గురువారం 25 ఫిబ్రవరి 2021
Jagityal - Jan 21, 2021 , 02:28:28

ఆపరేషన్‌ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..

ఆపరేషన్‌ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..

  • మంత్రి ఈశ్వర్‌ సాహసం 
  • రాత్రి శస్త్రచికిత్స.. కనీస విశ్రాంతి లేకుండా పర్యటన
  • ఆశ్చర్యపోయిన నాయకులు, ప్రజాప్రతినిధులు

ధర్మపురి/ ధర్మారం, జనవరి 20: ప్రజా సేవే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతూనే, నిత్యం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బుధవారం ఓ సాహసమే చేశారు. రాత్రి కడుపు నొప్పితో బాధపడుతూ దవాఖానలో శస్త్ర చికిత్స ద్వారా కణతి తొలగించుకున్న ఆయన, కనీస విశ్రాంతి లేకుండా ఉదయమే ప్రజాక్షేత్రానికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొద్దిరోజులుగా ఆయన కడుపులో ఎడమవైపు కణతితో బాధపడుతున్నారు. నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల చికిత్స వీలు కాలేదు. అప్పుడప్పుడూ కడుపునొప్పి వస్తున్నా మందులు వాడుతున్నారు. కాగా, మంగళవారం సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటనలో భాగంగా రోజంతా బిజీబిజీగా ఉన్నారు. అయితే పర్యటన ముగిసిన తర్వాత తిరుగు పయనంలో ఈశ్వర్‌కు కడుపు నొప్పి తీవ్రంగా వచ్చింది. దీంతో మార్గంమధ్యలో గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేరగా, మంత్రికి వైద్య నిపుణుడైన రామగుండం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ ఆపరేషన్‌ చేసి కణతిని తొలగించారు. కొద్దిసేపే దవాఖానలో ఉన్న మంత్రి, తర్వాత డిశ్చార్జి అయి కరీంనగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే క్యాంపు వద్ద వేచి ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించిన ఆయన, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా బుధవారం ఉదయమే ప్రజాక్షేత్రానికి వెళ్లారు. ధర్మపురి, వెల్గటూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు నిర్మాణాలను పరిశీలించారు. ధర్మపురిలో 63 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే ధర్మారం మండలం కటికెనపల్లిలో క్రికెట్‌ టోర్నీలో విజేతలకు బహమతుల ప్రదానోత్సవానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.  


VIDEOS

logo