సోమవారం 18 జనవరి 2021
Jagityal - Nov 26, 2020 , 00:46:07

‘ధర్మపురి’లో ఫలించిన సర్కారు ప్రయత్నం

‘ధర్మపురి’లో ఫలించిన సర్కారు ప్రయత్నం

  • 400కిలోమీటర్ల మేర కెనాళ్లకు కొత్తరూపు
  • వానకాలంలో చివరి ఆయకట్టుకూ ఎస్సారెస్పీ నీరు 
  • కాలువల నిండా పారిన జలాలు 

దశాబ్దాల తర్వాత 1.10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

పంటకాలం ఏదైనా చివరి ఆయకట్టు భూముల రైతులకు మాత్రం ఎదురు చూపులే మిగిలేవి. కాలువలకు చివరగా ఉన్న పొలాలకు ఏనాడూ సరిగ్గా ఎస్సారెస్పీ నీరు అందక రైతులు దిగులు పడేది. అర్ధరాత్రి, ఆపరాత్రి, లేదంటే, రాత్రిపూట స్లూయిజ్‌లు ఓపెన్‌ చేసి, నీటిని మళ్లించుకునేందుకు తపించేది. తమ పొలాలకు నీరు అందడం కోసం కాలువలకు ముందుగా ఉన్న గ్రామాల రైతులతో వాదనకు దిగేది. ప్రజాప్రతినిధులు అధికారుల వద్దకు దరఖాస్తులు పట్టుకొని వెళ్లి, టేలెండ్‌కు ముందు నీళ్లు ఇచ్చి, తర్వాత కాలువలకు ప్రారంభంలో ఉన్న గ్రామాలకు ఇవ్వాలని కోరేది. ఇది సంవత్సరాలుగా ధర్మపురి నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చెత్తతో నిండిన కాలువలు, ఆనవాళ్లు లేని తూములతో చివరి ఆయకట్టు రైతాంగానికి ఏటా రెండు పంటలకూ ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యేవి. అయితే ఈ యేడాది వానకాలం పంట సమయంలో మాత్రం పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర సర్కారు చొరవ, మంత్రి ఈశ్వర్‌ కృషితో చివరి ఆయకట్టులోని ప్రతి పొలానికి నీరు చేరింది. గత వేసవిలో చేపట్టిన ‘జలహితం’తో ధర్మపురి నియోజకవర్గం సస్యశ్యామలమైంది. ఓ వైపు వేలాది మందికి ఉపాధిని కల్పిస్తూనే మరోవైపు 400 కిలోమీటర్ల పొడవున కాలువల ఆధునీకరణతో గతంలో సాగయ్యే భూమి కంటే పది శాతం అదనపు భూమి సాగులోకి వచ్చింది. కర్షకలోకం మురిసిపోతున్నది.       

జగిత్యాల, నమస్తే తెలంగాణ

‘ఉపాధి’ కింద కార్యక్రమం..

గత వేసవిలో ఉపాధి హామీ పథకం కింద కాలువల మరమ్మతు పనులను ‘జలహితం’ పేరిట పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ విషయమై గత మార్చిలోనే మంత్రి ఈశ్వర్‌, ప్రణాళికను రూపొందించారు. ఎస్సారెస్పీ అధికారులు, ఉపాధి హామీ అధికారులతో సమష్టిగా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పదిహేను రోజుల వ్యవధిలో కాలువల మరమ్మతులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎనిమిది వేల మంది ఉపాధి కూలీలకు పదిహేను రోజుల పాటు పనిదినాలను కల్పించాలని భావించారు. కాలువల మరమ్మతుల ద్వారా ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున 200 పైగా గిట్టుబాటు అయ్యేలా గత మే నెల 18న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈశ్వర్‌ స్వయంగా కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేసి, ఉపాధి కూలీలు, రైతుల్లో స్ఫూర్తి నింపారు. 22 రోజుల్లో పనులు పూర్తయ్యాయి. దాదాపు 400 కిలోమీటర్ల మేర కాలువలు శుద్ధి చేయబడ్డాయి. 

పెరిగిన సాగు విస్తీర్ణం..

మంత్రి ఈశ్వర్‌ చేపట్టిన జలహితం విజయవంతమైంది. దాదాపు 3 కోట్ల అంచనాలతో 8 వేల మంది కూలీలకు 22 రోజుల పాటు రోజుకు 200 చొప్పున వేతనం లభించింది. ఉపాధి హామీ కూలీలకు వేసవిలో పని గ్యారెంటీని కల్పించిన ఈ కార్యక్రమం, తదనంతర కాలంలో రైతులకు ఎంతో మేలు చేసింది. ఈ సారి ఆయకట్టు పరిధిలోని ఒక్క రైతు కూడా తన భూమికి నీరు అందలేదనే ఫిర్యాదును చేయకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. అలాగే వ్యవసాయాధికారులు ఈ సారి ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో దాదాపు పదివేల ఆయకట్టు అదనంగా సాగైనట్లుగా ప్రకటించారు. 2019 వానకాలంలో బుగ్గారం మండలంలో 10,573 ఎకరాల భూమి సాగవ్వగా, ఈ సారి 12,643 ఎకరాలు సాగైంది. గతేడాది కంటే ఈ యేడాది వానకాలంలో 2,056 ఎకరాలు అదనం. ఇక ధర్మపురి మండలంలో గతంలో 23,291 ఎకరాలు సాగు కాగా, ఈ యేడాది 24,291.. అంటే వెయ్యి ఎకరాల భూమి అదనం. గొల్లపల్లి మండలంలో 21,677 ఎకరాల భూమి ఉండగా, ఈ సారి 25,369 ఎకరాలు అంటే ఏకంగా 3,692 ఎకరాల భూమి అదనంగా సాగులోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పెగడపల్లి మండలంలో గతంలో 20,806 ఎకరాలు సాగు కాగా, ఈ సారి 21,416 ఎకరాలు సాగైంది. వెల్గటూర్‌ మండలంలో గతంలో 24,885 ఎకరాలు పండగా, ఈ సారి 26,526 ఎకరాల్లో అంటే 1,641 ఎకరాలు అధికంగా సాగులోకి వచ్చింది. 

పల్లెలకు పునర్జీవం.. 

ధర్మపురి మండలం రామయ్యపల్లి, తిమ్మాపూర్‌, బూరుగుపల్లి, రాయపట్నం ఈ గ్రామాలకు డిస్ట్రిబ్యూటరీ కాలువ ద్వారా సాగు నీరందుతుంది. గతంలో సాగుకు నోచుకోని ఆయకట్టు చివరి భూములన్నీ ఈ యేడాది సాగులోకి వచ్చాయి.  గొల్లపల్లి మండలం డీ-64కాలువ కింద ఆయకట్టు చివరి గ్రామాలుగా వెనుగుమట్ల, గోవిందుపల్లి, చిల్వకోడూర్‌, అబ్బాపూర్‌, దట్నూర్‌, లొత్తునూర్‌ గ్రామాల్లోని చివరి ఆయకట్టుకు నీరందింది. వెల్గటూర్‌ మండలంలో డీ-83/ఏ, డీ-83/బీ కాలువ కింద ఆయకట్టు కింద ఉన్న చెర్లపల్లి, ఎండపల్లి, గుళ్లకోట, రాజారంపల్లి, కొత్తపేట, పైడిపల్లి, కిషన్‌రావ్‌పేట, శాఖాపూర్‌ గ్రామాలకు నీరందింది. బుగ్గారం మండలంలో డీ-53 కాలువ కింద ఆయకట్టు చివరి గ్రామాలుగా సిరికొండ, బీర్‌సాని గ్రామాలకు, పెగడపల్లిలో డీ-76, డీ 77, డీ-84 కాలువ కింద ఉన్న వెంగళాయపేట, బతికపల్లి, సుద్దపల్లి గ్రామాల ఆయకట్టు చివరి గ్రామాలకు సాగు నీరందింది.