శనివారం 05 డిసెంబర్ 2020
Jagityal - Oct 21, 2020 , 01:45:10

తీరొక్క పువ్వు ఔషధాలకు నెలవు

తీరొక్క పువ్వు ఔషధాలకు నెలవు

బతుకమ్మ పండుగ అంటేనే పూలనే దైవంగా పూజించే వేడుక..  ఏటి గట్లపై, పొలం ఒడ్లపై విరబూసిన తీరొక్క పూలే బతుకమ్మలో అందంగా ఒదిగిపోతాయి. రంగురంగుల హరివిల్లులా పరుచుకుంటాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో.. తీరు తీరున బంగారు బతుకమ్మను అలంకరిస్తారు. తంగేడు, బంతి, గునుగు, కట్లపూలు, మందారాలు, గన్నేరు, గుమ్మడి.. ఒకటేమిటి ఎన్నో రకాల పూలు బతుకమ్మకు నిండుతనాన్ని ఇస్తాయి.  అందుకే ఈ పండుగ ప్రకృతిని ఆరాధించే చిహ్నంగా వెలుగులీనుతున్నది. అయితే బతుకమ్మకు ఉపయోగించే పుష్పాల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తంగేడు, గుమ్మడి, రుద్రాక్ష, గునుగు, పట్నం బంతి, గోగుపువ్వు, చామంతి, గోరింట ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు.     - ధర్మారం/ మెట్‌పల్లి టౌన్‌/ కొత్తపల్లి


గునుగు..

గునుగుపూలు గడ్డిజాతికి చెందినది. ఈ పూలలోని తెల్లదనం బతుకమ్మకే ఆకర్షణీయంగా నిలుస్తుంది. దీని శాస్త్రీయనామం సెలోసియా అమరాంథేసి.  అతిసార నివారణకు, రక్త విరేచనాలకు, రక్త స్రావంకు మందుగా వాడతారు. కంటి సంబంధిత రోగ నివారణకు ఉపయోగిస్తారు. ఈ మొక్కను పశువులకు దాణాగా ఉపయోగిస్తారు. ఇదినీటిలో వేస్తే తేలుతుంది. నీటిపై పేరుకుపోయిన మలినాలను పీల్చుకుంటుంది. పట్టుకుచ్చులు..

బతుకమ్మకు ఈ పూలు చక్కటి అందాన్నిస్తాయి. దీని శాస్త్రీయ నామం సిలోసియా అరెగేటియా. ఇది అమరాంథస్‌ కుటుంబానికి చెందిన మొక్క. పట్టుకుచ్చులు (సీతజడ) పూలను ఎక్కువగా అందానికి వాడుతారు. నారలు, అకర్శక పత్రాలు రంగుల తయారీలో ఉపయోగిస్తారు. 

తంగేడు..

ఫ్యాబేసి కుటుంబానికి చెందిన తంగేడు పువ్వు అటవీ ప్రాంతంలో లభిస్తుంది. దీన్ని నీటిలో వేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. జ్వరాన్ని తగ్గించే గుణం కూడా తంగేడులో ఉంది. దీని ద్వారా మధుమేహ ఔషధాన్ని తయారుచేస్తారు. ఇది మూత్రకోశ వ్యాధులను నివారిస్తుంది. కీళ్లనొప్పులకు సైతం పనిచేస్తుంది. 


గుమ్మడి..

బతుకమ్మలో ప్రధానంగా కనిపించే పువ్వు ఇది. దీని శాస్త్రీయ నామం కుకుర్భిటా మాక్సిమా. గుమ్మడి పూలు లేకుండా బతుకమ్మను పేర్చరంటే అతిశయోక్తి కాదు. పువ్వులోని పిందెలాంటి రూపాన్ని శ్రేష్ఠంగా అలంకరిస్తారు. గుమ్మడిలో విటమిన్‌ ‘ఏ’ ఎక్కువగా ఉండడం వల్ల కంటి సంబంధ రోగాలకు ఔషధంగా వాడుతారు.  శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో తలెత్తే కాళ్ల నొప్పులను తగ్గించే గుణం ఉంటుంది. 


బంతి.. 

బంతి పూలు ఆస్టరేసి కుటుంబానికి చెందినవి. దీని శాస్త్రీయనామం క్సింథిమమ్‌ బయాన్కో. దీనికి చలువ పువ్వుగా పేరుంది. ఇందులో గొంతు సంబంధిత వ్యాధులను తగ్గించే గుణముంది. రక్తనాళాల్లో రక్తం సులువుగా ప్రయాణం చేసే ఔషధం తయారు చేయడంలో దీన్ని వాడుతారు. 


మందారం..

రంగురంగుల్లో పూసే మందార ప్రతి పూజలోనూ కనిపిస్తుంది. దీని ఆకులు, పూలు, వేర్లు అన్నింటిలోనూ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. రక్త ప్రసరణను సరిచేసి రుతుస్రావాన్ని నియంత్రిస్తాయి. కాలేయ వ్యాధులు, రక్త పోటుకు దీన్ని మందుగా ఉపయోగిస్తారు. వీటితో చేసిన నూనెలను వాడడం వల్ల వెంట్రుకలు నల్లబడతాయి. అతిసారంతో బాధపడేవారికి ఈ పుష్పం ఉపశమనం కలిగిస్తుంది. సౌందర్య సాధనాల తయారీలో, జుట్టు రాలకుండా ఈ పుష్పాన్ని వాడుతారు.


చామంతి..

దీని శాస్త్రీయనామం క్రెసాంథిమం ఇండికోర. మహిళలు అలంకరించుకునేందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని యాంటి బయోటిక్‌గా వాడతారు. ‘ఫైరటమ్‌' అనే కీటక నాశన మందులను తయారు చేయడంలో వినియోగిస్తారు. జలుబు, గొంతునొప్పిని తగ్గిస్తుంది. నిద్రలేమి, ప ని ఒత్తిడి వల్ల వచ్చే కండ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను తగ్గిస్తుంది. మొటిమలు తగ్గడానికి దీని ఆకులు బాగా పనిచేస్తాయి. కండ్లకు, కాలేయానికి, రక్త ప్రసరణ లోపానికి సంబంధించిన సమస్యలకు దీనిని మందుగా వాడతారు. 


బీర..

బీరపువ్వు శాస్త్రీయ నామం ల్యూఫా ఆక్యు టాంగులా. ఇది చర్మవ్యాధులు, మలబద్దకాన్ని నివారిస్తుంది. దీనిలో ఔషధగుణాలు చాలా ఉన్నాయి. 

కనకాంబరం . 

కనకాంబరాల్లో లెక్కకు మించిన ఔషధగుణాలున్నాయి. దీని ఆకులు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగస్‌లను నివారిస్తాయి.


తామర..

దీని శాస్త్రీయనామం నిలుంబోన్యూ సిఫెరా. కలువలుగా పిలుస్తారు. దీన్ని రక్తస్రావ నివారణకు మందుగా వాడుతారు. పువ్వులను జీర్ణవ్యవస్థలో ఆరోగ్యకరమైన ఔషధంగా, సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. హృదయ సంబంధిత రోగాలను తగ్గిస్తాయి. కలువ గింజలు అజీర్ణానికి, విరేచనాలు తగ్గించేందుకు బాగా పనిచేస్తాయి. అనేక సౌందర్య సాధనాల్లోనూ ఈ పూల రేకులను వాడతారు. వీటిని నీటిలో మరుగబెట్టి ఔషధంగా తీసుకుంటారు.