బుధవారం 02 డిసెంబర్ 2020
Jagityal - Oct 25, 2020 , 04:38:28

నేనెట్ల బతకాలె కొడుకా..

నేనెట్ల బతకాలె కొడుకా..

నాకు ఓ మాటైనా  చెప్పకపోతివి బిడ్డా 

పూల కోసం వెళ్లి చెరువులో పడి మృతిచెందిన   యువకుడి తల్లి కన్నీరుమున్నీరు 

పండుగ పూట చెందోలిలో విషాదం

గొల్లపల్లి: ‘ఎంతపనాయె కొడుకా. సద్దుల నాడే నన్ను ఇడిసిపోతివా బిడ్డా. ఇప్పుడు నేనెట్ల బతకాలె నాన్నా. పూలకు వోతున్న అని నాకోమాటైనా జెప్పకపోతివి అయ్యా’ అంటూ చెందోలి గ్రామంలో తామర పూల కోసం వెళ్లి చెరువు నీటిలో మునిగి మృతిచెందిన విక్రమ్‌ తల్లి కన్నీరుమున్నీరైంది. పండుగ పూటే కొడుకు దూరమయ్యాడనే వార్త తెలుసుకొని బోరుమంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్గటూర్‌ మండలం గుల్లకోటకు చెందిన జక్కుల రాజయ్య - రాజవ్వ దంపతులు. వీరికి విక్రమ్‌(25), వినయ్‌ కొడుకులు. రాజయ్య కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో రాజవ్వ తన ఇద్దరు కొడుకులతో కలిసి తల్లిగారి ఊరు గొల్లపల్లి మండలం చెందోలికి వచ్చి గ్రామంలోని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నది. అయితే డిగ్రీ దాకా చదివిన విక్రమ్‌ ఎవుసంలో తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కొడుకు చేతికిరావడంతో తల్లి కొద్దిరోజులుగా పెండ్లి సంబంధాలు సైతం చూస్తున్నది. శనివారం సద్దుల బతుకమ్మ కావడంతో తామర పూలు తెచ్చేందుకు విక్రమ్‌.. దట్నూర్‌ గ్రామంలోని చెరువుకు వెళ్లాడు. నీటిలో దిగి పూలు తెంపుతుండగా, లోతు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు. విషయం తెలియగానే తల్లి రాజవ్వ కన్నీరుమున్నీరైంది. ఇప్పుడు ‘ఎంత పనాయె బిడ్డా. నేనెట్ల బతకాలె బిడ్డా’ అంటూ రోదించిన తీరు గ్రామస్తులను కలిచివేసింది. కాగా, తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జీవన్‌ తెలిపారు.