శనివారం 05 డిసెంబర్ 2020
Jagityal - Sep 24, 2020 , 01:38:30

వందశాతం ఎల్‌ఆర్‌ఎస్‌ సాధించాలి

వందశాతం ఎల్‌ఆర్‌ఎస్‌ సాధించాలి

  • n కలెక్టర్‌కు రాష్ట్ర చీఫ్‌   సెక్రటరీ ఆదేశం
  • n అధికారులతో వీసీ

కార్పొరేషన్‌: గ్రామ, పట్టణ స్థాయిలో ఆమో దం లేని లే అవుట్స్‌, ప్లాట్లను గుర్తించాలని, వందశాతం ఎల్‌ఆర్‌ఎస్‌ సాధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. సీఎంఆర్‌, ఎల్‌ఆర్‌ఎస్‌, పల్లె ప్రకృతి వనాలు, స్ట్రీట్‌ వెండర్స్‌ రుణాలు, రైతు వేదికలు, పట్టణ ప్రగతిలో నర్సరీలు, అర్బన్‌ ట్రీ, పార్కులు, పల్లె ప్రకృతి కార్యక్రమాలపై కలెక్టర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, గ్రామీణాభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్‌ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) లక్ష్యాన్ని వచ్చే 7 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. రైతు వేదికలు అన్ని హంగులతో పూర్తి చేయించాలని, పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. పట్టణ పరిధిలో వీధి వ్యాపారులకు రుణాలు అందించేందుకు అర్హులను గుర్తించాలని, ప్రభుత్వ సహాయాన్ని అందజేయాలని, 5 శాతం రుణ మంజూరు కచ్చితం గా సాధించాలని సూచించారు. గ్రామ, పట్టణ స్థాయిలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలందరికీ తెలియజేసేలా ప్రచారం చేయించాలని ఆదేశించారు. పట్టణ స్థాయిలో మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించి ఎల్‌ఆర్‌ఎస్‌ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా అర్బన్‌ పార్కులకు స్థలం గుర్తింపు వివరాలను అప్‌లోడ్‌ చేయాలని, ఈ నెల 30వ తేదీలోగా నర్సరీల ఏర్పాటుకు స్థలాల ఎంపిక, నిర్వహణపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు అమలయ్యేలా చర్య లు తీసుకోవాలన్నారు. 2021 సంవత్సరంలో మొక్కలు నాటేందుకు కావాల్సిన నర్సరీల వివరాలపై యాక్షన్‌ సిద్ధం చేయాలన్నారు.హౌస్‌ హోల్డ్‌ ప్లాంటేషన్‌లో భాగంగా ప్రతి ఇంటికి అందజేసిన 6 మొక్కల వివరాలను సమర్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ సీఎంఆర్‌, ఎల్‌ఆర్‌ఎస్‌, పల్లె ప్రకృతి వనాలు, వీధి వ్యాపారులకు రుణాలు, రైతు వైదిక నిర్మాణాలు, పట్టణ, పల్లె ప్రగతి నర్సరీలు, ట్రీ పార్కుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తున్నామని, అలాగే ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామన్నారు. కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్‌లాల్‌, నర్సింహారెడ్డి, డీఆర్వో వెంకటమాధవరావు, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, డీపీవో బుచ్చయ్య, డీఏవో శ్రీధర్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

పనుల్లో పారదర్శకత ఉండాలి 

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)  జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనుల్లో పారదర్శకత ఉండాలని కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాల పనుల పురోగతిపై  కలెక్టరేట్‌ సమావేశమందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన ప్రకృతి వనాల పనుల్లో అలసత్వం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల్లో నిర్దేశించిన పల్లె ప్రకృతి వనాలు చాలా వరకు పూర్తయినా వాటిని అప్‌లోడ్‌ చేయకపోవడంతో అధికారులు పని చేయనట్టేనని పేర్కొన్నారు. పనులు 50 శాతం జరిగినా వెబ్‌ రిపోర్టులో 5 శాతం ఉండడం సరికాదని పేర్కొన్నారు. ఎంపీడీవోలు జరిగిన పను లు, చెల్లింపులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో డీఎల్‌పీవోలు దృష్టి సారించాలన్నారు. పనుల పురోగతిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. జిల్లాలో పల్లె ప్రకృతి వనాలకు అవసరమైన 200 ఎకరాల భూములు గుర్తించామని, వాటిలో కనీసం 50 శాతం కూడా పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మండలాల వారీగా జరిగిన పనుల పురోగతి, చేపట్టిన పనుల చెల్లింపులపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రతి మండలంలో ఒక పార్క్‌ను మోడల్‌గా తయారు చేయాలని, ఈ పార్కులో అరుదైన మొక్కలు నాటి పల్లెల్లో ప్రకృతి వనాల ద్వారా కొత్త శోభను అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, అదనపు పోలీస్‌ కమిషనర్‌ (ట్రైనీ) రష్మి పెరుమాళ్‌, డీఆర్వో వెంకటమాధవరావు, డీపీవో బుచ్చయ్య, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు ఉన్నారు.