ఆదివారం 24 జనవరి 2021
Jagityal - Oct 22, 2020 , 02:55:07

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

పోలీసు అమరుల సంస్మరణలో 

కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధూశర్మ

జగిత్యాల క్రైం : శాంతి భద్రతలను పరిరక్షిస్తూ శాంతియుత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తున్నదని కలెక్టర్‌ గగులోతు రవి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల స్తూపానికి కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధూశర్మ, అడిషనల్‌ ఎస్పీ సురేశ్‌కుమార్‌ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజ అవసరాలకు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసుల అమరత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి పోలీసు శాఖతోనే సాధ్యమన్నారు. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో పోలీసు వ్యవస్థ కార్యదీక్షత, సేవాతత్పరతతో పనిచేస్తున్నదన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం యేటా అక్టోబర్‌ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం నుంచి  పోలీసు సంస్మరణ దినాన్ని పోలీస్‌ ఫ్లాగ్‌ డేగా వ్యవహరిస్తూ సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్‌ 21 నుంచి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంతి  జాతీయ ఐక్యతా దినోత్సవం అక్టోబర్‌ 31 వరకు సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని పోలీస్‌ స్టేషన్లలో  అక్టోబర్‌ 31 వరకు  పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ నిర్వహించి పోలీసుల విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, ఫ్రెండ్లీ పోలీస్‌పై ప్రజలకు వివరిస్తామన్నారు. కరోనా  నేపథ్యంలో రాష్ట్ర పోలీస్‌ పాత్ర అనే అంశంపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి, పోలీసు అమరవీరుల త్యాగాల గురించి పోలీస్‌ కళాజాత బృందాలతో ప్రజలకు తెలియజేస్తామన్నారు. పోలీసు అమరవీరుల ఇండ్ల వద్దకు వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు కలెక్టర్‌ బస్‌ పాసులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ సురేశ్‌కుమార్‌, జగిత్యాల, మెట్‌పెల్లి, ఏఆర్‌ డీఎస్పీలు వెంకటరమణ, గౌస్‌బాబా, ప్రతాప్‌, ఆర్‌ఐలు వామనమూర్తి, నవీన్‌, సైదులు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


logo