బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Jan 10, 2020 , 12:49:08

సమస్యల్ని నా దృష్టికి తీసుకురండి

సమస్యల్ని నా దృష్టికి తీసుకురండి

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్ద ఎన్నికల్లో అధికారులు, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల సౌకర్యార్థం నామినేషన్లు స్వీకరిస్తున్న మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా కౌంటర్‌ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కౌంటర్‌ వద్ద ఎన్నికల సిబ్బంది అభ్యర్థులకు కావాల్సిన సూచనలు, సలహాలను అందిస్తారన్నారు. అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలోనూ, ఇతర సర్టిఫికెట్ల క్లియరెన్స్‌, ఇతర పత్రాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని వివరించారు. ప్రచార సమయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఫలితాల లెక్కింపు వరకు అన్ని ఏర్పాట్లు జరిగాయని, అందుకు సిబ్బందిని కూడా సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.


మీసేవ కేంద్రాల్లో ఓటరు గుర్తింపుకార్డు
జనగామ, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఓటరుగా నమోదైన ప్రతి పౌరుడు మీసేవా కేంద్రాల్లో రూ.35 చెల్లించి ఓటరు గుర్తింపు కార్డులను పొందాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం జనగామలోని గడిబజార్‌ మీసేవా కేంద్రాన్ని ఆయన సందర్శించి మహిళకు ఓటరు గుర్తింపుకార్డును అందజేశారు. ఒక్కో ఓటరు ఐడీకార్డుకు సర్వీస్‌ చార్జి కింద రూ.35 మాత్రమే చెల్లించాలని ఆయన సూచించారు.


logo