బుధవారం 27 జనవరి 2021
Jagityal - Dec 05, 2020 , 02:04:37

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

  • కలెక్టర్‌ గుగులోత్‌ రవి
  • పల్లె ప్రగతి పనుల పురోగతిపై సమీక్ష

జగిత్యాల: జిల్లాలో చేపడుతున్న పల్లెప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ గుగులోత్‌ రవి హెచ్చరించారు. మండలాల వారీగా చేపడుతున్న పల్లెప్రగతి పనుల పురోగతిపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయం నుంచి జూమ్‌ వెబ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలు వచ్చే వారంలోగా పూర్తి చేయాలన్నారు. వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, పల్లె ప్రకృతి వనాల పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పల్లె ప్రకృతి వనంలో పూల మొక్కలతోపాటు ఇతర మొక్కలు కూడా నాటాలన్నారు. ఎకరానికి నాలుగు వేల మొక్కలు ఉండేలా ప్రణాళికను తయారు చేసుకోవాలని, దారి కోసం ఎక్కువ స్థలాన్ని వృథా చేయకుండా ఎక్కువ మొక్కలు నాటాలని సూచించారు. కమ్యూనిటీ టాయిలెట్లు, సోక్‌పిట్ల ప్రగతి చాలా వెనుకబడిపోయిందని, వెంటనే మంజూరు తీసుకుని పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేయాలని, నర్సరీల్లో మొక్కల కోసం బ్యాగ్‌ ఫిల్లింగ్‌, మట్టి సేకరణ వాటరింగ్‌ పనులను ఈజీఎస్‌ కూలీలతో చేయించాలని సూచించారు. ఈ నెలాఖరులోగా వైకుంఠధామాలు పూర్తి చేయాలని, నీరు నిలిచినట్లయితే వీటిని తొలగించి పనులు ప్రారంభించాలన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయక నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల పరిశుభ్రతపై అధికారుల కృషి బాగుందని, పిల్లలు కొవిడ్‌కు ముందు ఏయే వసతులు పొందారో ఆ వసతులను తిరిగి ఇచ్చేలా చూడాలన్నారు. పాఠశాలలను నాలుగో తరగతి సిబ్బందితో శుభ్రపరచాలని, సిబ్బంది లేని చోట పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో అవసరం లేని విద్యుత్‌ కనెక్షన్లను తొలగించాలని, కరోనా నిబంధనలు పాటించని వారి నుంచి జరిమానా వసూలు చేయాలని పేర్కొన్నారు. డ్రాయింగ్‌ ప్లాట్‌ఫాం త్వరగా పూర్తి చేయాలని, ప్లాట్‌ఫాం నిర్మాణాలపై అనాసక్తిగా ఉన్న రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, ఈఈపీఆర్‌, వ్యవసాయ, అటవీశాఖల అధికారులు, మండల అధికారులు, ప్రత్యేకాధికారులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. 


logo