మంగళవారం 27 అక్టోబర్ 2020
Jagityal - Oct 19, 2020 , 03:36:58

మెట్‌పల్లి ఖాదీకి పూర్వవైభవం తెస్తా

మెట్‌పల్లి  ఖాదీకి పూర్వవైభవం తెస్తా

అద్దకంతోపాటు సన్నదారం తయారీపై ప్రత్యేక దృష్టి పెడతాం

డిమాండ్‌కు అనుగుణంగా వస్ర్తాలు, డిజైన్ల రూపకల్పన 

అధ్యయనం కోసం ఏజెన్సీ ద్వారా పరిశీలన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారసత్వ వృత్తికి సముచిత స్థానం

మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ చైర్మన్‌ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 

స్వతంత్ర సమర చరిత, దశాబ్దాల వారసత్వ సంపద కలిగిన మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌కు పూర్వవైభవం తేవడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్‌కు ఐదో చైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ప్రజల దుస్తుల ధారణ, ఇతర ఖాదీ ఉత్పత్తుల   విషయంలో జాతీయ స్థాయిలో వచ్చిన మార్పులను గమనిస్తూ, ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెట్‌పల్లి ఖాదీని తీర్చిదిద్దుతానని చెప్పారు.  

- జగిత్యాల, నమస్తే తెలంగాణ

నమస్తే: మెట్‌పల్లి ఖాదీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎలా అనిపిస్తున్నది? 

కల్వకుంట్ల: మెట్‌పల్లి ఖాదీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగానే ఉంది. 91 ఏళ్ల చరిత్ర కలిగిన మెట్‌పల్లి ఖాదీకి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ మంత్రి, స్వాతంత్య్ర సమర యోధుడు జువ్వాడి చొక్కారావు లాంటి మహానుభావులు అధ్యక్షత వహించారు. అలాంటి పదవి రావడం సంతోషమే. అయితే ఇది పదవి అనడం కంటే, బాధ్యత అనడమే సరైందన్నది నా అభిప్రాయం.


మెట్‌పల్లి ఖాదీ ప్రత్యేకత ఏంటీ?

మెట్‌పల్లి ఖాదీ జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. 10 మంది సభ్యులతో 1929లో ప్రారంభమైంది. వావిలాల ఖాదీతో కలిసి ప్రయాణం సాగించింది. 1983లో వావిలాల నుంచి విడివడింది. అత్యంత నాణ్యమైన వస్త్రాలను తయారు చేస్తున్నది. మెట్‌పల్లి ఖాదీకి ఢిల్లీలోనూ గుర్తింపు ఉన్నది. జగిత్యాల, పూడూరు, కరీంనగర్‌, నిర్మల్‌, నిజమాబాద్‌ వర్నీ, హైదరాబాద్‌ కేంద్రాల్లో విక్రయశాలలు ఉన్నాయి. 800 మంది వడికేవారు, 50 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

ఖాదీ వస్ర్తాలకు ఆదరణ తగ్గిపోయిందన్న నేపథ్యంలో మీ సంస్థ కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి?  

ఖాదీకి ఆదరణ తగ్గిపోయిందన్న విషయంలో కొంత సత్యం ఉంది. చాలా ప్రైవేట్‌ ఖాదీ బండారులు ప్రారంభమయ్యాయి. అందులో మిషనరీలపై వస్ర్తాలను తయారు చేసి ఖాదీ పేరిట విక్రయిస్తారు. మెట్‌పల్లి ఖాదీ అందుకు విరుద్ధం. పూర్తిగా చేతితోనే వస్ర్తాన్ని తయారు చేస్తుంది. దీంతో ఇతర ప్రైవేట్‌ బండారీల్లోని వస్ర్తాల కంటే ఎక్కువ ధర ఉంటుంది. ఇది వస్త్రం అమ్మకాలపై ప్రభావం చూపుతుంది. దీన్ని అధిగమించేందుకు యత్నించడమే మా ప్రధాన లక్ష్యం. అందుకే సేల్స్‌పైన ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాం. 


ఉత్పత్తులను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? 

ఖాదీలో వస్త్రం తయారీతోపాటు తేనే, అగర్‌బత్తీలు, పూలదండలు, కర్రతో తయారు చేసిన వస్తువులు, ఇండ్లలో వినియోగించే ఇతర కొన్ని నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అయితే ఖాదీ వస్త్ర ప్రపంచంగానే ఆదరణ పొందింది. మెట్‌పల్లి ఖాదీ పరిధిలో అన్ని ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడతాం. ఇక ఖాదీ వస్ర్తాలలో డిజైన్లకు సంబంధించిన విషయంలోనూ నవ్యతను సాధించాల్సిన అవసరం ఉంది. మనిషి ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటూ ఉంటాడు. ప్రజల అభిరుచులు, ముఖ్యంగా వస్త్రధారణ విషయం కాలానుగుణంగా మారుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ప్రజల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను, డిజైన్లను రూపొందించాలని భావిస్తున్నాం. గతంలో తెలుపు వస్ర్తాలకు ప్రాధాన్యత ఉండేది. తదుపరి కాలంలో కాటన్‌కు ప్రాధాన్యత తగ్గింది. తర్వాత మళ్లీ ఆదరణ పెరిగింది. ఇప్పుడు కాటన్‌ వస్ర్తాల్లోనే అనేక డిజైన్లు వస్తున్నాయి. చొక్కాలు, ఖాదీ కుర్తాలు, షార్ట్‌ కుర్తాలు, చైనా కాలర్‌ కుర్తాలు, ఇలా అనేకం వచ్చాయి. వాటికి అనుగుణంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. 


అభిరుచులు, మార్కెటింగ్‌పై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?

ప్రజల అభిరుచులు, మార్కెటింగ్‌ రెండు అత్యంత కీలకమైన అంశాలుగా భావిస్తున్నాం. ఇప్పటికే ఈ విషయంలో కొంత పరిశీలన చేశాం. జాతీయ స్థాయిలో ఖాదీ వస్ర్తాలు, డిజైన్లలో వచ్చిన మార్పులు, అలాగే మార్కెటింగ్‌ అంశాలపై అధ్యయనం చేసేందుకు ఒక ఏజెన్సీ ద్వారా పరిశీలించాలని నిర్ణయించాం. బాధ్యతల స్వీకరణ అనంతరం వస్ర్తాల డిజైన్లు, ఇతర ఉత్పత్తుల తయారీ, వాటి మార్కెటింగ్‌పై జాతీయ స్థాయిలో అధ్యయనం చేసి, వస్ర్తాలు, ఇతర వస్తువుల తయారీలో మార్పులు చేస్తాం. అలాగే మార్కెటింగ్‌లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. 


సన్నదారం తయారీపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు? సన్నదారం అంటే ఏంటీ ? ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు. 

సన్నదారం తయారీపై దృష్టి సారించాం. వస్త్రం తయారీలో దారం యొక్క మందాన్ని బట్టి, దాని కౌంట్‌ను పేర్కొంటారు. 100, 150, 200 కౌంట్‌ దారాలు అత్యంత సన్నరకం దారాలుగా చెప్పవచ్చు. మన వద్ద 150, 200 దారం తయారీ లేదు. మన వాతావరణానికి ఇవి అనుకూలం కాదు. ఇప్పటి వరకు మనం ఈ కౌంట్‌ దారంతో నేసిన వస్ర్తాన్ని కేరళ, పశ్చిమ బెంగాల్‌ నుంచి తెప్పిస్తున్నాం. అయితే ఇక ముందు ఇక్కడే తయారు చేయాలని ఆలోచిస్తున్నాం. వేడి వాతావరణం నేపథ్యంలో చేయలేకపోతే, వస్ర్తానికి బదులుగా, నూలుదారాన్ని తెచ్చుకొని తయారు చేయాలని నిర్ణయించాం. 


పరిశ్రమపై ఆధారపడిన వారి సంక్షేమంపై మీ కార్యవర్గం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది?

పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నవారికి ఉపాధి కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. అందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి మరికొంత సహకారం సంస్థకు అందాలని కోరుతాం. ఖాదీలో ఉన్న 800 మంది వడుకు, నేత కార్మికులకు పని గ్యారెంటీ కల్పించాలని భావిస్తున్నాం. కొవిడ్‌ నేపథ్యంలో కార్మికులకు రోయింగ్‌ కోమ్‌ను అందించడంలో కొంత ఆలస్యమైంది. వారు ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు అందించాం. తిరిగి పుంజుకుంది. అయితే ఇలాంటివి జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెట్‌పల్లి ఖాదీలో అద్దకం (డైయింగ్‌) విభాగం లేదు. ఈ విభాగాన్ని సైతం ఇక్కడ ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక అద్దకం టెక్నాలజీ మిషనరీని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అద్దకం మిషనరీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల అభిరుచులకు అనుగుణంగా, అన్ని రంగుల్లో కొత్త డిజైన్లను ఇక్కడి నుంచే సృష్టించబోతున్నాం.


రాష్ట్ర ప్రభుత్వ సహకారం                              ఎంత వరకు ఉన్నది? 

ఖాదీ వస్ర్తాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉంది. నిజం చెప్పాలంటే మూడునాలుగేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే ఖాదీ వస్ర్తాలు మనుగడ సాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన టెస్కో మెట్‌పల్లి ఖాదీ నుంచి ఏటా సగటున రూ.2కోట్ల దాకా ఆర్డర్‌ చేస్తున్నది. ఇది సంస్థ ఆదాయానికి ప్రధాన మార్గమైంది. సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఖాదీ వస్ర్తాన్ని, ఉత్పత్తులను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. 


మెట్‌పల్లి ఖాదీ ఉన్నతిపై ఒక్కమాటలో మీ అభిప్రాయం ?

చారిత్రక వారసత్వ సంపదకు, జాతీయభావానికి నిలయమైన మెట్‌పల్లి ఖాదీకి తిరిగి పూర్వవైభవం జాతీయ స్థాయిలో తీసుకువస్తాం. ఖాదీ వస్ర్తాలకు ప్రజల్లో ఆదరణ కలిగిస్తాం. వృత్తికారులకు ఉపాధి కల్పిస్తాం.logo