e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home జగిత్యాల జగిత్యాల మెడికల్‌ కాలేజీకి 1001 పోస్టులు

జగిత్యాల మెడికల్‌ కాలేజీకి 1001 పోస్టులు

జగిత్యాల మెడికల్‌ కాలేజీకి 1001 పోస్టులు

తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆర్థికశాఖ
పూర్తి స్థాయిలో బోధన, బోధనేతర సిబ్బంది
34 విభాగాల్లో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు
మెడికల్‌ కాలేజీకి ప్రిన్సిపాల్‌, హాస్పిటల్‌కు సూపరింటెండెంట్‌..
సీనియర్‌ వైద్యులు చేరే అవకాశం
త్వరలోనే కాలేజీ భవన నిర్మాణానికి స్థల కేటాయింపు
అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్య సేవలు
హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు

జగిత్యాల, జూన్‌ 24 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇచ్చిన హామీ మేరకు గత నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య కళాశాలను ప్రకటించగా, తాజాగా 1001 పోస్టులు మంజూరయ్యాయి. గతంలో ఉన్న వాటి కంటే కొత్తగా ఇచ్చిన మెడికల్‌ కాలేజీ, దవాఖానకు పూర్తి స్థాయిలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను సర్కారు కేటాయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన విభాగాల్లో ప్రొఫెసర్‌ పోస్టులు ఇవ్వగా, సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు. కాలేజీ నిర్మాణానికి త్వరలోనే స్థలాన్ని కేటాయిస్తామని, వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

రెండున్నరేళ్ల క్రితం జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు గత నెల 17న తీపికబురు అందించారు. మెడికల్‌ కాలేజీని, దానికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీని, అలాగే మెడికల్‌ రీజనల్‌ సబ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా మరో అడుగు పడింది. మెడికల్‌ కాలేజీ, దవాఖానకు సంబంధించి 1001 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామకృష్ణారావు గురువారం జీవో 72ను జారీ చేశారు. గతంలో ఉన్న మెడికల్‌ కాలేజీల కంటే కొత్తగా ఇచ్చిన మెడికల్‌ కాలేజీల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది పోస్టులను మంజూరు చేయ గా, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

34 విభాగాల్లో పోస్టులు..
జగిత్యాల మెడికల్‌ కాలేజీలో 34 విభాగాల్లో పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ విభాగంలో ప్రొఫెసర్‌, రెండు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, మూడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు లు, నాలుగు ట్యూటర్‌/డిమాన్‌స్ట్రేటర్‌ పోస్టు లు, మూడు ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఇచ్చా రు. అనాటమీ విభాగంలో మంజూరు చేసినట్లుగానే ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మాలజీ, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యునిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, టీబీసీడీ విభాగం (క్షయ), డీవీఎల్‌ విభాగం (చర్మవ్యాధులు), సీటీ సర్జరీ విభాగం, న్యూరో సర్జరీ, న్యూరో విభాగం, యూరాలజీ విభాగం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఫిజికల్‌ మెడిసిన్‌, సైకాయాట్రీ, పిడ్రీయాటిక్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ విభాగం, ఆఫ్తామాలజీ, గైనకాలజీ, రేడియో డయగ్నాసిస్‌, అనస్తీషియా, డెంటల్‌ విభాగం, ట్రాన్స్‌ఫూషియన్‌ ఆఫ్‌ మెడిసిన్‌ విభాగం, ఎమర్జెన్సీ మెడికల్‌ డిస్పాచ్‌ విభాగం, హాస్పిటల్‌ మెడికల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలోనూ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను మంజూరు చేశారు.

ప్రిన్సిపాల్‌, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు
మెడికల్‌ కాలేజీ, దవాఖానలకు సంబంధించి ప్రిన్సిపల్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులను మంజూరు చేశారు. మెడికల్‌ కాలేజీకి సంబంధించి ప్రిన్సిపాల్‌/డీన్‌ కేడర్‌ పోస్టును ఇచ్చారు. ప్రిన్సిపాల్‌తోపాటు ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టును కూడా మంజూరు చేశారు. అలాగే రెండు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, నలుగురు ప్రిన్సిపల్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, ఐదు సీనియర్‌ అసిస్టెంట్‌, పది జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను మంజూరు చేశారు. మొత్తంగా ప్రిన్సిపల్‌ కార్యాలయానికి 23 పోస్టులు ఇచ్చారు. ఇక దవాఖానకు సంబంధించి ప్రిన్సిపాల్‌ పోస్టు కేడర్‌తోపాటు సమానమైన మెడికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టును, అలాగే ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌, రెండు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, నాలుగు ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, ఐదు సీనియర్‌ అసిస్టెంట్‌, పది జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు కేటాయించారు. మొత్తంగా మెడికల్‌ కాలేజీ, దవాఖానకు సంబంధించిన పరిపాలన విభాగాలకు 46 పోస్టులు మంజూరు చేశారు.

గ్రామీణ, పట్టణ హెల్త్‌ ట్రైనింగ్‌ విభాగాలకు..
మెడికల్‌ కాలేజీలో గ్రామీణ, పట్టణ హెల్త్‌ ట్రైనింగ్‌ విభాగాలకు సైతం పోస్టులు కేటాయించారు. ఆర్‌హెచ్‌టీసీ విభాగం, యుహెచ్‌టీసీ విభాగంలోనూ హెల్త్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఒకొక్కటి చొప్పున ఇచ్చారు. అలాగే మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు రెండేసి, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఒకొక్కటి చొప్పున మంజూరు చేశారు. గ్రేడ్‌ 2 కేటగిరికి చెందిన మెడికో సోషల్‌ వర్కర్‌ పోస్టులను రెండేసి చొప్పున మొత్తం నాలుగు పోస్టులు ఇచ్చారు. ఈ విభాగంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, పబ్లిక్‌ హెల్త్‌ నర్సు పోస్టులను ఒకొక్కటి చొప్పున ఆరు పోస్టులను మంజూరు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెడికల్‌ శిక్షణ ప్రస్తుత తరుణంలో అత్యవసర విభాగంగా మారింది.

360కి పైగా నర్సింగ్‌..
మెడికల్‌ కాలేజీ, దవాఖానకు 360కి పైగా నర్సింగ్‌ పోస్టులను ఇచ్చారు. నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుతోపాటు ఐదు గ్రేడ్‌ 2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు మంజూరు చేశా రు. అలాగే 8 హెడ్‌ నర్స్‌ పోస్టులను ఇచ్చారు. ఇవే కాకుండా 350 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు, ఇంకా సీఎస్‌ఎస్‌డీ విభాగంలోనూ పోస్టులు మంజూ రు చేశారు. సెంట్రల్‌ స్టెరిలైజ్డ్‌ సైప్లె విభాగంలో నాలుగు స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు, నాలుగు ల్యాబ్‌ టెక్నిషియన్‌ పోస్టులు మంజూరు చేశారు.

సాధారణ విభాగాల్లోనూ భారీగా..
బోధన విభాగం, బోధనతోపాటు వైద్యానికి అవసరమైన ప్రొఫెనల్‌ పోస్టులతోపాటు, పరిపాలన సంబంధమైన పోస్టులను సైతం భారీగానే మంజూరు చేశారు. దవాఖాన, మెడికల్‌ కాలేజీలో లాండ్రీ విభాగంలోనూ పోస్టులు ఇచ్చారు. రెండు హెడ్‌ ధోబీ పోస్టులు, ధోబీ పోస్టులు ఇచ్చారు. సెంట్రల్‌ వర్క్‌ షాప్‌ విభాగంలో నాలుగు సీనియర్‌ టెక్నీషియన్‌, రెండు జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు, అలాగే మా ర్చురీ నిర్వహణకు జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌తో నిర్వాహకుడి పోస్టును మంజూరు చేశారు.

ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్‌ హర్షం..
మెడికల్‌ కాలేజీ, దవాఖానకు బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేయడం పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశా రు. గతంలో ఉన్న మెడికల్‌ కాలేజీల కంటే కొత్త గా ఇచ్చిన మెడికల్‌ కాలేజీల్లో పూర్తిస్థాయిలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను ఇచ్చారని, అత్యంత కీలకమైన విభాగాల్లో ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ, సైకియాట్రీ, ఎండోక్రైనాలజీ, గ్రాస్టో ఎంట్రాలజీ లాంటి కీలకమైన విభాగాల్లో పోస్టులు మంజూరు చేశారని చె ప్పారు. మెడికల్‌ కాలేజీల్లో కీలకమైన విభాగా ల్లో ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు కావడంతో నిష్ణాతులైన సీనియర్‌ వైద్యులు విధుల్లో చేరుతారని, వారి వైద్య సేవలు జగిత్యాల ప్రాంతానికి అందుబాటులో ఉంటాయని, ఇది ప్రజలకు మేలు చేస్తుందన్నారు. త్వరలోనే కాలేజీ నిర్మాణానికి స్థల కేటాయింపు పూర్తి చేస్తామని, వీలైనంత త్వరగా మెడికల్‌కాలేజీ,దవాఖాన అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో సిబ్బంది పోస్టులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జగిత్యాల మెడికల్‌ కాలేజీకి 1001 పోస్టులు
జగిత్యాల మెడికల్‌ కాలేజీకి 1001 పోస్టులు
జగిత్యాల మెడికల్‌ కాలేజీకి 1001 పోస్టులు

ట్రెండింగ్‌

Advertisement