మంగళవారం 20 అక్టోబర్ 2020
Jagityal - Sep 25, 2020 , 02:28:05

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూత

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూత

  • కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి: మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గురువారం పట్టణ శివారులోని పెద్దచెరువులో 1.20 లక్షల చేపల పిల్లలను మత్స్యకారుల (గంగపుత్రులు)తో కలిసి వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందించడమే కాకుండా వృత్తికి అవసరమైన వాహనాలు, పనిముట్లను రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. చేపపిల్లల పంపిణీ దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు తోపారపు నాగయ్య, మున్సిపల్‌ అధ్యక్షురాలు సుజాత, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, మత్స్యశాఖ అధికారి అశోక్‌, సంఘం నాయకులు నర్సయ్య, సాయన్న, గంగాధర్‌, పోచయ్య, కిషన్‌ పాల్గొన్నారు. 

కోరుట్ల: సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణ శివారులోని తాళ్ల చెరువు, పాలమాకుల, మద్దుల చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100 శాతం రాయితీపై మంజూరైన 82 వేల చేప పిల్లలను గురువారం విడుదల చేశారు. అనంతరం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గంలోని 110 మంది దివ్యాంగులకు ఏడీఐపీ ద్వారా మంజూరైన రూ. 47 లక్షల 20 వేల విలువైన బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లను కలెక్టర్‌ గుగులోత్‌ రవితో కలిసి పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గంగపుత్రుల అభివృద్ధి కోసం నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లో రూ. 26 లక్షల విలువైన చేప పిల్లలను వదలనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 389 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు మంజూరు కాగా కోరుట్ల నియోజకవర్గానికి 120 సైకిళ్లు వచ్చాయన్నారు. ప్రతి దివ్యాంగుడికి సైకిళ్లు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. బ్యాటరీని ఒక్కసారి చార్జి చేస్తే 40 కిలో మీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. సాంకేతిక సమస్య తలెత్తితే అధికారులు సూచించిన సెల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజనల్‌ అధికారి వినోద్‌కుమార్‌, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకటరావు, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్లు లావణ్య, సుజాత, ఉపాధ్యక్షులు పవన్‌, చంద్రశేఖర్‌రావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్‌, కౌన్సిల్‌ సభ్యులు, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, తహసీలార్లు, ఎంపీడీవోలు, కుల, యువజన సంఘాల ప్రతినిధులు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.logo