శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jagityal - Oct 21, 2020 , 01:45:10

పర్యావరణ హితం మార్గం

పర్యావరణ హితం మార్గం

ఆదర్శం.. రోజా మహిళా పొదుపు సంఘం

కోరుట్లలో పొడి చెత్త సేకరణ యూనిట్‌తో సత్ఫలితాలు 

నేరుగా పారిశుధ్య కార్మికుల ద్వారా సేకరణ 

విక్రయాల ద్వారా  ఆర్థిక ప్రగతి

స్వచ్ఛత.. మహిళలకు ఉపాధి అనే బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొడి చెత్త సేకరణ సెంటర్‌ సత్ఫలితాలనిస్తున్నది. చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దే క్రమంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘానికి అప్పగించగా, సభ్యులకు చేతినిండా ఉపాధి దొరుకుతున్నది. సంఘ సభ్యులకు నెలకు రూ. 20వేల పైనే సమకూరుతుండగా, అటు చెత్త సేకరించి తెచ్చే కార్మికులకు అదనపు ఆదాయం వస్తున్నది. - కోరుట్ల

స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడం, సేకరణ ద్వారా స్థానిక మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కోరుట్ల మున్సిపాలిటీ పొడి చెత్త వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పొడి చెత్త నిర్వహణ బాధ్యతను మెప్మా విభాగం స్థానిక రోజా మహిళా పొదుపు సంఘంలోని ముగ్గురు సభ్యులకు అప్పగించగా, గత జూలై 30న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంభించారు. కాగా, పట్టణంలో పారిశుధ్య కార్మికులు ఇంటింటికీ వెళ్లి వ్యర్థాలు సేకరించి ఇక్కడికి తరలిస్తుండగా, ఇద్దరు సభ్యులు అందులోని పొడి చెత్తను వేరుచేస్తారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, బీరు బాటిళ్లు, ప్టాస్టిక్‌ డబ్బాలు, సీసాలు, పేపర్లను యార్డులో డంపు చేసి, అనంతరం బయట మార్కెట్లో విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. 

పారిశుధ్య సిబ్బందికి అదనపు ఆదాయం

పారిశుధ్య కార్మికులు పట్టణంలోని ఇంటింటికీ తిరిగి ట్రాక్టర్‌లో చెత్త సేకరించి తెస్తుండగా, అందులో పొడి వ్యర్థాలను కిలోకు రూ.4 చొప్పున వెచ్చించి మహిళా సంఘ సభ్యులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఒక్కో పారిశుధ్య కార్మికుడికి రోజుకు రూ. 200 నుంచి రూ.500 దాకా అదనపు ఆదాయం వస్తుండడంతో పొడి చెత్త సేకరణకు చాలా ఆసక్తి చూపుతున్నారు. అలాగే బిచ్చగాళ్లు, నిరాశ్రయులకు సైతం ఈ యూనిట్‌తో కొంత ప్రయోజనం కలుగుతున్నది. అక్కడక్కడా తిరిగి సేకరించిన చెత్తను ఇక్కడ విక్రయించుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు. 

 నెలకు రూ.20వేల ఆదాయం..

పారిశుధ్య సిబ్బంది, ఇతరుల నుంచి కొనుగోలు చేసిన చెత్తను బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.6-8కు విక్రయిస్తూ మంచి ఆదాయమే పొందుతున్నారు. ప్రస్తుతం నెలకు రూ.20 వేల దాకా వస్తున్నదని, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని సభ్యులు చెబుతున్నారు.  


ఉపాధికి మంచి మార్గం 

పొడి వనరుల సేకరణ కేంద్రం ద్వారా ఉపాధి దొరుకుతున్నది. పారిశుధ్య కార్మికులు తీసుకువచ్చే పొడి చెత్తను కిలోల చొప్పున కొనుగోలు చేస్తాం. వీటిని స్థానికంగా ఉన్న వ్యాపారులకు విక్రయిస్తాం. వివిధ పొడి వ్యర్థాలకు సంబందించి ధరల పట్టిక ఆధారంగా వెంటనే డబ్బులు చెల్లిస్తాం.

- శనిగరపు శోభ,

 సమైక్య సంఘం సభ్యురాలు (కోరుట్ల) 

స్వచ్ఛ పట్టణమే లక్ష్యం..

కోరుట్లను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పొడి వనరుల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. బల్దియా కమిషనర్‌ ఆదేశాల మేరకు మహిళలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించాం. పారిశుధ్య కార్మికులకు సైతం అదనపు ఆదాయం వస్తుండడంతో పొడి చెత్త సేకరణకు ఆసక్తి చూపుతున్నారు.

- కుంట జలంధర్‌రెడ్డి,

 మెప్మా టౌన్‌ మిషన్‌ కో ఆర్డినేటర్‌ (కోరుట్ల)