గురువారం 29 అక్టోబర్ 2020
Jagityal - Sep 30, 2020 , 02:08:30

నల్లసూర్యులకు తీపికబురు

నల్లసూర్యులకు తీపికబురు

  • సింగరేణిలో నేటి నుంచే మెడికల్‌ బోర్డు
  • రెండు రోజులపాటు టెస్ట్‌లు
  • కరోనా సంక్షోభంతో గత మార్చిలో పరీక్షలకు బ్రేక్‌ 
  • తాజాగా సీఎం ఆదేశాలతో యాజమాన్యం నిర్ణయం
  • ఫలించిన కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేల కృషి
  • 3వేల మంది కార్మికుల్లో సంతోషం 

కరోనా సంక్షోభంతో ఆరు నెలల కింద నిలిచిపోయిన సింగరేణి మెడికల్‌ బోర్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. సీఎం కేసీఆర్‌ ఆదేశా లతో మళ్లీ నేటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహించేందుకు యాజ మాన్యం నిర్ణయించింది. సింగరేణిలో కార్మికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు యాజమాన్యం మెడికల్‌ బోర్డులు నిర్వహిస్తున్నది. పని చేయలేని కార్మికులను ఆన్‌ఫిట్‌ చేసి, కారుణ్య నియామకాల కింద వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నది. ఫిట్‌గా ఉన్న కార్మికులను మళ్లీ విధులకు పంపిస్తుంది. ఈ క్రమంలో కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి సంస్థలో 59 మెడికల్‌ బోర్డులు నిర్వహించి, అర్హులైన 6,611మంది కార్మికులను ఇన్‌వాలిడేషన్‌ (మెడికల్‌ అన్‌ఫిట్‌) చేసి వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఈ క్రమంలో గత మార్చి నెలలో మెడికల్‌ బోర్డు జరుగగా, ఆ తర్వాత కరోనా విస్తరించడంతో బోర్డును నిలిపివేశారు. దీంతో అప్పటికే దరఖాస్తు చేసుకున్న మూడు వేల మంది కార్మికులు అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బోర్డు నిర్వహిస్తారని ప్రచారం జరిగినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిం ది. ఈ క్రమంలో కోల్‌బెల్ట్‌ ఏరియాకు చెందిన ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, కోరుకంటి చందర్‌, నడిపెల్లి దివాకర్‌రావు, గండ్ర వెంకట రమణారెడ్డి, తదితరులు కలిసి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణిలో వెంటనే మెడికల్‌ బోర్డు నిర్వహించాలని కోరారు. స్పందించిన కేసీఆర్‌, వెంటనే ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే సింగరేణి ఉన్నతాధికారులు బోర్డు ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ క్రమంలో తొలి విడతగా రివ్యూ కోసం వేచి చూస్తున్న 50మందికి, బోర్డుకు దరఖాస్తు చేసుకున్న మరో 50 మందికి మొత్తం 100మందికి బుధ, గురువారాల్లో మెడికల్‌ బోర్డు నిర్వహించనున్నారు. మిగతావారికి వచ్చే ఆరు నెలల్లో బోర్డుకు పిలువనున్నారు. 

మూడు వేల మంది దరఖాస్తు

అన్‌ఫిట్‌ అయిన వారసులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలతో ఇప్ప టికే 3వేల మంది మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్ల సర్వీసు నిబంధన ఉంది. రెండేళ్ల సర్వీసు ఉండి బోర్డులో అన్‌ఫిట్‌ అయితేనే వారి వారసులకు ఉద్యోగం ఇచ్చే వీలుంటుంది. అయితే గత మార్చికి ముందే చాలా మంది రెండేళ్ల సర్వీసు ఉన్న కార్మికులు దరఖాస్తు చేసుకొని వేచి చూస్తుండడం, కరోనా కారణంగా బోర్డు నిలిచిపోవ డంతో రెండేళ్ల సర్వీసు నిబంధనను సడలించాలని టీబీజీకేఎస్‌ కోర డంతో యాజమాన్యం ఒప్పుకుంది. ఈ క్రమంలో నేటి నుంచి మెడి కల్‌ బోర్డు ప్రారంభమైతున్న నేపథ్యంలో 3వేల పైచిలుకు కార్మికులను వచ్చే ఆరు నెలల్లో బోర్డుకు పిలిచి వారికి పరీక్షలు చేయనున్నారు. 

కేసీఆర్‌ ఆదేశాలతోనే బోర్డు 

 సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మళ్లీ మెడికల్‌ బోర్డు నిర్వహణకు మోక్షం లభించింది. కరోనా కారణంగా నిలిచిపోయిన బోర్డును తిరిగి ప్రారంభించేందుకు గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ తరపున తాము తీవ్రంగా కృషి చేశాం. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌, తాను కలిసి ఇటీవల కోల్‌బెల్ట్‌కు చెందిన ఎమ్మెల్యేలకు విన్నవించాం. మా అందరి కృషితోనే మళ్లీ బోర్డు ప్రారంభమైంది. అయితే ఇటీవలి కాలంలో సింగరేణి సంస్థలో అనేక తప్పుడు ప్రచారాలు జరిగాయి. మెడికల్‌ బోర్డు ఉండదని, భవిష్యత్‌లో కారుణ్య నియామకాలే ఇవ్వరని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ప్రచారం చేసి కార్మికులను అయోమయంలో పడేశారు. ఇప్పటికైనా కార్మికులు వాళ్లను నమ్మవద్దు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ మొదటి నుంచీ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న విషయాన్ని మరిచిపోవద్దు. ఇప్పటికే మూవేల మంది దరఖాస్తు చేసుకున్నందున సీనియారిటీ ప్రకారంగా బోర్డుకు అనుమతించే విధంగా కృషి చేస్తున్నాం. డాక్టర్ల కొరతను నివారించి ప్రతి నెల 3 బోర్డులు నిర్వహించి, 600 మందికి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాం. రివ్యూ కోసం వేచి చూస్తోన్న 200 మందిలో మొదటి విడతలో 50మందికే అనుమతించారు. మిగతా కార్మికులకు త్వరలోనే రివ్యూ నిర్వహిస్తాం. ఏది ఏమైనా కార్మికుల పక్షపాతిగా ఉన్న సీఎం కేసీఆర్‌కు టీబీజీకేఎస్‌ తరపున కృతజ్ఞతలు చెబుతున్నాం. 

- మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శిlogo