రేపు లక్ష్మీనరసింహుడి జాతర
సప్తగిరులను తలపించేలా కొండలు
ఏటా కార్తీక పౌర్ణమి రోజు స్వామి వారి కల్యాణం
వన మూలికలకు నిలయం..ప్రకృతి రమణీయంగా గుట్టలు
కురవి, నవంబర్ 17: కందగిరి పర్వత శిఖరంపై కాకతీయుల కాలంలో వల్మీకం(పుట్ట) రూపంలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి అవతరించినట్లు చెబుతుంటారు. కపిలవాయి, స్కంద మహాముని తపస్సుతో స్కందగిరిగా పిలిచేవారని, కాలక్రమేణా కందగిరి, కందికొండగా మారింది. స్వామి వారు వెలిసిన శిఖరంపై పెద్ద కందిచెట్టు ఉండేదని.. అందుకే ఆ పేరు వచ్చి ఉంటుందని కూడా భావిస్తుంటారు. ఈ పర్వతంపైకి రెండు మార్గాలు ఉండగా, ఒకటి అయ్యగారిపల్లి నుంచి గుట్టపైకి వెళ్లి మధ్యలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. రెండోది కందికొండ గ్రామం నుంచి శిఖరంపైకి ఉంటుంది. ఒక మార్గంలో వెళ్లిన భక్తులు దిగేటప్పుడు మరో దారిలో వస్తుంటా రు. ఈ ప్రాంతంలో ఎక్కువగా భక్తులు కందయ్య, కందగిరి, కందస్వామి అను పేర్లను పెట్టుకుని భక్తిని చాటుకుంటారు. శిఖరంపై ఉన్న ప్రధాన ఆలయంపైన అఖండ దీపా న్ని సాయంత్రం వేళ వెలిగిస్తారు. ఇది మహబూబాబాద్, మరిపెడతో చుట్టుపక్కల గ్రామాల్లో కనిపిస్తుంది. గుట్ట ఎక్కలేనివారు, అవకాశం లేని భక్తులు ఈ దీపాన్ని చూసి తరిస్తారు. గుట్టపైకి ఎక్కే భక్తులకు మధ్యలో కుడిబాగాన ఉన్న గుహలో స్వయంభూగా వెలిసిన వేంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. గుహకు అడ్డంగా పెద్దబండరాయి ఉండేదని, అది అనుకోకుండా కింద పడినట్లు సాక్ష్యంగా కింద బండరాయి కనిపిస్తున్నదని స్థానికులు చెబుతుంటారు. గుట్టపై అడుగుకో కోనేరుతోపాటు రాజులు అక్కడ పాలించినట్లు ఆనవాళ్లు.. బండరాళ్లతో నిర్మాణాలు దర్శనమిస్తా యి. నాలుగు దర్వాజలు ఉన్న ఆనవాళ్లు ఉన్నా ప్రస్తుతం ఒక దర్వాజ మాత్రమే ఉన్నది. కందగిరి పర్వతం నిటారుగా ఉండడంతోపాటు పెద్దపెద్ద బండరాళ్లు, రప్పలు, ముళ్లపొదలను దాటుతూ వెళ్లాల్సి వస్తుంది. ఎంత కష్టమైనప్పటికీ భక్తులు గోవిందా.. గోవిందా.. అంటూ భక్తితో గుట్ట ఎక్కి దిగుతుంటారు.
ఔషధ మొక్కలకు నిలయం..
కందికొండ గుట్ట పూర్తిగా చెట్లు, తీగలతో దట్టంగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపిస్తుంటుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ అనేక ఔషధ మొక్కలు ఉన్నట్లు పూర్వీకులు చెబుతుంటారు. వీటి కోసం ఇప్పటికీ ఆయుర్వేద వైద్యులు, కోయజాతికి చెందిన గిరిజనులు వస్తుంటారు. గుట్టపైకి ఎక్కగానే రెండు కోనేర్లు ఉన్నాయి. వీటిలో స్నానం ఆచరిస్తే ఎంతటి రోగమైనా నయమవుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి సీతజడ ఆకులను ఇంటికి తీసుకువెళ్తుంటారు.