శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Jan 10, 2020 , 12:48:34

ఫొటోలు కాదు.. అంకితభావం ముఖ్యం

ఫొటోలు కాదు.. అంకితభావం ముఖ్యం

పెద్దవంగర : ఫొటోలు దిగడం కాదు ముఖ్యం.. పనిలో అంకితభావం కావాలని, పల్లెల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మానుకోట జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెంను బాలవికాస స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమా చేపడుతోంది. ఈ క్రమంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కెనడా దేశస్తుల బృందం గ్రామంలో పర్యటించింది. కాగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లికి, కెనడా బృందానికి గ్రామ ప్రజలు, బాలవికాస ప్రతినిధులు బతుకమ్మలతో, కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. సర్పంచ్‌ దుంపల జమున అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతిలో, హరితహారం కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఫొటోలు దిగేందుకంటే పనిలో అంకిత భావం చూపించడం ఎంతో ముఖ్యమని దయాకర్‌రావు అన్నా రు. ఉప్పరగూడెం గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్య పనుల్లో జాప్యం జరుగుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిరోజుల్లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌, అధికారులను ఆదేశించారు. వీధుల్లో చెత్తను వేసినా, చెట్లను నరికినా, బహిరంగ మల విసర్జన చేసినా కఠినంగా వ్యవహరిస్తూ, జరిమానాలు విధించాలని, దీనిపై పూర్తి బాధ్యత సర్పంచ్‌, గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులదే అన్నారు.


మన ఊరిని మనమే బాగుచేసుకోవాలి
కేసీఆర్‌ ప్రభుత్వంలోనే పల్లెల అభివృద్ధి సాధ్యమౌతుందనే నమ్మకాన్ని ప్రజాప్రతినిధులు, పాలకులు, అధికారులు ప్రజకు కల్పించాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని సూ చించారు. అలాగే పంచాయతీకి వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. 70ఏళ్లు పరిపాలించిన గత ప్రభుత్వలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి ప్రణాళిక పనులు చేపట్టడంతో గ్రామాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుందన్నారు. ప్రభుత్వం చేపట్టే పనుల్లో అధికారులు జవాబుదారి తనంతో పాటు పనులు వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో 10రోజుల పల్లె ప్రగతిలో ప్రజలకు, అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీలకు వెంటనే స్థలాలను కేటాయించి, పనులు త్వరగా పూర్తిచేయాలని రెవె న్యూ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఏ ఒక్కచోట అపరిశుభ్రంగా ఉన్న అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. పరిశుభ్రత పాటించని కుటుంబాలకు అవసరమైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించకుం డా గ్రామ కమిటీలు చర్యలు చేపట్టాలని కోరారు.

కూరలేలా ఉన్నాయి..?
మండలంలోని పెద్దవంగర ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భోజనం చేశారు. ఉప్పరగూడెం పాఠశాల ముందు నుంచి అటుగా వెళ్తున్న మంత్రి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుంది? మంచిగా వండుతున్నారా? లేదా అని ఆరా తీశారు. దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. అలాగే పాఠశాలలో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేశ్వరి, జెడ్పీటీసీ జ్యోతిర్మయి, వైస్‌ఎంపీపీ కల్పన, మండల ప్రత్యేకాధికారి రాజు, తహసీల్దార్‌ యోగేశ్వర్‌రావు, ఎంపీడీవో అపర్ణ, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, ఉపసర్పంచ్‌ సోంమల్లు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య, కెనడా విదేశీ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


logo