శనివారం 23 జనవరి 2021
Jagityal - Nov 07, 2020 , 01:49:26

అన్నదాతకు ప్రభుత్వం పెద్దపీట

అన్నదాతకు ప్రభుత్వం పెద్దపీట

రైతు పక్షపాతి తెలంగాణ సర్కార్‌

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జగిత్యాల రూరల్‌: రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పేర్కొన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం వెల్దుర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతాంగం కోసం సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని, సెంటర్లకు రైస్‌మిల్లులను కూడా కేటాయించామన్నారు. ప్యాక్స్‌, ఐకేపీ, ఏఎంసీ, డీసీఎంఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామన్నారు. గత సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసి జిల్లా రైతాంగానికి రూ.800 కోట్లు అందించామని తెలిపారు. గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. నూతన సాగు విధానంతో రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. అనంతరం జగిత్యాల రూరల్‌ మండలంలోని జాబితాపూర్‌, ధర్మారం, పొలాస, తక్కల్లపెల్లి, గుల్లపేట గ్రామాల్లో ఐకేపీ, ప్యాక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ గాజర్ల గంగారాంగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌రావు, ప్యాక్స్‌ చైర్మన్లు పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, జోగినపల్లి సందీప్‌రావు, ఏపీఎం గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాల ముకుందం, ఆనందరావు, సర్పంచ్‌ బుర్ర ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ జిల్లా అధ్యక్షుడు దావ సురేశ్‌, నాయకులు రాజగోపాల్‌రావు, నాగిరెడ్డి గంగారెడ్డి, శేఖర్‌, గంగారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

 ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

జగిత్యాల రూరల్‌ మండలం సోమన్‌పెల్లిలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ రైతులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందచేశారు. వారు మాట్లాడుతూ.. గతంలో సోమన్‌పెల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండేదని, దాన్ని రద్దు చేయడంతో రైతులు పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు సమీప గ్రామాలకు వెళ్లాల్సి వస్తున్నదన్నా రు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. నాయకులు అంజయ్య, భూమన్న, గోనె మల్లేశం, సిద్ధం నారాయణ, గోనె చిన్నగంగయ్య, పొరండ్ల శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. 

సమష్టిగా పరిష్కరించుకోవాలి

రాయికల్‌ రూరల్‌: సమష్టిగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రాయికల్‌ మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని, లేకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాయికల్‌ మండలంలో చెక్‌ డ్యాంలు నిర్మించేందుకు రూ.30 కోట్ల నిధులు మంజూరు కాగా, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. మండలానికి అంబులెన్స్‌ను అందజేసిన వీరబత్తిని లక్ష్మణ్‌, సామల్ల వీరేందర్‌కు సభ్యులు అభినందనలు తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయని, వాటిని గుర్తించి అనుమతులు రద్దు చేయాలని కో ఆప్షన్‌ మెంబర్‌ ముఖీద్‌ సభ దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యుల వద్ద వీవోలు డబ్బులు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బాధ్యులను గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలని సభ్యులంతా తీర్మానం చేశారు. ఎస్సారెస్పీ స్థలాలకు హద్దులు నిర్ణయించాలని సంవత్సర కాలంగా విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. హద్దులు నిర్ణయిస్తే హరిత హారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉంటుందని అయోధ్య సర్పంచ్‌ ఎడ్మల జీవన్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జడ్పీటీసీ జాదవ్‌ అశ్విని, ఏఎంసీ చైర్మన్‌ గన్నె రాజిరెడ్డి, తహసీల్దార్‌ మహేశ్వర్‌, ఎంపీడీవో రమేశ్‌, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.logo