గురువారం 22 అక్టోబర్ 2020
Jagityal - Sep 26, 2020 , 02:04:29

గాన గంధర్వుడికి నివాళి

గాన గంధర్వుడికి  నివాళి

  • ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణవార్తతో దిగ్భ్రాంతి lజిల్లాతోనూ అనుబంధం  
  • జ్ఞాపకాలను నెమరేసుకున్న అభిమానలోకం lసంతాపం ప్రకటించిన ప్రజాప్రతినిధులు, కళాకారులు

జగిత్యాల, నమస్తే తెలంగాణ/ కోల్‌సిటీ:  గాన గంధర్వుడు, పండితారాధ్యుల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఉమ్మడి జిల్లాతోనూ అనుబంధం ఉన్నది. ఇక్కడి గాయకులు, కళాకారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన 1979 లో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి చెల్లెలు ఎస్పీ శైలజతో కలిసి వచ్చారు. అప్పుడు స్థానిక జనం చూపిన అభిమానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తర్వాత కూడా జిల్లా కళాకారులతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించారు. జిల్లాకు చెందిన పలువురు గాయకులు బాలుతో పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. తాజాగా ఆయన మరణవార్తతో అభిమానులు దిగ్భాంతి లోనయ్యారు. ఆయ న లేడనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయన గాత్రాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడిపెడుతున్నారు. ‘ఒక్కడై రావ డం.. ఒక్కడై పోవడం..’ అంటూ జీవిత సత్యాన్ని చెప్పి నా.. ‘మాటేరాని చిన్నదాని కళ్లుపలికే మాటలు’ అంటూ మైమరపించినా.. ‘జో పాపా లాలీ’ అంటూ జోలపాడినా అది బాలుకే చెల్లుతుందని చెబుతున్నారు. ఇటు మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సంతాపం వ్యక్తం చేశారు. బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొన్నం రవిచంద్ర, సాహితీ గౌతమి, జాతీయ సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ గండ్ర లక్ష్మణరావు, గాజు ల రవీందర్‌, కేబీ శర్మ, నంది శ్రీనివాస్‌, స్తంభంకాడి గంగాధర్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. అలాగే, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కళాకారుల, కళా సంస్థల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వై అనిల్‌కుమార్‌గౌడ్‌, సామాజికవేత్త ఏ కిరణ్‌కుమార్‌, ఉదయ సాహితీ ఆధ్వర్యంలో డాక్టర్‌ వైరాగ్యం ప్రభాకర్‌, తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాస్యం సేనాధిపతి, కలువకుంట తిరుపతి, స్వరమాధురి కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంస్థ కరీంనగర్‌ శాఖ అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు, జానపద వృత్తి కళాకారుల సమా ఖ్య ఆధ్వర్యంలో బీ గోపాల్‌రావు, కే రమణ, సల్వా ది ప్రవీణ్‌, కృపాదానం, సాల్మన్‌ రాజు, ప్రకాశ్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు డాక్టర్‌ వసంతరావు, కార్యదర్శి డాక్టర్‌ రాంకిషన్‌, సీనియర్‌ వైద్యు లు వీ భూంరెడ్డి సంతాపం తెలిపారు. 

కొవ్వొత్తులతో నివాళి

తెలంగాణచౌక్‌:  బాల సుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా కరీంనగర్‌ జిల్లా సంగీత కళాకారుల సంక్షేమ సంఘం నేతలు తెలంగాణచౌక్‌లో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. సినీ రం గానికి బాలు చేసిన సేవలను కొనియాడారు.  

ఎందరికో స్ఫూర్తి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎందరికో స్ఫూర్తి. యాభై వేలకు పైగా పాడి అలరించారు. ఆయన గొంతునుంచి బయటకు వచ్చిన ఎన్నో పాటలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఆయన పాడుతా తీయగ ద్వారా ఎంతోమంది యువ గాయకులకు అవకాశం కల్పించి, వారిని కళారంగానికి పరిచయం చేశారు. ఈ రోజు ఆయన అకాల మరణం సంగీత రంగానికి తీరని లోటు. 

- గజేందర్‌ రెడ్డి, తెలుగు రక్షణ వేదిక 

మరిచిపోలేనివి 

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పెండ్యాల వంశీ స్మారక పురస్కార ప్రధానోత్సవంలో ఎస్పీ బాలును కలుసుకోవడం ఒక మరిచిపోలేని జ్ఞాపకం. ఆ సందర్భంగా ఆయనకు సినారె రచించిన నిత్య చైతన్యశీలి పుస్తకాన్ని బహూకరించాను. ఈ క్రమంలో ఆయనతో పలు విషయాల గురించి మాట్లాడాను. ఆ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరువను. 

- మాడిశెట్టి గోపాల్‌, ప్రముఖ వ్యాఖ్యాత 

పాటకు తీరని లోటు..

ఎస్పీ బాలు సంగీతానికి, నేపథ్య గీతానికి చేసిన సేవ అద్భుతమైనది.   ఔత్సాహిక గాయకులను వెలుగులోకి తెచ్చేందుకు, వారిని మరింత మెరుగైన గాయకులుగా మార్చేందుకు అహర్నిషలు కృషి చేశారు. 20ఏళ్ల క్రితం పాడుతా తీయగకు ఎంపికై, ఆయన ముందు పాడే అవకాశం లభించింది. ఆయన మృతి తీరని లోటు.  

- గుండి జగదీశ్వర్‌, సింగర్‌logo