శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jagityal - Jan 21, 2021 , 02:32:16

బడికి వేళాయె..

బడికి వేళాయె..

  • సుదీర్ఘ విరామం.. సరికొత్తగా ఆరంభం
  • ఫిబ్రవరి ఒకటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
  • పదకొండు నెలల తర్వాత పునఃప్రారంభం
  • 9,ఆపై తరగతులకు మాత్రమే.. 
  • సిద్ధం చేస్తున్న అధికారులు

చదువుల కోవెల ముస్తాబవుతున్నది. కరోనా మహమ్మారితో పదకొండు నెలలుగా మూతపడ్డ విద్యాలయాల పునఃప్రారంభానికి వేళవుతున్నది. ఈ నెల 25 నుంచే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించి, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు అంతా సిద్ధమవుతున్నది. పాఠశాల స్థాయిలో 9, 10 క్లాసులకు, జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో అందరికీ బోధించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, యంత్రాంగం రంగంలోకి దిగింది. కొవిడ్‌ మార్గదర్శకాల మేరకు బోధనకు అవసరమైన ఏర్పాట్లతోపాటు ఇతర మౌలిక వసతుల కల్పనలో నిమగ్నమైంది.

- జగిత్యాల, జనవరి20 (నమస్తే తెలంగాణ)

పాఠశాలలు తెరువాలని నిర్ణయించిన సర్కారు, ప్రస్తుతం హైస్కూల్‌, ఆపై జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో మాత్రమే ప్రత్యక్ష బోధన చేపట్టాలని సూచించింది. 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధనను 15 రోజుల పరిశీలన అనంతరం ఇబ్బందులు రాకపోతే, 6 నుంచి 8వ తరగతి వరకు బోధన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక శిశు నుంచి ఐదో తరగతి వారికి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించకుండానే అందరినీ పై తరగతికి ప్రమోట్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులకు మార్గదర్శనం చేసినట్లు తెలుస్తున్నది. 

ఏర్పాట్లలో నిమగ్నం.. 

సుదీర్ఘ విరామం తర్వాత స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అంతా సందడి వాతావరణం నెలకొంది. పాఠశాలలను శుద్ధి చేయడం, మౌలిక వసతులను కల్పించే పనిలో సిబ్బంది, గ్రామస్తులు నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో పాఠశాలలను బోధనకు సిద్ధం చేసే విషయంలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పాఠశాలల సంసిద్ధత కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాధికారి, ఇతర అధికారులు ఇందులో సభ్యులుగా చేర్చారు. కలెక్టర్‌ జిల్లా పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో ముఖ్యంగా 9, 10వ తరగతులు ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజనం తయారీకి బియ్యం, కూరగాయలు, సిలిండర్‌, వంట చెరకు, విద్యుత్‌ సౌకర్యం, మరుగుదొడ్లు, తాగునీటి వసతి తదితర వసతులను పరిశీలిస్తున్నారు. అధికారులతోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు సైతం పాఠశాలలను పరిశీలిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఇప్పటికే రాయికల్‌ మండలంలోని అల్లీపూర్‌ ఉన్నత పాఠశాల, జగిత్యాల పట్టణంలోని ఉన్నత పాఠశాలను సందర్శంచి పాఠశాలల పునఃప్రారంభానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. 

పేరెంట్స్‌ అనుమతి ఉంటేనే..

కొవిడ్‌ ప్రభావం తగ్గినప్పటికీ పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థుల హాజరుపై ఎలాంటి ఒత్తిడి లేదని, పేరెంట్స్‌ అనుమతి ఉంటేనే ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బడికి వచ్చే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందుగా పరిశీలించనున్నారు. విద్యార్థులకు జ్వరం లాంటి లక్షణాలు ఉన్నట్లయితే పాఠశాలలోనే ఐసొలేషన్‌ గదికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి పాఠశాలలో రెండు ఐసొలేషన్‌ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్లలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారి రాధాకిషన్‌, వైద్య శాఖ అధికారి సుమన్‌మనోహర్‌రావు, పంచాయతీ అధికారి యెనగందుల రవీందర్‌ పలు పాఠశాలలను సందర్శించి శానిటేషన్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు. వస్తున్నది వేసవి కాలం కాబట్టి పాఠశాలలో మౌలిక వసతులు, మంచినీటి, టాయిలెట్ల సౌకర్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారు. 

సగానికిపైగా  విద్యా కేంద్రాల్లో బోధన.. 

విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా కేంద్రాల్లో బోధన మొదలయ్యే అవకాశాలున్నాయి. అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 3వేల పైనే విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం 9 ఆపై తరగతులకు మాత్రమే బోధన అని ప్రకటించిన నేపథ్యంలో సగానికిపైగా విద్యా కేంద్రాల్లోనే తరగతులు మొదలు కానున్నాయి. ఇక ఉన్నత తరగతులు నిర్వహిస్తున్న మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలు, ప్రభుత్వ ఆమోదిత ప్రైవేట్‌ హైస్కూల్స్‌లోనూ బోధన జరుగబోతున్నది. ఏదేమైనా 11నెలల తర్వాత విద్యాలయాలు తెరుచుకోబోతున్న నేపథ్యంలో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లోనూ కొంత భావోద్వేగాన్ని కలిగిస్తున్నది.  


VIDEOS

logo