శుక్రవారం 22 జనవరి 2021
Jagityal - Nov 07, 2020 , 01:49:24

కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి కాల్‌ సెంటర్‌

కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి కాల్‌ సెంటర్‌

జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి

జగిత్యాల: వరి, మక్క కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు వీలుగా జగిత్యాల జిల్లాలో కాల్‌ సెంటర్‌ను ప్రారంభించామని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. శుక్రవారం రామాలయం సమీపంలో జిల్లా కార్యాలయ సముదాయంలో వానకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కాల్‌ సెంటర్‌ను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. వానకాలం 2020-21 ధాన్యం కొనుగోళ్లలో భాగంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు, రవాణా తదితర సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా 1800 425 8187 టోల్‌ఫ్రీ నంబర్‌ కేటాయించామని, ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపా రు. రైతులకు ఎదురయ్యే సమస్యలపై ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని, జిల్లాలో చివరి గింజ వరకూ కొనుగోలు పూర్తయ్యేదాకా ఈ కాల్‌ సెంటర్‌ పనిచేస్తుందన్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన సమస్యలను తెలుసుకొని రిజిస్టర్‌లో నమోదు చేస్తామని, వాటిని ప్రతిరోజూ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారన్నారు. ఈసారి 3.26 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకాలు, 3.94లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకాల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున, జిల్లా వ్యాప్తంగా సెర్ప్‌ ద్వారా 154, ప్యాక్స్‌ ద్వారా 226, ఏఎంసీ ద్వారా 7 కేం ద్రాలకు అనుమతులు ఇచ్చామని, ఇప్పటివరకు ఐకేపీ 77, ప్యాక్స్‌ 110, ఏఎంసీ 5 కేంద్రాలను ప్రారంభించారని వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణ శ్రీ, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌ కుమా ర్‌, పౌర సరఫరాల సంస్థ అధికారి రజనీకాంత్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారి ప్రకాశ్‌, జిల్లా సహకార శాఖ అధికారి రామానుజాచారి పాల్గొన్నారు.


logo