శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jagityal - Oct 20, 2020 , 06:45:49

మెట్‌పల్లి ఖాదీకి జాతీయ ఖ్యాతి తెస్తా

మెట్‌పల్లి ఖాదీకి జాతీయ ఖ్యాతి తెస్తా

మెట్‌పల్లి/మెట్‌పల్లిటౌన్‌: మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌కు జాతీయ స్థాయి లో ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఉద్ఘాటించారు. సోమవారం ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ కార్యాలయంలో చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. ప్రజల ఆదరాభిమానాలతో 23 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, జడ్పీటీసీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు. ఇప్పుడు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌కు చైర్మన్‌గా పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. గత చైర్మన్‌ కేవీ రాజేశ్వర్‌రావుకు మెంబర్‌ సెక్రటరీగా చేదోడువాదోడుగా ఉన్నానని గుర్తు చేశారు. గతంలో చైర్మన్లుగా పనిచేసిన మహనీయుల స్ఫూర్తితో మెట్‌పల్లి ఖాదీకి పూర్వవైభవం తెస్తానని పునరుద్ఘాటించారు. అద్దకంతో పాటు సన్నదారం తయారీ, వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా వస్ర్తాలు, డిజైన్ల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్థానికులకు ఖాదీ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఖాదీలో ప్రస్తుతం 800 మందికి జీవనోపాధి కల్పిస్తున్నామని, కార్మికులకు వేతనాలు తక్కువగా ఉన్న మాట వాస్తవమేనని, ఇకపై వేతనాలను సవరించడంతోపాటు పని ఆధారంగా ఇంక్రిమెంట్లు అందించి ప్రోత్సహిస్తానని ప్రకటించారు. ఖాదీ ఉత్పత్తులను పెంచి వ్యాపార అభివృద్ధికి కార్మికులు అంకిత భావంతో పని చేయాలని, కార్మికులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ, మెట్‌పల్లి ఖాదీ వస్ర్తాలకు  దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సారథ్యంలో ఖాదీ ప్రతిష్ట మరింతగా పెరుగుతుందని, ప్రజలు కూడా ఖాదీ వస్ర్తాలను వినియోగించి, ఖాదీ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మెట్‌పల్లి, కోరుట్ల  మున్సిపల్‌ అధ్యక్షులు రాణవేని సుజాత, అన్నం లావణ్య, ఉపాధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, గడ్డమీది పవన్‌, ఎంపీపీలు మారు సాయిరెడ్డి, జాజాల భీమేశ్వరీ, తోట నారాయణ, సరోజన, జడ్పీటీసీలు కంఠం భారతి, కాటిపల్లి రాధ, శ్రీనివాస్‌రెడ్డి, దారిశెట్టి లత, ఆర్బీఎస్‌ జిల్లా  అధ్యక్షులు చీటి వెంకట్రావు, ఏఎంసీ అధ్యక్షుడు నర్సయ్య, లక్ష్మి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌, నాయకులు డా సత్యనారాయణ, ప్రభాకర్‌, సుధాకర్‌గౌడ్‌, సహదేవ్‌, గోవర్ధన్‌, అనీల్‌, శ్రీనివాస్‌రెడ్డి, డీలర్‌ మల్లయ్య, ఆదిరెడ్డి, ఏశాల రాజశేఖర్‌, మాధవరెడ్డి, మనోహర్‌ ఉన్నారు.

ఇంక్రిమెంట్లు పెంచుతూ తొలి సంతకం..

చైర్మన్‌గా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మెంబర్‌ సెక్రటరీగా ఇప్పనపల్లి సాంబయ్యతో ఖాదీ మేనేజర్‌ మాధవ్‌ ప్రమాణ స్వీకారం చేయించగా, బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్మికులకు ఇంక్రిమెంట్లు ఇస్తూ విద్యాసాగర్‌రావు తొలి సంతకం చేశారు. కాగా, విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్‌ నుంచి పాతబస్టాండ్‌, వెల్లుల్ల రోడ్డులో రహదారికి ఇరువైపులా తమ అభిమాన నాయకులు, విద్యాసాగర్‌రావుకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. అంతకుముందు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో విద్యాసాగర్‌ రావు, కార్యదర్శి ఇప్పనపల్లి సాంబయ్య ప్రత్యేక పూజలు చేశారు. 

ఘన సన్మానం 

ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ కార్యవర్గం, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. అలాగే ము న్సిపల్‌ అధ్యక్షురాలు రాణవేని సుజాత, డాక్టర్‌ సత్యనారాయ ణ దంపతులు, వివిధ మండలాల నుంచి తరలివచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ నాయకులు పూలమాలలు,శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.