చేతిలో హత్యకు గురైన మునిగాల హారతి (24) మృతదేహానికి శనివారం ఎంజీఎం మార్చురీలో శవ పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పదునైన లోహంతో గొంతు కోయడం వల్లే హారతి మృతి చెందిందని, శరీరంపై మరెక్కడా ఎలాంటి గాయాల్లేవని వైద్యులు ధ్రువీకరించారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని వెంటనే ఉరితీయకుండా పోలీసులు కస్టడీలో ఉంచుకొని భద్రత కల్పిస్తున్నారని మృతురాలి బంధువులు ఆందోళన చే పట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులను గిరిజనాభివృ ద్ధి,  స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరితగతిన కేసు విచారణ నిర్వహించి నిందితుడికి తగిన శిక్ష పడేలా చర్యలు చేపడుతామని చెప్పారు. ప్రేమోన్మాదానికి మునిగాల హారతి బలవ్వడం దిగ్భ్రాంతికి గురిచేసిందని స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, త్వరితగతిన విచారణ పూర్తి చేసి కఠిన శిక్ష పడేలా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారి హారతిని హత్య చేసిన నిందితుడికి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ అన్నారు. త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టేలా చూస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళల భద్రతకు పటిష్ట చర్యలు చేపడుతామని తెలిపారు.


logo
>>>>>>