బుధవారం 03 మార్చి 2021
Jagityal - Jan 25, 2021 , 02:29:10

ఓటు వజ్రాయుదం

ఓటు వజ్రాయుదం

  • నేడు జాతీయ ఓటరు దినోత్సవం
  • ప్రజాస్వామ్య దేశంలో ‘ఓటు’ ఎంతో కీలకం
  • నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే పాశుపతాస్త్రం 
  • దేశంలో క్రమంగా తగ్గుతున్న పోలింగ్‌ శాతం
  • ఓటరు నమోదులోనూ గణనీయమైన తగ్గుదల
  • నమోదు, వినియోగంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న యువత
  • కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి అవగాహన కార్యక్రమాలు రద్దు

జగిత్యాల, జనవరి 24, (నమస్తే తెలంగాణ): దేశ సమగ్రత, అభివృద్ధికి పాలకులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. వార్డు సభ్యుడి నుంచి రాష్ట్రపతి వరకు ఓటు ద్వారానే ఎన్నిక జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఎన్నికలో 20 నుంచి 30 శాతం మంది పౌరులు వినియోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియ జేసేందుకు 2011 నుంచి ప్రతి జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తుండగా, కొవిడ్‌ నేపథ్యంలో ఈ సారి అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. 

భారత ఎన్నికల సంఘం

భారత పౌరులంతా కుల, మతాలకతీతంగా ఓటు హక్కును స్వేచ్ఛగా, స్వతంత్రంగా వినియోగించుకునేలా చూసేందుకు దేశంలో 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఓటరు దినోత్సవాలను నిర్వహిస్తున్నప్పటికీ 2011 నుంచి మాత్రం ప్రతి జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఓటర్‌ డే సందర్భంగా భారీ అవగాహన కార్యక్రమాలు చేపట్టడడంతోపాటు 18ఏళ్లు నిండిన యువతకు కొత్తగా ఓటు హక్కు కల్పించడం, ఓటు విలువ, ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలు చేపడుతున్నది. పాఠశాలలు, కళాశాలల్లో స్వచ్ఛంద సంస్థలు, రాజ్యాంగ బద్ధమైన కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అలాగే కాలేజీలు, పాఠశాలల్లో ఓటు హక్కు ప్రాధాన్యత తదితర అంశాలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తూ వస్తున్నారు. 

తగ్గుతున్న ఓటింగ్‌ శాతం.. 

దేశ వ్యాప్తంగా ఓటు వినియోగశాతాన్ని పరిశీలిస్తే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమే అనిపిస్తున్నది. మనదేశంలో 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో 61.02 శాతం పోలింగ్‌ నమోదు కాగా, 57 లో 62.2 శాతం నమోదైంది. 62లో 55.42 శాతం జరిగింది. 1984 వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు పోలింగ్‌ శాతం పెరుగుతూ రాగా, తర్వాత జరిగిన ఎన్నికల్లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకొని, ఓటు వేయాల్సి ఉండగా, కాలక్రమంలో ఓటు హక్కును నమోదు చేసుకునేవారి సంఖ్య, ఓటు వేసే వారి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. గత 15 ఏండ్ల ఓటింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే అర్హులైన వారు ఓటు నమోదు చేసుకునే శాతంలో 20 నుంచి 30 శాతం తగ్గుదల ఉందని అధ్యయనాలు తేల్చాయి. అలాగే ఓటు హక్కును పొందిన వారు వినియోగించుకునే విషయంలోనూ నిరాసక్తత కనబరుస్తున్నట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో 30 నుంచి 40 శాతం ఓట్లు సైతం నమోదు కాని పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓటు హక్కుపై ప్రచారం చేయాలని, అవగాహన కల్పించి, నమోదు, ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని భారతీయ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి ఏడాది ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. 

కొవిడ్‌తో కార్యక్రమాలు రద్దు.. 

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను కొవిడ్‌ కారణంగా అన్ని జిల్లాల అధికారులు రద్దు చేశారు. గతంలో వివిధ రకాల ఆటల పోటీలు, ఓటరు చైతన్య ర్యాలీలు, సభలు, సమావేశాలను నిర్వహించగా, ఈ ఏడాది అలాంటి కార్యక్రమాలు ఏవీ లేకుండానే దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. కాగా పెద్దపల్లి కలెక్టరేట్‌ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటరు ప్రతిజ్ఞను నిర్వహించనున్నారు. మిగతా జిల్లాలోనూ ఇదే మాదిరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఓటర్లు.. 

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి జనవరి 15న ఎస్‌ఈసీ ఓటరు జాబితాను విడుదల చేసింది. గత నవంబర్‌ 16వ తేదీ వరకు వచ్చిన ఓటు హక్కు నమోదు పత్రాలు, తొలగింపు అభ్యర్థనలన్నింటినీ పరిశీలించి నాలుగు జిల్లాల వారీగా ఓటరు జాబితాను అధికారులు ప్రకటించారు. ఇందులో కరీంనగర్‌ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 9,99,946 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 4,96,769, మహిళా ఓటర్లు 5,02,540 మంది, ఇతరులు 31 మంది ఉన్నారు. ఇక ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 492 మంది, సర్వీస్‌ ఓటర్లలో 18 మంది మహిళలు, 492 మంది పురుషులు ఉన్నట్లు తేల్చారు. 

జగిత్యాలలో: జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలో 6,60,283 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఇందులో 3,20,257 మంది పురుషులు, 3,40,007 మంది మహిళలు, ఇతరులు 19 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు.

పెద్దపల్లిలో: పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో మొత్తం 6,73,973మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,36,141 మంది మహిళలు, 2,37,793 మంది పురుషులు, ఇతరులు 42 మంది ఉన్నట్లు ప్రకటించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో: సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 4,38,302 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,24,606 మంది మహిళలు, 2,13,693 మంది పురుషులు, ఇతరులు ముగ్గురు ఉన్నట్లు ప్రకటించారు.  


VIDEOS

logo