శనివారం 23 జనవరి 2021
Jagityal - Dec 05, 2020 , 01:54:23

గుట్కా.. గుట్టుగా..

గుట్కా.. గుట్టుగా..

  • జగిత్యాల జిల్లాలో జోరుగా దందా! 
  • బీదర్‌ టూ జగిత్యాల..వయా జన్నారం మీదుగా సరుకు
  • ప్రత్యేక వాహనాలతో జిల్లాకేంద్రానికి రవాణా
  • ఓ ఇద్దరు వ్యక్తుల కనుసన్నల్లోనే వ్యాపారం

జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల క్రైం:జగిత్యాల జిల్లాలో గుట్కా దందా గుట్టుగా సాగుతున్నది. పోలీసులతోపాటు ప్రత్యేక బృందాలు సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో తరచుగా పట్టుబడడం చూస్తే జోరుగా సాగుతున్నట్లు తెలుస్తున్నది. 2019లో 210 మందిపై 144 కేసులు నమోదు చేసి, 41,5 లక్షల విలువైన గుట్కా పట్టుకోగా, ఈ యేడాది తొమ్మిది నెలల్లోనే కేసుల సంఖ్య గతేడాదికి మించిపోయింది. గడిచిన తొమ్మిది నెలల్లో జిల్లా వ్యాప్తంగా 243 మందిపై 169 కేసులు నమోదు కాగా, 37.93 లక్షల విలువైన గుట్కా పట్టుబడింది. అసలు నిషేధిత గుట్కా కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ నుంచి వయా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని జన్నారం మీదుగా జిల్లాకు వస్తున్నట్లు స్పష్టమవుతున్నది. 

గుట్టుగా జగిత్యాల జిల్లాలోకి..

తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో గుట్కాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలో మాత్రం గుట్కా తయారీ, విక్రయాలపై ఎలాంటి నిషేధం లేదు. దీంతో కర్నాటక నుంచి గుట్కా భారీగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు చేరుతున్నట్లు తెలుస్తున్నది. జన్నారానికి చెందిన ఓ బడా వ్యాపారి బీదర్‌ నుంచి గుట్కాను జగిత్యాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తున్నది. సంచుల్లో నింపి కార్లు, వ్యాన్లు, ఆటోలలో రవాణా చేస్తున్నారు. బీర్‌పూర్‌, సారంగాపూర్‌ లేదా రాయికల్‌ మీదుగా చేరవేస్తున్నట్లు సమాచారం. అయితే, సదరు వ్యాపారి గుట్కాను తరలించే వాహనానికి ముందు మరో వాహనం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మార్గం మధ్యలో ఎక్కడైనా తనిఖీలు ఉంటే ముందుగానే పసిగట్టి, గుట్కా తీసుకొచ్చే వాహనాన్ని తప్పించి, తనిఖీలు ముగియగానే గమ్యస్థానాలకు చేరేలా చూస్తున్నట్లు సమాచారం. ఒక్కో వాహనంలో 10 లక్షల నుంచి 20 లక్షల నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉంటున్నాయి. అలాగే, నిజామాబాద్‌ ప్రాంతం నుంచి కూడా మెట్‌పెల్లి, కోరుట్ల ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్నది.

ట్రాన్స్‌పోర్టు వాహనాల్లోనూ రవాణా?

నిషేధిత గుట్కా రవాణాకు లిమిటెడ్‌ కంపెనీల ట్రాన్స్‌పోర్టు వాహనాలను సైతం గుట్కా వ్యాపారులు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తున్నది. వే బిల్లులు, స్టేట్‌, సెంట్రల్‌ జీఎస్టీ, ఇతర బిల్లులతో కంపెనీల ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో రవాణా చేస్తే ఏ ఇబ్బందీ ఉండదని భావించి అడ్డదారులు తొక్కుతున్నట్లు వెలుగులోకి వస్తున్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గంజ్‌ ప్రాంతంలో ఉన్న ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీ కార్యాలయంలో నిషేధిత గుట్కా దిగుమతి అవుతున్నట్లు తెలుస్తున్నది. సదరు కంపెనీకి చెందిన సరుకు రవాణా వాహనాలు కొన్నేండ్ల నుంచి కార్యాలయానికి ఉదయం పూటనే వచ్చేవని, అయితే, కొద్ది రోజుల నుంచి మధ్యాహ్న సమయంలో వస్తున్నాయని, ఇరుకు రోడ్డు కావడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతున్నదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై సదరు కార్యాలయంపై ఆరా తీయడం ప్రారంభించారు. ట్రాన్స్‌పోర్టు వాహనం నుంచి సంచుల్లో ఉన్న సరుకులు దించడం, ఆ వెంటనే గుట్కా వ్యాపారానికి సంబంధమున్న వ్యక్తులు రావడం, ట్రాన్స్‌పోర్టు వాహనంలో వచ్చిన సామగ్రిని తీసుకెళ్లి గుట్టుగా గోదాములకు తీసుకెళ్తుండడంతో గుట్కా రవాణా చేస్తున్నారని అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం పూట వచ్చే ట్రాన్స్‌పోర్టు వాహనాలను తనిఖీలు చేయరని భావించి, దందా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఓ ఇద్దరు వ్యాపారుల కనుసన్నల్లోనే.. 

గుట్కా క్రయవిక్రయాలు జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఇద్దరు వ్యాపారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తున్నది. జిల్లా కేంద్రంలోని టవర్‌ నుంచి కొత్తబస్టాండ్‌ రూట్‌లో, ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సమీపంలో ఉన్న మూడు నాలుగు దుకాణాలు గుట్కా వ్యాపారానికి స్థావరాలుగా ఉన్నట్లుగా సమాచారం. జన్నారం వ్యాపారి నుంచి వచ్చిన గుట్కాను అత్యంత చాకచక్యంగా జిల్లా కేంద్రంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్న గోదాముల్లోకి చేరుస్తారు. డీలర్లు, సబ్‌ డీలర్లు, చిన్న చిన్న కిరాణా దుకాణాదారులకు సమాచారాన్ని అందిస్తారు. అవసరమున్న వారు తమకు కావాల్సినంత గుట్కాను గుట్టుగా తీసుకెళ్తుంటారు. అయితే, ఇటీవల జిల్లా కేంద్రంలో దందా సాగిస్తున్న విషయం బహిర్గతం కావడం, నిఘా పెరుగడంతో వ్యాపారులు రూటు మార్చారు. పెగడపెల్లి, మల్యాల, జగిత్యాల రూరల్‌ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో గోదాములు ఏర్పాటు చేసుకొని నిల్వ చేస్తున్నట్లు సమాచారం. గుట్కా కావాల్సిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని మార్గం మధ్యలోనే వారికి సరుకును అందచేసి నిఘా నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.logo