ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Jan 10, 2020 , 12:47:53

గులాబీ ‘నవ’ వసంతం!

గులాబీ ‘నవ’ వసంతం!

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ముఖచిత్రంలో మునుపెన్నడూలేని రాజకీయ వాతావరణం. ఢిల్లీ నుంచి గల్లీదాకా విస్తరించి వికాసవంతమై పరుగులు తీస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న ప్రజాకర్షక నాయకత్వం, అన్ని రంగాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, సమన్వయ సారథ్యం వంటి సానుకూల అంశాలతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతున్నది. ఇటువంటి తరుణంలో పోటీచేసి ఉన్నకాస్త మర్యాదను పోగొట్టుకోవడం ఎందుకు? అన్నది కాంగ్రెస్‌, బీజేపీల్లో నెలకొన్నది. చిన్నపామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్న టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మక ఎత్తుగడల ముందు మిగతా రాజకీయ పార్టీలు అసలు దరిదాపుల్లోకి కూడా తొంగిచూసే పరిస్థితి లేకపోవడం ఈసారి మున్సిపల్‌ ఎన్నికల చిత్రంలో చెప్పుకోదగ్గ పరిణామం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లల్లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి నుంచి టికెట్టు తమకంటే తమకే కావాలని పోటీపడే వాతావరణం నెలకొన్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణాల్లో చేసిన అభివృద్ధి, చేయాల్సిన కార్యాచరణ ఏమిటో ప్రజలకు విస్పష్టంగా ఆవిష్కృతం చేశారు. ఈ నేపథ్యంలో జనం ఎవరెన్ని చెప్పినా వినే పరిస్థితి లేదు. ఎన్నికల్లో పార్టీ పేరు చెప్పుకొని బరిలో నిలబడటమే కాదు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల చరిత్ర నుంచి వర్తమానంలో బేరీజు వేసుకుంటే అసలు పోటీచేయడానికి సైతం ముందుకు రాని దుస్థితి నెలకొన్నది. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే నానా హంగామా చేసే పరిస్థితి గతంలో ఉండేది. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో వెలుగువెలిగిన కాలంలో నెలకొన్న వాతావరణానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకు దిగజారిన పరిస్థితికి బేరీజు వేసుకుంటే ఆ పార్టీ ఉనికెక్కడ ఉందో తెలియని పరిస్థితి. స్పష్టంగా ఫలానా చోట మేమున్నాం. ఫలానా చోట మా అభ్యర్థులు నిలబడుతున్నారు’ అని చెప్పలేని దయనీయ దుస్థితిలోకి తమ పార్టీ వెళ్లిపోయింది స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులే పేర్కొనడం గమనార్హం.


ఎన్నికల వేళ వచ్చేవాళ్లు కావాలా..ఎల్లవేళలా తోడుండేవాళ్లా..
కాంగ్రెస్‌, బీపేపీ ప్రధాన పార్టీల్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. 2014 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో కానీ, 2015 వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో కానీ, 2018 సాధారణ ఎన్నికల్లో, లేదా ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నెలకొన్న వాతావరణానికి, ఎన్నికల అనంతర వాతావరణానికి మధ్య చెప్పుకొని కనీసం సేద తీరే వాతావరణం కూడా లేకపోవడం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లో నెలకొన్న నైరాశ్యం కేడర్‌లో ఆవహించి ఉన్నదని ఆ పార్టీ వర్గాలే తమతమ స్వయం విశ్లేషణల్లో బయటడుతన్నాయి.
ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కేవలం ఎన్నికల సమయంలో వచ్చిపోయే నాయకులే కనిపిస్తున్నారు కానీ ఎన్నికల అనంతరం జనం మధ్య ఉండి, జనంతో మమేకమై వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమైన నాయకులు కనుమరుగు కావడం వల్ల ‘ఎన్నికల సమయంలో వచ్చే నాయకుల్ని ఎవరు నమ్ముతారు’ అని స్వయంగా ఆ పార్టీ నా యకులే అసహనం, అనాసక్తి వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రజాకర్షణ ముందు ..
టీఆర్‌ఎస్‌ తొలి, మలి దశ ప్రభుత్వం చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు జనం గుండె లో గూడుకట్టుకున్న గులాబీ జెండా సారథి, సీఎం కేసీఆర్‌ జనాకర్షక వ్యక్తిత్వం ముందు ఎవరు మాత్రం నిలబడి ఏం చేస్తారు అన్న భావన ఇటు జనంలోనే కాదు అటు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లోని కేడర్‌కు ఉంది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో ముందుకు రాని వాతావరణం నెలకొన్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరిగే తొమ్మిది మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును ఆపే శక్తి ఎవరికీ లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పటికే అనేక సమావేశాల్లో స్పష్టం చేశారు. ఆయనే కాకుండా ఆయా మున్సిపాలిటీల్లో బలమైన కేడర్‌, బలమైన నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం, విశ్వనీయత మరే పార్టీకి లేదని, ఒకవేళ అక్కడక్కడా పోటీచేయాలనే ఆసక్తి ఉన్నా చివరి నిమిషంలో ‘చెయ్యి’ ఎత్తేసే వాతావరణమే ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడా కమలనాథులు స్టేజీ మీటింగులు పెట్టి భీషణ, గంభీర ప్రకటలు చేస్తారే కానీ క్షేత్రస్థాయిలో పెద్దగా వారితో ఒరిగేది లేదని, అయినా సరే ప్రతీ క్షణం అణుకువగా, అప్రమత్తంగా ఉండాలే టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నది.

తొలినాడే తేలిపోయిందా..?
మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నాడే మిగతా రాజకీయ పార్టీల పేలవమైన ప్రదర్శన ఉందని తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిందింటికి తొమ్మిది మున్సిపాలిటీల్లో గులాబీ నవ వసంతం ఆవిష్కృతం అయ్యే వాతావరణం స్పష్టమైందా? అంటే ఆయా మున్సిపాలిటీల్లో నెలకొన్న రాజకీయ వాతావరణం అవుననే అంటుంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు, మహబూబాబాద్‌ జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీలు, జనగామ జిల్లాలోని జనగామ మున్సిపాలిటీ, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్య మిగితా రాజకీయ పార్టీల్లో నెలకొన్న అనిశ్చితి, టీఆర్‌ఎస్‌ పార్టీలో నెలకొన్న కోలాహలం విస్పష్టం చేస్తుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.


logo