e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జనగాం ఊరూరా రైతు ఉత్పత్తి సంఘాలు

ఊరూరా రైతు ఉత్పత్తి సంఘాలు

 • కలిసికట్టుగా ఏర్పాటు చేసుకుంటున్న రైతులు
 • ఏడాదిన్నరలోనే ఉద్యమంలా ఎఫ్‌పీవోల స్థాపన
 • ఫర్టిలైజర్‌, పెస్టిసైడ్‌, సీడ్‌ దుకాణాల నిర్వహణ
 • నకిలీ, కల్తీ దందాకు చెక్‌
 • విత్తనాల ఉత్పత్తికి యూనిట్లు
 • ఆర్థికబలోపేతం వైపు అన్నదాతలు

వరంగల్‌ రూరల్‌, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ఎఫ్‌పీవోల ఏర్పాటు, నిర్వహణలో వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 38 ఎఫ్‌పీవోలు ఏర్పడ్డాయి. ఇందులో 34 సంఘాలు ఒక్క నర్సంపేటలోనే ఉన్నాయి. ఈ సంఖ్యలో ఎఫ్‌పీవోలు ఎక్కడా లేవని నర్సంపేట డివిజన్‌ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందని వ్యవసాయ అధికారులు చెప్పారు. ఇందులో ఖానాపురంలో 7, నర్సంపేట, చెన్నారావుపేటల్లో ఆరు, దుగ్గొండి, నెక్కొండ, నల్లబెల్లిలో ఐదు ఎఫ్‌పీవోలు పనిచేస్తున్నాయి. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఏడీఏ టి.శ్రీనివాసరావు చొరవతో ఎఫ్‌పీవోల ఏర్పాటు, కార్యకలాపాల నిర్వహణలో డివిజన్‌ ముందువరుసలో ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఖానాపురం మండలం అయోధ్యనగర్‌లో మహిళలు, నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లె, చెన్నారావుపేట మండలం పాపయ్యపేట, చెరువుకొమ్ముతండలో ఎస్టీలు, నర్సంపేట మండలం గురిజాలలో ఎస్సీలతో కూడిన ఎఫ్‌పీవోలు ఏర్పడడం మరో విశేషం.

ప్రభుత్వ ప్రోత్సాహం
ఎఫ్‌పీవోలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఆదాయ మార్గాలు చూపుతుంది. ఏటా వానకాలం, యాసంగి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో నిర్వహించే కేంద్రాలను ఎఫ్‌పీవోలకు కేటాయిస్తుంది. గత యాసంగిలో వీటికి 14 సెంటర్లను కేటాయించగా ఎఫ్‌పీవోలు 4.15 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు చేశాయి. తద్వారా కమీషన్‌ రూపంలో సమకూరే ఆదాయంతో ఎఫ్‌పీవోలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయనేది ప్రభుత్వ లక్ష్యం. విత్తనాల ఉత్పత్తి కోసం ఇప్పటికే రెండు ఎఫ్‌పీవోలకు రూ.1.20 కోట్లు ఇచ్చింది. సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు నర్సంపేటలోని విఘ్నేశ్వర రైతు ఉత్పత్తి సంఘానికి రూ.60 లక్షలు, ఖానాపురం మండలం బుధరావుపేటలోని రైతు ఉత్పత్తి సంఘానికి రూ.60 లక్షల చొప్పున ఇటీవల మంజూరు చేసింది. ఈ నిధులు పూర్తిగా గ్రాంట్‌. వీటిని ఈ ఎఫ్‌పీవోలు తిరిగి ప్రభుత్వానికి చెల్లించనవసరం లేదు. త్వరలో గోదాం నిర్మించి, సీడ్‌ ప్రాసెసింగ్‌ యంత్రాల ఏర్పాటుతో వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలు ఉత్పత్తి చేసి వచ్చే యాసంగి సీజన్‌లో మార్కెట్‌లోకి తెచ్చే పనుల్లో నర్సంపేట విఘ్నేశ్వర, బుధరావుపేట రైతు ఉత్పత్తి సంఘం నిర్వాహకులు ఉన్నారు. బ్యాంకుల సహకారంతో ఎఫ్‌పీవోల ద్వారా రైతులకు పంట పెట్టుబడి కోసం రుణాలు ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులోనూ ఎఫ్‌పీవోలకు ప్రాధాన్యం ఇస్తే యంత్రాలను రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా మరింత ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

ఇది కొత్త ఒరవడి
ఎఫ్‌పీవోల ఏర్పాటు నూతన ఒరవడి. వీటితో రైతులు సంఘటిత శక్తిగా మారుతారు. వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. మోసపోయే అవకాశం ఉండదు. ఎఫ్‌పీవోల అమ్మకంతో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపై నమ్మకం కలుగుతుంది. నకిలీ, కల్తీ అనేది ఉండదు. నాణ్యమైనవే అందుబాటులోకి వస్తాయి. అనవసర ఖర్చులు తప్పుతాయి. సీడ్‌ ప్రాసెసింగ్‌తో ఎఫ్‌పీవోలే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. కంపెనీల విత్తనాలు కొనాల్సిన అవసరం ఉండదు. ఆదాయంతో రైతులకు రుణ బాధ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అనేక ప్రయోజనాలతో రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతరు. ఐక్యతతో సమష్టి నిర్ణయాలు తీసుకుంటరు.

 • టి.శ్రీనివాసరావు, ఏడీఏ,నర్సంపేట

సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఇవ్వడం సంతోషం
600మంది రైతులతో మా సంఘం పనిచేస్తోంది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కోసం గ్రామంలో దుకాణం నిర్వహిస్తున్నం. కొరత లేకుండా నిర్ణీత ధరకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుతున్నాయి. బుధరావుపేట కంపెనీకి ప్రభుత్వం రూ.60 లక్షలతో సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ మంజూరు చేయడం సంతోషం. ఈ యూనిట్‌తో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. విత్తనాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ చేయవచ్చు. నకిలీ, కల్తీ విత్తనాల బాధ ఉండదు. రైతులకు మంచి లాభాలు వస్తాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించడంతో పాటు యూరియా కూడా ఇస్తే సంఘాలు మరింత వృద్ధి చెందుతాయి.

 • మహాలక్ష్మి వెంకటనర్సయ్య,
  ఎఫ్‌పీవో అధ్యక్షుడు, బుధరావుపేట

పెట్టుబడి భారం తగ్గుతుంది..
గ్రామంలోనే రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటుచేసుకోవడం వల్ల రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. లోకల్‌గా సంఘం నిర్వహిస్తున్న షాపులోనే అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఎమ్మార్పీకి దొరుకుతున్నయ్‌. రవాణా ఖర్చులు తప్పుతున్నయ్‌. ఇక్కడ కల్తీ ఉండదు. రైతులకు పంటల సాగుపై భరోసా కలుగుతున్నది. ఈ సంఘాల్లోని సభ్యులకు ఎకరాకు రూ.2 వేల వరకు ఖర్చు ఆదా అవుతుంది. రైతులందరూ సంఘాల్లో సభ్యులైతే మార్కెట్‌ను శాసించవచ్చు.

 • పేరాల రమేశ్‌, రైతు, బుధరావుపేట

మార్కెటింగ్‌లోకి అడుగు..
జిల్లాలో ఎక్కువ సంఘాలు మార్కెటింగ్‌లోకి అడుగుపెట్టి.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలు ఏర్పాటు చేశాయి. కంపెనీల నుంచి నేరుగా తీసుకొని ఎమ్మార్పీపై విక్రయిస్తారు. ఈ షాపుల్లో ఎఫ్‌పీవోల్లోని సభ్యులే కాకుండా ఇతర రైతులు కూడా కొనుగోలు చేస్తున్నారు. బ్లాక్‌ మార్కెట్‌కు, నకిలీ, కల్తీకి తావులేకుండా ముంగిట్లో నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు పొందుతున్నారు. ఫలితంగా ఎఫ్‌పీవోలకు ఆదాయం సమకూరుతుంది. దుగ్గొండి మండలం తిమ్మంపేటలోని మిర్చి రైతు ఉత్పత్తి సంఘం మిరప విత్తనాల విక్రయించి తొమ్మిది నెలల్లో రూ.6 లక్షల ఆదాయం సాధించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana