శనివారం 05 డిసెంబర్ 2020
Jagityal - Oct 04, 2020 , 01:34:45

మత్తడి.. జలసవ్వడి

మత్తడి..  జలసవ్వడి

  • కనువిందు చేస్తున్న చెరువులు
  • lకనువిందు చేస్తున్న చెరువులు
  • lజలపాతాలను తలపిస్తున్న మత్తళ్లు 
  • lఎక్కడ చూసినా సుందర దృశ్యాలు
  • lఆస్వాదిస్తున్న పల్లె ప్రజలు
  • lఅలుగుల వద్ద సందడి చేస్తున్న  యువతీయవకులు

నాడు దయనీయం.. 

కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు గ్రామాల అభివృద్ధిలో కీలకంగా ఉండేవి. పంటలు సాగు చేసేందుకు ఆధారమయ్యేవి. పక్షులు, పశువులు, మత్స్య సంపదకు నెలవుగా ఉండేవి. అన్ని వర్గాల ప్రజలకు జీవనాధారంగా ఉండేవి. మనిషి జీవితంతో మమేకమైన ఈ చెరువులు, ఉమ్మ డి రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక నిండి, పిచ్చిమొక్కలు పెరిగి, మత్తళ్లు తెగి అధ్వాన్నంగా మారాయి. కట్టలు బలహీనంగా మారాయి. చిన్న వాన పడినానీళ్లు ఆపలేని స్థితికి చేరాయి. అనేక చెరువులు, కుంటలు ఉనికిని కోల్పోయాయి. ఆయకట్టు భూములు బీళ్లుగా మారాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పల్లెల్లో తాగునీటికీ ఇబ్బందులు తలెత్తాయి.

నేడు పునర్జీవం..

నాడు ఎందుకూ పనికిరాకుండా పోయిన చెరువులు, స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి, ‘మిషన్‌ కాకతీయ’ కింద పునరుద్ధరించడంతో పూర్వవైభవం సంతరించుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో మొత్తం 4,290 చిన్న నీటి వనరులు ఉండగా, సర్కారు విడుతల వారీగా మరమ్మతులు చేయిస్తున్నది. నాలుగు విడుతలకు గానూ కరీంనగర్‌లో 956, పెద్దపల్లిలో 656, జగిత్యాలలో 709, రాజన్న సిరిసిల్లలో 338 చొప్పున మొత్తం 2,659 చెరువుల పునరుద్ధరణ కోసం 958.45 కోట్లు కేటాయించింది. 440.70 కోట్లు ఖర్చు చేసి, కరీంనగర్‌లో 521, పెద్దపల్లిలో 499, జగిత్యాలలో 575, సిరిసిల్లలో 259 చొప్పున మొత్తం 1,854 చెరువులను పునరుద్ధరించింది. మిగతా 805 చెరువుల పనులు ప్రగతిలో ఉన్నాయి.

మత్తళ్ల గలగలలు..

నాటితో పోలిస్తే ప్రస్తుతం చెరువుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పూడిక పోయింది. పిచ్చి మొక్కలు, తుమ్మలు పోయాయి. మత్తళ్లు మంచిగయ్యాయి. కట్టలు గట్టిగా తయారయ్యాయి. గత వేసవిలో కాళేశ్వరం జలాలు తరలివచ్చాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి, మత్తళ్లు దుంకాయి. ఫలితంగా ఆయకట్టు భూముల్లో తేమ శాతం, పచ్చదనం పెరిగింది. వేసవిలో ఎండల తీవ్రత తగ్గింది. వానకాలం సీజన్‌లో రుతుపవనాలు సకాలంలో వచ్చాయి. ఇటీవలి వర్షాలతో ఎక్కడ చూసినా జలపాతాలను తలపించేలా మత్తళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,981 చెరువులు మత్తడి పడుతున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 1,285, పెద్దపల్లిలో 652, జగిత్యాలలో 704, సిరిసిల్లలో 340 చెరువులు అలుగు పారుతున్నాయి.  

ఆనందాల జల్లు..

ఇన్నాళ్లూ వట్టి పోయి, చెట్లూ చేమలతో నిండిన చెరువులు, ఇప్పుడు జలకళతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయి. ఏ ఊరిలో చూసినా సుందర తీరాలుగా మారాయి. కరోనా కారణంగా స్వగ్రామాలకు చేరిన వారంతా ఇప్పుడు వాటిని చూసి మురిసిపోతున్నారు. నాడు జలపాతాలను చూసేందుకు ఎక్కడెక్కడికో వెళ్లిన యువతీ యువకులు, ఇప్పుడు నిండుగా దుంకుతున్న మత్తళ్ల వద్దకు చేరి సందడి చేస్తున్నారు. ఆనందాల జల్లుల్లో తడిసిముద్దవుతున్నారు. పారుతున్న అలుగుల్లో కేరింతలు కొడుతున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. చెరువు అందాలను తమ సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు. కొందరైతే గాలాలు తెచ్చి, చేపలు పడుతూ సరదాగా గడుపుతున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, కొత్త అనుభూతులను మూటగట్టుకుంటున్నారు.

ఆ చెరువులు ప్రకృతికే కొంగొత్త అందాలను తెస్తున్నాయి.. మిషన్‌ కాకతీయతో పునర్జీవం పోసుకుని, నిండుకుండల్లా మారి కనువిందు చేస్తున్నాయి.. కాళేశ్వర జలాలకు తోడు ఇటీవలి వర్షాలతో మత్తళ్లు జలసవ్వడి చేస్తున్నాయి.. జలపాతాలను తలపించేలా దుంకుతూ, సెలయేరులై గలగలా పారుతున్నాయి.. ఏ ఊరిలో చూసినా ఇలాంటి సుందర దృశ్యాలే కనిపిస్తుండగా, సందర్శకులతో అలుగుల వద్ద సందడి కనిస్తున్నది. ఆనందాల జల్లుల్లో తడిసి ముద్దవుతున్న జనం, కొత్త అనుభూతులను మూటగట్టుకుంటున్నది.