శనివారం 31 అక్టోబర్ 2020
Jagityal - Sep 30, 2020 , 02:08:30

హలధారి.. ఆనందహేల

హలధారి.. ఆనందహేల

  • పల్లె పల్లెనా సంపూర్ణ మద్దతు
  • పెద్దపల్లిలో 2,200, జగిత్యాలలో 2వేల ట్రాక్టర్లతో  భారీ ర్యాలీలు
  • మేడిపల్లిలో ఆకట్టుకున్నవంద ఎడ్లబండ్లు
  • పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్యేలు దాసరి, సంజయ్‌
  • సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

నూతన రెవెన్యూ చట్టానికి కర్షకులు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. పల్లె పల్లె నుంచీ కదులుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జైకొడుతున్నారు. మంగళవారం జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుంచి వేలాది మంది రైతులు 2 వేల ట్రాక్టర్లతో తరలివచ్చి, జగిత్యాల పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత పాల్గొని, ఉత్సాహం నింపారు. జగిత్యాల జడ్పీ వైస్‌ చైర్మన్‌ వొద్దినేని హరిచరణ్‌రావు ఆధ్వర్యంలో మేడిపల్లిలో రైతులు, బండెనుక బండి కట్టి కదిలారు. ఇటు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకు చెందిన రైతులు 2,200 ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. 


జగిత్యాల, నమస్తే తెలంగాణ/ జగిత్యాల :  కొత్త రెవెన్యూ చట్టానికి రైతులందరూ సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో తరలివస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల అర్బన్‌, జగిత్యాల రూరల్‌, సారంగాపూర్‌, రాయికల్‌, బీర్‌పూర్‌ మండలాల నుంచి వేలాది మంది రైతులు 2 వేల ట్రాక్టర్లతో జగిత్యాలకు ర్యాలీగా తరలివచ్చారు. ముందుగా ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల నుంచి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వొద్దినేని హరిచరణ్‌రావు, జగిత్యాల, రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్లు బోగ శ్రావణి, మోర హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు అంతా కలిసి నృత్యాలు చేశారు. అనంతరం అక్కడే తెలంగాణ తల్లి విగ్రహానికి, సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జడ్పీ ఉపాధ్యక్షుడు హరిచరణ్‌రావు ఆధ్వర్యంలో మేడిపల్లిలో ఎడ్లబండ్లతో ర్యాలీ తీశారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి రైతులు 100 ఎడ్లబండ్లతో తరలివచ్చారు. 

పెద్దపల్లిలో హోరు..

పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్‌, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, పెద్దపల్లి మండలాల నుంచి దాదాపుగా 2,200 ట్రాక్టర్లతో రైతులు పెద్దపల్లి పట్టణానికి బయలుదేరారు. వాహనాలకు ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను కట్టుకొని, సీఎం కేసీఆర్‌కు జై కొడుతూ ర్యాలీగా చేరుకున్నారు. సుల్తానాబాద్‌ నుంచి పెద్దపల్లి వరకు రాజీవ్హ్రదారి ట్రాక్టర్ల ర్యాలీతో నిండిపోయింది. రైతుల కష్టాలు తెలిసిన పాలకుడిగా.. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు అన్నదాతలు జేజేలు పలికారు. కమాన్‌ ఏరియా ప్రాంతంలోని జెండా చౌక్‌లో ముఖ్యమంత్రి భారీ చిత్రపటానికి ఎంపీ, ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అనంతరం పట్టణంలోని అయ్యప్ప టెంపుల్‌ ఏరియాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి, బస్టాండ్‌ చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేశారు. ర్యాలీ సందర్భంగా దారిపొడవునా డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్ల మధ్య రైతులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆడిపాడి నృత్యాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రైతులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందజేశారు. 

భూమిపై రైతులకే పూర్తి హక్కు.. 

రైతన్న దశాబ్దాల బాధలను పోగొట్టి, భూములకు రక్షణ కల్పించేందుకే సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చారు. భూమిపై రొమ్ము విరుచుకొని నడిచే హక్కు కేవలం హలం పట్టి పొలం దున్నే రైతులకే ఉంటుందనేది కేసీఆర్‌ విధానం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిగా.. రైతు బిడ్డగా.. ఆత్మహత్యలు లేని తెలంగాణను చూడాలనే సంకల్పంతోనే రైతు బంధు, రైతు బీమా పథకాలను తెచ్చారు. 24గంటలు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో ఇక గట్టు, గెట్టు పంచాయతీలు ఉండవు. ఇకపై దళారీ వ్యవస్థ కూడా ఉండదు. భూమిపై రైతులకే పూర్తి హక్కు ఉంటుంది. 

- బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, పెద్దపల్లి ఎంపీ

సీఎం కేసీఆర్‌ పాలనాదక్షుడు

రాష్ట్రంలో అనాదిగా వస్తున్న రెవెన్యూ విధానాలతో అనేక మంది బలయ్యారు. అలాంటి పరిస్థితులు ఉండవద్దనే ఉద్దేశంతోనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చారు. రైతు ఆధీనంలో ఉన్న ఇంచు భూమి కూడా న్యాయంగా, ధర్మంగా తనకే చెందేలా ఈ చట్టాన్ని రూపొందించారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్థికి పూర్తి రక్షణ ఉంటుంది. పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ప్రతి ఆస్తి రికార్డులోకి ఎక్కుతుంది. అందుకే ఇంత గొప్ప కొత్త చట్టాన్ని రైతులు స్వాగతిస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.  ఇవొక్కటే కాదు వందలాది పథకాల అమలు చేస్తూ పాలనా దక్షుడిగా సీఎం కేసీఆర్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిపోయారు. 

- దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే

సాహసోపేత నిర్ణయం 

గతంలో రైతులు భూ సమస్యలపై తహసీల్దార్‌ కార్యాలయాలు, సర్వేయర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టాన్ని తేవడం సాహసోపేత నిర్ణయం. రైతులకు మేలు జరుగుతుంది. కానీ, కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుతో చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులు వస్తాయి. వ్యవసాయ మార్కెట్లు రూ.200 కోట్లు నష్టపోతున్నాయి. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ సర్కారు రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం తధ్యం. 

- డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే

రైతును రాజుగా చేసేందుకే..

రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి, ప్రక్షాళన చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నది. కానీ, కేంద్రం రైతులను ముంచే చట్టాలను తెచ్చి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్నది. సీఎం కేసీఆర్‌ను తిట్టడమే లక్ష్యంగా నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ప్రెస్‌మీట్లు పెడుతున్నాడు. పసుపు పంటకు మద్దతు ధర, బోర్డు తీసుకువస్తానని చెప్పి ఏడాదిన్నర గడుస్తున్నా మాట మాట్లాడడం లేదు. ఆయన రైతులకు భేషరుతుగా క్షమాపణలు చెప్పాలి.  

- దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌